హమ్మయ్య.. తగ్గింది!

ABN , First Publish Date - 2022-05-22T07:25:27+05:30 IST

వాహనదారులకు చుక్కలు చూపుతూ.. జేబులకు చిల్లులు పెడుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి కాస్త ఊరట..!

హమ్మయ్య.. తగ్గింది!

పెట్రో మంట నుంచి ఊరట

ఐరన్‌, స్టీల్‌పై కస్టమ్స్‌ డ్యూటీని, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు- ముడి పదార్థాలతో పాటు ఉక్కు ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నాం. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.లక్ష కోట్లు, ఉజ్వల సిలిండర్‌పై రాయితీతో రూ.6,100 కోట్ల మేర రాబడి తగ్గుతుంది. మరోవైపు రాష్ట్రాలు సైతం పెట్రోల్‌/డీజిల్‌పై స్థానిక పన్నులు/ వ్యాట్‌ను తగ్గించాలి.

- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల 


ఎల్లప్పుడూ ప్రజల పక్షానే..

ఎప్పటికీ మాకు ప్రజలే ముఖ్యం. పెట్రోల్‌-డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు వారికి రోజువారీ జీవనంలో ఉపశమనం కలిగిస్తుంది. పెట్రో ధరల గణనీయ తగ్గింపుపై తాజా నిర్ణయం.. వివిధ రంగాల విషయంలో సానుకూల ప్రభావం చూపుతుంది.

- ట్విటర్‌లో ప్రధాని మోదీ 


పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన కేంద్రం

హైదరాబాద్‌లో రూ.10.91 తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌పై 7.64


ఐరన్‌, స్టీల్‌పై కస్టమ్స్‌ డ్యూటీ, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు-ముడి పదార్థాలు,

ఉక్కు ముడి పదార్థాలపై దిగుమతి సుంకం కూడా తగ్గింపు

పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులకు సిలిండర్‌పై 200 సబ్సిడీ

వ్యవసాయానికి అదనంగా 1.10 లక్షల కోట్ల ఎరువుల రాయితీ

రాష్ట్రాలు స్థానిక పన్నులు తగ్గించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

నిరంతరం ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం: ప్రధాని మోదీ!

పెట్రోల్‌ మీద రూ.2.41, డీజిల్‌పై 1.36 పన్ను తగ్గించిన కేరళ

రూ.18 పెంచి.. రూ.8 తగ్గిస్తారా..?: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

2020 మార్చి ముందునాటి స్థితికి పెట్రోల్‌, డీజిల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ!


న్యూఢిల్లీ, మే 21: వాహనదారులకు చుక్కలు చూపుతూ.. జేబులకు చిల్లులు పెడుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి కాస్త ఊరట..! రూ.వెయ్యి దాటిన వంట గ్యాస్‌ ధరను చూసి బెంబేలెత్తుతున్న పేద మహిళలకు కొద్దిగా ఉపశమనం..! అంతర్జాతీయ పరిణామాలతో ఎరువుల ధరలపై గుబులు పెట్టుకున్న అన్నదాతకు కొంత భరోసా.. ఆకాశంలో ఉన్న ఇనుము, ఉక్కు ధరలను చూసి.. ఇల్లు కట్టుకోవాలనే కలను అణచివేసుకుంటున్న సామాన్యుడికి శుభవార్త. మొత్తానికి.. ధరాభారంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను కేంద్ర ప్రభుత్వం కనికరించింది. కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిన ధర రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో 9 కోట్లమంది ఉజ్వల యోజన లబ్ధిదారులకు దీంతో కొంత భారం తగ్గనుంది.


ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. ఐరన్‌, స్టీల్‌పై కస్టమ్స్‌ డ్యూటీని, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు- ముడి పదార్థాలతో పాటు ఉక్కు ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించనున్నట్టు తెలిపారు. ఇనుము, ఉక్కు ధరలను తగ్గించే దిశగా.. వాటి ముడిపదార్థాలు, ఇంటర్మీడియరీస్‌పై కస్టమ్స్‌ డ్యూటీని క్రమాంకనం చేస్తున్నామని.. ఉక్కు ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గిస్తామని కూడా తెలిపారు. కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధిస్తామని చెప్పారు. సిమెంట్‌ లభ్యతను మెరుగుపరిచేందుకు..,  మెరుగైన రవాణా ద్వారా దాని ధరను తగ్గించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.లక్ష కోట్లు, ఉజ్వల సిలిండర్‌పై రాయితీతో రూ.6,100 కోట్ల మేర రాబడి తగ్గుతుందని నిర్మల పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రాలు సైతం పెట్రోల్‌/డీజిల్‌పై స్థానిక పన్నులు/ వ్యాట్‌ను తగ్గించాలని నిర్మలా అభ్యర్థించారు.నవంబరులో కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించినా.. ఆ మేరకు పన్నులను తగ్గించని రాష్ట్రాలకు ఈసారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. 14.2 కిలోల ఉజ్వల్‌ కల్యాణ్‌ యోజన సిలిండర్‌పై తాజాగా ఇస్తున్న రూ.200 రాయితీ లబ్ధిదారుల ఖాతాల్లో పడుతుంద న్నారు. మరోవైపు కేంద్రం నిర్ణయంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర లీటరు రూ.10.91 తగ్గి.. రూ.108.58కి కానుంది. డీజిల్‌ 7.64 తగ్గి రూ.97.85కి రానుంది. రాష్ట్ర రాజధానిలో ఇప్పటివరకు లీటరు పెట్రోల్‌ రూ.119.49, డీజిల్‌ రూ.105.49గా ఉంది.


రైతాంగానికి అండగా..

అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగిన నేపథ్యంలో.. దేశ రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.1.10 లక్షల కోట్ల ఎరువుల రాయితీ ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రస్తుత బడ్జెట్‌లో పేర్కొన్న రూ.1.05 లక్షల కోట్ల సబ్సిడీ కంటే ఇది రెట్టింపు. కాగా, అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పడిపోయిన, కొవిడ్‌ లాక్‌డౌన్‌ కొనసాగిన 2020 మార్చి-మే నెలల్లో కేంద్రం పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 ఎక్సైజ్‌ డ్యూటీ పెంచింది. నాడు రికార్డు స్థాయిలో.. ఎక్సైజ్‌ డ్యూటీ లీటరు పెట్రోల్‌పై రూ.32.9కి, డీజిల్‌పై రూ.31.8కి చేరింది. అయితే, 2021 నవంబరులో పెట్రోల్‌పై సుంకాన్ని రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించింది. ఇప్పుడు రూ.8, రూ.6 తగ్గించింది. మొత్తంగా చూస్తే.. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని కొవిడ్‌కు పూర్వం నాటి స్థితికి తీసుకొచ్చింది. తాజా తగ్గింపుతో.. లీటరు పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.19.9కి, డీజిల్‌ మీద రూ.15.8కి పడిపోయింది. 


గతేదాడి నవంబరులో కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించగా.. 25 రాష్ట్రాలు/యూటీలు స్పందించి స్థానిక పన్నులను తగ్గించాయి. కానీ, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు ఈ మేరకు నిర్ణయం తీసుకోలేదు. ఇక నాటి తగ్గింపుతో.. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 137 రోజుల పాటు పెట్రోల్‌/డీజిల్‌ రేట్లను పెంచలేదు. 14 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా.. అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్‌ 84 డాలర్ల నుంచి 140 డాలర్లకు పెరిగినా  ధరలు మార్చలేదు. అయితే, ఈ ఏడాది మార్చిలో దీనికి బ్రేక్‌ పడింది. 16 రోజుల వ్యవధిలో పెట్రోల్‌, డీజిల్‌ ధర రూ.10 మేర పెరిగింది. ఏప్రిల్‌ 6తో దీనికి అడ్డుకట్ట పడింది. సామాన్యులకు కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని.. ఇక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారు.  కేంద్రం ప్రకటించిన వెంటనే.. పన్నులను తగ్గిస్తూ కేరళ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై రూ.1.36 తగ్గించింది. కాగా, పెట్రోల్‌/డీజిల్‌పై సుంకాన్ని కేంద్రం ఆరేడేళ్ల కిందటి స్థాయికి తీసుకురావాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే డిమాండ్‌ చేశారు. ‘‘రెండు నెలల క్రితం పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.18.42, డీజిల్‌పై రూ.18.24 పెంచారు. ఇప్పుడు రూ.8, రూ.6 తగ్గించారు. భారీగా పెంచి.. స్వల్పంగా తగ్గించడం సరికాదు.’’ అన్నారు.


యూపీఏ హయాం స్థాయికి ఎక్సైజ్‌ సుంకం తగ్గించాలి: కాంగ్రెస్‌

యూపీఏ హయాంలో ఉన్న స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. లెక్కల గారడికి బదులుగా ప్రజలకు ఉపశమనం కలిగించేలా చూడాలని సూచించింది. కేంద్ర ఆర్థిక మంత్రి ధైర్యం ప్రదర్శించి 2014 మేలో ఉన్న స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేసింది. 60 రోజుల్లో లీటరు పెట్రోల్‌పై రూ.10 పెంచిన ప్రభుత్వం ఇప్పుడు రూ.9.50 తగ్గించిందని కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ట్వీట్‌ చేశారు. ప్రజలను మోసం చేయ డం ఆపాలన్నారు. 2014లో ఎక్సైజ్‌ సుంకం లీటరు పెట్రోల్‌పై రూ.9.48, డీజిల్‌పై రూ.3.56 ఉందన్నారు. ఇప్పుడు పెట్రోల్‌పై రూ.19.90, డీజిల్‌పై రూ.15.80 ఎక్సైజ్‌ సుంకం ఉందన్నారు. ఆయా రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి సూచించారు. 

Updated Date - 2022-05-22T07:25:27+05:30 IST