‘పట్టు’ వదిలేశారు!

ABN , First Publish Date - 2022-05-24T05:23:27+05:30 IST

ఒకప్పుడు ఆత్మకూరు మల్బరీ సాగులో వెలిగిపోయేది.

‘పట్టు’ వదిలేశారు!
క్రాస్‌బీడ్‌తో తయారైన పసుపురంగు పట్టు

  1.  ఆత్మకూరులో గణనీయంగా తగ్గిన మల్బరీ సాగు 
  2. 5వేల ఎకరాల నుంచి 150 ఎకరాలకు..
  3. ధరల స్థిరీకరణ లేకపోవడమే కారణం 
  4. తీవ్ర ప్రభావం చూసిన సరళీకరణ విధానాలు 
  5. పట్టు పరిశ్రమ శాఖలో సిబ్బంది నియామకాల్లో జాప్యం
  6. ఆలస్యంగా అధికారుల కసరత్తు  

 

‘కర్ణుడి చావుకు కోటి కారణాల’న్నట్టుగా తయారైంది పట్టు పరిశ్రమ పరిస్థితి. ఒకప్పుడు  మల్బరీ సాగు పేరు చెబితే ఆత్మకూరు గుర్తుకు వచ్చేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ విధానాలు...మల్బరీ సాగులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం..గిట్టుబాటు కాని ధరలు...ఈ పరిశ్రమను దెబ్బతీశాయి.


ఆత్మకూరు, మే 23: ఒకప్పుడు ఆత్మకూరు మల్బరీ సాగులో వెలిగిపోయేది. అంతకుముందున్న సంప్రదాయ వ్యవసాయాన్ని పట్టు గుడ్ల ఉత్పత్తి సమూలంగా మార్చేసింది.  రాష్ట్రంలోనే  మల్బరీ సాగులో ఆత్మకూరుకు ప్రత్యేక స్థానం ఉండేది. రైతులు మంచి లాభాలు గడించేవారు. అదంతా గత వైభవం. 1978లో మల్బరీ సాగు విస్తారంగా మొదలై... 1990లలో కుదేలు కావడం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానాలు దేశీయ పరిశ్రమను కుప్పకూల్చేశాయి.  ఆత్మకూరులో కూడా మల్బరీ సాగు క్రమంగా పడిపోయింది. ఇవాళ మల్బరీ సాగు ఈ ప్రాంత వాసులకు ఒక పురా వైభవమనే చెప్పవచ్చు. దీని నుంచి పట్టు పరిశ్రమను బయట పడేయడానికి అధికారులు  కసరత్తు చేస్తున్నారు. కానీ మళ్లీ మల్బరీ ఆ పట్టు సంపాదించుకోగలదా? అనే ప్రశ్నలకు సమాధానం కరువవుతోంది.

ఇదీ పరిస్థితి

  ఆత్మకూరు ప్రాంతంలో రెండున్నర దశాబ్దాల కిందట వేల ఎకరాల్లో మల్బరీ సాగయ్యేది. ఇప్పుడు కేవలం వందల ఎకరాల్లోనే సాగవుతోంది. ఇది కేవలం రైతులకు ఆసక్తి లేక కాదు. ఒకప్పుడు మల్బరీ సాగుతో రైతులు గణనీయంగా లాభాలు గడించారు. ప్రభుత్వ విధానాల వల్ల క్రమంగా పట్టు పరిశ్రమ కుదేలైంది. ఆత్మకూరు ప్రాంతంలో మల్బరీ సాగు, పట్టు గుడ్ల పెంపకంలో లాభాలు తగ్గిపోయాయి. 1978లో ఆత్మకూరులో ఏర్పాటు చేసిన పట్టు గుడ్ల ఉత్పత్తి కేంద్రంలో పసుపు రంగు గల క్రాస్‌ బ్రీడ్‌ గుడ్లను ఉత్పత్తి చేసేవారు. వాటిని చాకిసెంటర్ల ద్వారా పురుగులను పొదిగిస్తారు. ఈ పట్టు పురుగులకు  రేరింగ్‌ షెడ్లలో నిర్దేశిత ఉష్ణోగ్రతల మధ్య మల్బరీ ఆకులను ఆహారంగా వేసి పోషిస్తారు. 25నుంచి 30 రోజుల మధ్య పట్టుపురుగు లార్వా దశకు చేరుకుంటుంది. అప్పుడు వాటిని పట్టు త్పత్తి కేంద్రాలకు విక్రయిస్తారు. ఈ ప్రక్రియ సజావుగా సాగితే మల్బరీసాగులో రైతులకు భారీ ఆదాయం వస్తుంది. దీంతో అప్పట్లో కంది, మినుము, మొక్కజొన్న, వేరుశనగ లాంటి వాణిజ్య పంటల వైపు వెళ్లకుండా మల్బరీ సాగుపైనే రైతులు ఆసక్తి చూపేవారు. ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, నంద్యాల, జూపాడుబంగ్లా, మిడ్తూరు, పగిడ్యాల, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, బనగానపల్లి, చాగలమర్రి, అవుకు, సంజామల,  బనగానపల్లి, బేతంచర్ల, ప్యాపిలి, డోన మండలాల్లో ఒకప్పుడు సుమారు 10వేల ఎకరాలకు పైగా మల్బరీ పంటను సాగుచేసేవారు. వీటిలో ఒక్క ఆత్మకూరు మండలంలోనే 5వేల ఎకరాల వరకు  సాగయ్యేది. దీంతో మల్బరీ సాగులో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలోని హిందూపురం, కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు డివిజన్లు ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాయి.  ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేవలం 3,800 ఎకరాల్లో   మాత్రమే మల్బరీ సాగవుతోంది. ఇది చాలు ప్రస్తుతం పట్టు పరిశ్రమ దుస్థితిని అర్థం చేసుకోవడానికి.  


1996 నుంచి తగ్గుముఖం : 

  1996కు ముందు ఆత్మకూరు డివిజనలో మల్బరీసాగు ఎంతో ఆశాజనకంగా ఉండేది. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు పట్టు గుడ్ల సరఫరా జరిగేది.   అప్పటి వరకు దేశీయ సిల్క్‌ ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉండేది. కానీ సరళీకరణ విధానాల వల్ల 1996 నుంచి విదేశాల నుంచి సిల్క్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు భారత అంగీకరించింది. చైనా నుంచి భారీ స్థాయిలో దేశానికి సిల్క్‌ ఉత్పత్తులు వచ్చాయి. దీనికి తోడు అక్కడి వాతావరణ పరిస్థితులు మల్బరీ సాగుకు అనుకూలంగా ఉండటంతో మన  ఉత్పత్తుల కంటే నాణ్యమైన సిల్క్‌ దిగుమతి అయ్యేది.  దీంతో దేశీయ ఉత్పత్తులకు ఆదరణ తగ్గిపోయింది. ధరలు పతనమయ్యాయి. క్రమంగా రైతులకు మల్బరీసాగు పట్ల ఆసక్తి సన్నగిల్లింది. పైగా దీనిలో సున్నితమైన సస్యరక్షణ పనులు ఉంటాయి. వీటికి కూలీ రేట్లు అధికం. అయినప్పటికీ మార్కెట్‌లో గిరాకీ ఉన్నంత కాలం ఇక్కడి రైతులు మల్బరీ సాగు చేశారు. ఆ తర్వాత ఇక సాధ్యం కాదని తేల్చుకున్నాక పట్టును వదిలేశారు.  దీని వల్ల ఇప్పుడు ఆత్మకూరు మండలంలో  కేవలం 150 ఎకరాలకే మల్బరీ పడిపోయింది. . 

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి : 

 గతంలో మల్బరీ పంటను సాగుచేసిన రైతులు మొక్కజొన్న, మినుము, కంది, వేరుశనగ, శనగ లాంటి పంటలపై దృష్టి పెట్టారు. వీటి సస్యరక్షణకు అధికంగా రసాయన ఎరువులను, క్రిమిసంహారక మందులను వాడుతున్నారు. అయితే ఎక్కడో ఒక చోట మల్బరీసాగు చేస్తునప్పటికీ పక్కనే ఉండే వాణిజ్య పంటలకు వాడే రసాయన మందుల ప్రభావం వల్ల మల్బరీ తోటలకు ముప్పు వాటిల్లుతోంది. దీని సాగు తగ్గిపోవడానికి ఇది కూడా కారణమే.  

1991 నుంచి పట్టు పరిశ్రమ శాఖలో నియమాకాలు నిల్‌ :

 ప్రతి ప్రభుత్వ శాఖలో ఉద్యోగుల నియామకాలు నిరంతరం జరుగుతుంటాయి.  పట్టు పరిశ్రమ శాఖలో మాత్రం 1991 నుంచి ఇప్పటివరకు ఒక్క ఉద్యోగిని కూడా కొత్తగా నియమించలేదు. ఈ శాఖలో 2008 నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు మొదలయ్యాయి. కొందరు ఉద్యోగులు మృతిచెందారు. నంద్యాల జిల్లా పట్టు పరిశ్రమ శాఖలో పరిధిలో 133 మంది ఉద్యోగులు ఉండాలి.  కానీ 52 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కేవలం 20 మంది మాత్రమే టెక్నికల్‌ విధులు చేస్తున్నారు. టెక్నికల్‌ ఉద్యోగులు ఫీల్డ్‌ విజిట్‌ చేస్తూ మల్బరీ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి. సిబ్బంది కొరత వల్ల  ప్రభుత్వ రాయితీ పథకాలు రైతులకు చేరడం లేదు. మల్బరీ సాగు తగ్గిపోవడానికి ఇది కూడా కారణమే.  

 బతికించేందుకు రాయితీలు  : 

 దేశీయ పట్టు పరిశ్రమను బతికించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడరాని పాట్లు పడుతున్నాయి. మల్బరీ సాగుచేసే రైతులను ప్రోత్సహించేందుకు రాయితీ పథకాలను ప్రవేశపెట్టాయి. వీటిలో మల్బరీ సాగు చేసే రైతులకు ఎకరాకు మొక్కలు నాటేందుకు యూనిట్‌ విలువ రూ.14వేలు ఉండగా అందులో రైతు వాటా రూ.3500, రూ.10,500 రాయితీ ఇస్తున్నారు. రేరింగ్‌ గది నిర్మాణానికి సైజుల ఆధారంగా యూనిట్‌ విలువ రూ.4లక్షలు కాగా... రూ.3లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు. రేరింగ్‌ పరికరాలు రూ.70వేలు ఉండగా అందులో రాయితీ రూ.52,500 ఇస్తున్నారు.  చాకీ పురుగులకు  రూ.750 సబ్సిడీని ఇస్తున్నారు. వ్యాధి నిరోధకాల నివారణకు రూ.5వేలు విలువ గల పురుగు మందుల్లో 75శాతం సబ్సిడీ ఇస్తున్నారు. విదేశీ పట్టుగుళ్లపై కిలో రూ.50 చొప్పున పరిమాణంతో సంబంధం లేకుండా మార్కెట్‌లో చెల్లిస్తున్నారు. రాషీ్ట్రయ కృషి వికాస్‌ యోజన పథకం కింద మల్బరీ సాగుకు... భూసారాన్ని పెంచేందుకు 50 శాతం రాయితీపై సూక్ష్మపోషకాలు, వేపచెక్కను సమకూరుస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా సులభతరంగా మల్బరీ ఆకులను కత్తిరించేందుకు బ్రష్‌ కట్టర్లను, వ్యాధి నిరోధకాలను పిచికారి చేసేందుకు పవర్‌స్పేయర్లను, కొమ్మలను కత్తిరించేందుకు సికేచర్లను 50శాతం రాయితీపై ఇస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటేందుకు ఎకరాకు రూ.40వేలు, షెడ్డు నిర్మాణానికి రూ.6లక్షల వరకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. వీటిలో కేంద్ర ప్రభుత్వ  పథకాలు సక్రమంగా అమలవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంలో జాప్యం ఉన్నట్లు  తెలుస్తోంది. 

సాగు ఖర్చు తగ్గించేందుకు తెల్లగుడ్ల పంపిణీ : 

 ఒకప్పుడు పట్టును ఉత్పత్తి చేయడానికి ఖర్చులు అధికంగా ఉండేవి.   ప్రస్తుతం తెల్లగుడ్ల రకంతో ఖర్చుల భారం తగ్గింది. నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తున్నాయి. మల్బరీసాగు చేస్తున్న రైతులకు పట్టు పరిశ్రమ శాఖ ద్వారా కావాల్సిన ఇండెంట్‌ మేరకు స్టేట్‌ సిల్క్‌ఫామ్‌ సీడ్‌ ఆర్గనైషన ద్వారా పెనుగొండ, పలమనేరు నుంచి గుడ్లను దిగుమతి చేస్తున్నారు. అత్యధికంగా గుడ్లు అవసరమైతే నేషనల్‌ స్కిల్‌ ఫామ్‌ సీడ్‌ ఆర్గనెజేౖషన్లు ఉన్న బెంగుళూరు, మైసూరు నుంచి కూడా తెల్లగుడ్లను తెప్పించి రైతులకు పంపిణీ చేస్తున్నారు. వీటిని ట్రేసిస్టర్‌ ద్వారా కాకుండా షూట్‌రీరింగ్‌ సిస్టమ్‌ ద్వారా పట్టును ఉత్పత్తి చేస్తున్నారు. వైట్‌సిల్క్‌కు మార్కెట్‌లో మంచిగిరాకీ ఉండటంతో చాలా మంది ఈ రకం గుడ్లతోనే పట్టుఉత్పత్తికి మక్కువ చూపుతున్నారు. ఇదిలావుంటే అనేక పరిణామాల వల్ల ప్రస్తుతం చైనా నుంచి సిల్క్‌ ఉత్పత్తుల దిగుమతి నిలిచిపోయింది. దీంతో  దేశీయ సిల్క్‌ ఉత్పత్తులకు కొంత మేర ఊరట లభించింది. ఇప్పటికైనా మన పట్టు ఉత్పత్తులకు మంచి ఆదాయం సమకూరితే తిరిగి మల్బరీ సాగు పెరిగే అవకాశం ఉంది.  

ఆత్మకూరులో వృఽథాగా భారీ భవన సముదాయం : 

 ఆత్మకూరు ప్రాంతంలో అత్యధికంగా మల్బరీ సాగవుతున్న 1978లో కరివేన గ్రామ సమీపంలో పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. ఈ కేంద్రంలో ప్రధానంగా ఆడ, మగ పురుగులతో క్రాస్‌ బ్రీడ్‌ రకం గుడ్లను ఉత్పత్తి చేసేవారు. వాటిని   రైతులకు  పంపిణీ చేసేవారు. ఈ ప్రాంతంలో సుమారు 25 ఏళ్లుగా మల్బరీసాగు తగ్గుముఖం పట్టింది.   పట్టుతయారీలో క్రాస్‌బీడ్‌ గుడ్ల రకానికి బదులు తెల్లగుడ్లను వినియోగించడం మొదలైంది. ఈ కారణాల వల్ల భారీ స్థాయిలో నిర్మించిన భవనాలన్నీ  నిరపయోగమయ్యాయి. దీంతో ఇటీవల కొత్తగా ఏర్పడిన ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయానికి ఈ భవనంలోని మూడు గదులను కేటాయించారు. అప్పట్లో  మల్బరీ   సాగు కోసం కేటాయించిన భూమిని ఆ తర్వాత ప్రభుత్వ ఇసుక డంపింగ్‌ యార్డుగా మార్చేశారు. 

 అభివృద్ధికి చర్యలు - : రాజు, పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకుడు, ఆత్మకూరు 

 ఆత్మకూరు డివిజనలో  పట్టు పరిశ్రమ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు  చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం 150 ఎకరాల్లోనే మల్బరీ సాగవుతోంది. ఈ ఏడాది అదనంగా మరో 200ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యం నిర్దేశించాం. తక్కువ పెట్టుబడులతో ఏడాదికి 8 నుంచి 9 పంటలను తీసేందుకు అవకాశం ఉంది. రైతులు ఆసక్తి చూపితే మంచి దిగుబడులు పొందవచ్చు. దేశీయ సిల్క్‌ ఉత్పత్తులను పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పట్టు పరిశ్రమ రంగానికి అన్ని విధాలుగా చేయూతనిస్తోంది.  రాయితీ పథకాలతో మల్బరీ సాగును మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాం. 







Updated Date - 2022-05-24T05:23:27+05:30 IST