‘పట్టు’ తప్పుతోంది..!

ABN , First Publish Date - 2022-04-27T05:05:51+05:30 IST

ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పట్టు సాగులో పలమనేరు, కుప్పం కంటే ముందంజలో ఉండే మదనపల్లె ఏరియాలో ప్రస్తుతం ఆ పరిస్థితులు మచ్చుకైనా కనిపించడం లేదు.

‘పట్టు’ తప్పుతోంది..!
మార్కెట్‌లో అమ్మకానికి వచ్చిన పట్టుగూళ్లు

ప్రాభవం కోల్పోతున్న పట్టు పరిశ్రమ

నియామకాలు లేక నీరుగారుతూ..

మూత దశలో కొన్ని, తరలింపులో మరికొన్ని...


అన్నమయ్య జిల్లాలోని పడమటి ప్రాంతంలో పట్టు పరిశ్రమ పట్టు తప్పుతోంది. మల్బరీ పంట సాగే కాదు..ఆ పరిశ్రమకు సంబంధించిన అనుబంధ విభాగాలూ ప్రాభవం కోల్పోతున్నాయి. ఇందులో భాగంగా క్రమంగా ఆయా కార్యాలయాల్లో ఇప్పటికే కొన్ని మూతపడగా, మిగిలిన వాటిలో ఒకటి జిల్లా కేంద్రానికి తరలిపోగా, మరికొన్ని అదే బాటలో పయనిస్తున్నాయి. 



మదనపల్లె, ఏప్రిల్‌ 26: ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పట్టు సాగులో పలమనేరు, కుప్పం కంటే ముందంజలో ఉండే మదనపల్లె ఏరియాలో ప్రస్తుతం ఆ పరిస్థితులు మచ్చుకైనా కనిపించడం లేదు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు పట్టు పరిశ్రమ శాఖ రానురాను పట్టు తప్పడానికి కూడా కారణాలు చాలానే ఉన్నాయి. కరోనా లాక్‌డౌన్‌తో రెండేళ్లు పట్టు సాగు పడిపోగా, అంతకుముందు కరువు పరిస్థితులతో కుదేలైంది. వీటికి తోడు పట్టు పరిశ్రమ శాఖలో కొన్నేళ్లుగా ఉద్యోగులు, సిబ్బంది కొరత వెంటాడుతోంది. పదవీ విరమణ చేయడమే కానీ, నియామకాలు లేకపోవడంతో ఆ పోస్టు అక్కడికే అంతమవుతూ వస్తోంది. ఉన్న ఉద్యోగులు, సిబ్బందిని ఆయా విభాగాలకు సర్దుబాటు చేయడం, ఉన్నవారికే అదనంగా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది. ఉన్న కొంతమందిలోనూ వివిధ కారణాలతో మరణించగా, నిన్నా, మొన్నటికి పదవీ విరమణ చేయాల్సిన వారు కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన రెండేళ్ల పొడిగింపుతో ప్రస్తుతం కొనసాగుతున్నారు. అది కూడా లేకుండా ఉంటే ఆ శాఖలో ఉద్యోగుల సంఖ్యను వేళ్ల మీద లెక్కించే స్థాయికి పడిపోయే పరిస్థితి వచ్చేది. ఈ ప్రభావం సిల్కు డిమాండ్‌ వరకూ రాగా, ధరలు అమాంతం పెరిగాయి. ఫలితంగా పట్టుచీరల ఉత్పత్తి తగ్గిపోవడంతో కార్మికులకు పని తగ్గడంతో పాటు ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

- మదనపల్లె కేంద్రంగా పట్టు పరిశ్రమకు మంచి పట్టుంది. మల్బరీ మొక్క పెంపకం నుంచి సిల్కు ధారం తీయడం వరకూ ఆయా దశల్లో ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. వాటికి కార్యాలయాలు, ఉద్యోగులు, సిబ్బంది ఉండేవారు. కాలక్రమంలో వచ్చిన మార్పులు, ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రస్తుతం ఆ రంగం ఉనికికే ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

- మదనపల్లె-బెంగళూరు రహదారి పక్కన పట్టు పరిశ్రమ ఏడీ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం పరిధిలో అక్కడే పట్టుగుడ్ల అధికోత్పత్తి కేంద్రం, రైతులకు పట్టు సాగులో మెళకువలు, ఆ శాఖ పరంగా ప్రభుత్వం ఇచ్చే పథకాలను వివరించేందుకు మదనపల్లెతో పాటు, తంబళ్లపల్లెలో సాంకేతిక సేవా కేంద్రాలు ఉన్నాయి.

- అలాగే స్థానిక పుంగనూరు రోడ్డులో బైవోల్టన్‌ విత్తన పట్టుగూళ్ల విక్రయకేంద్రం...తాజాగా జిల్లాల విభజనతో జిల్లా కేంద్రం రాయచోటికి తరలిపోయింది. ఈ క్రమంలో ఇక్కడున్న జిల్లా స్థాయి విత్తన పట్టు గూళ్ల విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ (డీడీ) రాజశేఖర్‌ను జిల్లా సెరికల్చర్‌ అధికారి (డీఎస్‌వో)గా ప్రభుత్వం నియమించింది. దీంతో డీడీ కూడా అక్కడి డీఎస్‌వోగా వెళ్లిపోయారు. ఇక్కడ ఏడీ..ఇద్దరి సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు. అలాగే బి.కొత్తకోట మండలం హార్సిలీహిల్స్‌లోని విత్తన పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రం ఇదివరకే మూతపడగా, ఈ భవనాలకు కూడా అక్కడే క్రీడల విభాగం స్కౌడ్స్‌ అండ్‌ గైడ్స్‌కు అప్పగించారు. 

- హార్సిలీహిల్స్‌ కింది భాగంలో విశాలమైన మైదానంలో పట్టుమొక్కల పెంపకం కేంద్రం ఉంది. పట్టణంలోని ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌లో పట్టుగూళ్ల విక్రయ కేంద్రం, అదే ఆవరణంలో పట్టు గూళ్ల రీలర్ల శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా స్థాయులోని రీలర్ల శిక్షణ కేంద్రంలోని ఏడీని ఇతర విభాగానికి మార్పు చేసి, అక్కడే ఉన్న రెగ్యులర్‌ ఏడీ పర్యవేక్షణకు చేర్చే దిశగా చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

- మదనపల్లె ఏడీ కేంద్రం పరిధిలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల పరిధిలో 15 మండలాల్లో పట్టు సాగు పర్యవేక్షణ ఉండేది. ఈ కార్యాలయం పరిఽధిలో రైతులు సాగు చేసే మల్బరీపై అవగాహన కల్పించడంతో పాటు పట్టుసాగులో సాంకేతికత, ఇతర పంటలతో పోలిస్తే కలిగే లాభాలపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ కార్యాలయం పరిధిలో పనిచేయాల్సిన విభాగాలు, అనుబంధ కార్యాలయాల్లో 50 మందికిపైగా ఉద్యోగులు, సిబ్బంది స్థానంలో ప్రస్తుతం 20 మందికిలోపే ఉంటున్నారు. దీంతో ప్రధాన కార్యాలయం ఆవరణంలోని, హార్సిలీహిల్స్‌లోని పట్టుగుడ్ల అధికోత్పత్తి కేంద్రాలు క్రమంగా మూతపడ్డాయి. ప్రస్తుతం రైతులు కర్ణాటకతో పాటు పక్క జిల్లాలకు వెళ్లి గుడ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇక మదనపల్లె ఏడీ పరిధిలోని రెండు సాంకేతిక సేవా కేంద్రాలూ మూతదశకు చేరుకుంటున్నాయి. ఇక్కడి కార్యాలయంతో పాటు క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది లేక అవి కొట్టు మిట్టాడుతున్నాయి. రైతులంతా టమోటా సాగు వైపునకు మొగ్గు చూపడంతో మల్బరీ సాగు కూడా పట్టుతప్పిందని చెప్పవచ్చు. ఆది నుంచీ సంప్రదాయంగా సాగు చేస్తున్న వారితో పాటు టమోటా సాగుకు పెట్టుబడులు పెట్టలేని రైతులు మాత్రమే అక్కడక్కడా మల్బరీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పడమట రాయితీతో విస్తారంగా నిర్మించుకున్న పట్టు పురుగులు మేపే షెడ్లు కూడా మూతపడ్డాయి. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలమనేరు, కుప్పం తరహాలో మదనపల్లెలోనూ పట్టుగూళ్ల విక్రయ ఉంది. ఇక్కడికి జిల్లాతో పాటు సమీపంలోని కర్ణాటక, అనంతపురం జిల్లాలోని రైతులు కూడా గూళ్లు అమ్ముకునేవారు. ప్రస్తుతం వివిధ కారణాలతో ఆ కేంద్రం ఉనికే కోల్పోయింది. ఒకప్పుడు తాము పండించిన పట్టుగూళ్లను వందమంది రైతులు వరకూ ఈ కేంద్రానికి తెచ్చి అమ్ముకునేవారు. ప్రస్తుతం అయిదుగురికి మించి రావడం లేదు. రీలర్ల ప్రవర్తన, అధికారుల పర్యవేక్షణ, రైతులకు ప్రోత్సాహం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే ఆవరణంలో పట్టుగూళ్ల రీలర్ల కేంద్రం కూడా ఉంది. పట్టు గూళ్ల నుంచి సిల్కుధారం తీసే యూనిట్లు, రీలర్లు ఉన్నారు. వీరికి కావాల్సిన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ రాయితీలతో యూనిట్లు మంజూరు చేస్తూ, రీలర్ల పనితీరును పర్యవేక్షించే వ్యవస్థ ఇది. ఇలాంటి రీలింగ్‌ యూనిట్లు స్థానికంగా 36 కేంద్రాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ మార్కెట్‌కు పట్టుగూళ్లు రాకపోవడంతో రీలర్లు బయటి మార్కెట్లకు వెళ్లి గూళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మొత్తమ్మీద తీసుకుంటే పట్టు పరిశ్రమ శాఖలో ఉద్యోగుల నియామకం లేకపోవడంతో చివరికి మిగిలిన సిబ్బందే అక్కడ విభాగాధిపతులుగా ఇన్‌ఛార్జి హోదాలో కొనసాగుతున్నారు. ఒకటి నుంచి మూడు విభాగాల్లో వారంతా విధులు నిర్వహిస్తున్నారు.



Updated Date - 2022-04-27T05:05:51+05:30 IST