మాస్టర్‌ ‘ఫ్లాప్‌’!

ABN , First Publish Date - 2020-10-28T09:42:55+05:30 IST

చెరువుల వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు నీటి పారుదల శాఖ 15 మంది సూపరింటెండెంట్‌ ఇంజనీర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది

మాస్టర్‌ ‘ఫ్లాప్‌’!

అమలుకాని మాస్టర్‌ ప్లాన్‌

హెచ్‌ఎండీఏ వైఫల్యం

పని చేయని లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ

కాగితాల్లోనే చెరువులు భద్రం

క్షేత్ర స్థాయిలో ఛిద్రం

వరదలొస్తే నిండా మునగాల్సిందే..


నెల 13న ప్రకృతి నగర ప్రజలకు ఒక పెద్ద హెచ్చరిక చేసింది. ప్రకృతి వనరులతో పరాచకాలు పతనానికే దారి తీస్తాయి అనేదే ఆ హెచ్చరిక. ఆరోజు కురిసిన వాన మన ప్రణాళికలను సవరించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఆ వాన ఫలితంగా జరిగిన విధ్వంసం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం.. ఇప్పటి దాకా జరిగిన తప్పులను ఎత్తి చూపాయి. శతాబ్దాలనాటి మన చెరువులు అలాగే ఉండి ఉంటే.. దశాబ్దాలనాటి నాలాలను మనం కాపాడుకుని ఉంటే ఎంతటి వానైనా, వరదైనా తన దారిన తాను పోయేది. ఇలా.. ఊరి పైకి ఉబికి వచ్చేది కాదు. వరద బీభత్సం నుంచి నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నా.. అక్టోబర్‌ 13 నాడు ప్రకృతి చేసిన హెచ్చరిక నుంచి పాఠాలు నేర్చుకోకపోతే.. ఇంత కంటే పెద్ద విపత్తు ఎదుర్కోక తప్పదు. వాన, వరద, నగరం ముందున్న కర్తవ్యాలపై ప్రత్యేక కథనాల పరంపర నేటి నుంచి...


హెచ్‌ఎండీఏ పరిధిలో చెరువుల అంశం అత్యంత కీలకమైంది. అందుకే ప్రత్యేకంగా లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికారికంగా 185 చెరువులు, హెచ్‌ఎండీఏ పరిధిలో 3,200కు పైగా చెరువులు ఉన్నాయి. ఇన్ని చెరువులున్నా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదల నుంచి కాపాడలేకపోయాయి. వందేళ్లలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం వల్లే ఇలా జరిగిందని పాలకులు చెబుతున్నా, ఎలాంటి వరదలనైనా తట్టుకునేలా హైదరాబాద్‌ చుట్టూ వేలాది చెరువులు ఉన్నాయని, అవన్నీ నిండితే వరద పారేందుకు మూసీ నది, ఫిరంగి నాలా, కూకట్‌పల్లి నాలా, బుల్కాపూర్‌ నాలా ఉన్నాయన్న సంగతిని మర్చిపోయారు. వాటిని సరైన రీతిలో కాపాడితే వరదల వల్ల నగర వాసులు నరకాన్ని అనుభవించాల్సిన అవసరం ఉండదు. 


కబ్జాల పాలైన చెరువులు..

తాగు, సాగు నీటి అవసరాల కోసమే కాకుండా అనుకోకుండా భారీ వర్షాలు కురిస్తే వచ్చే వరద నీరంతా వృథాగా పోకుండా, ఇళ్లు, పంటపొలాలు మునగకుండా ఒక చోట ఆ నీరంతా నిల్వ ఉండేలా చెరువులను నిర్మించారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న చెరువులు నగరం విస్తరణతో కబ్జాలకు గురవుతూ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. దాదాపు 150 చెరువులు  కబ్జాలకు గురైనట్లు తెలుస్తోంది. అందువల్లే వరద నీరంతా నివాస ప్రాంతాల్లోకి వచ్చి చేరి, ఎటూ వెళ్లలేని పరిస్థితి వచ్చింది. 


12 ఏళ్లలో ఏం చేశారు..?

2008లో ఏర్పాటైన హెచ్‌ఎండీఏ పరిధిలో చెరువుల పరిరక్షణ కోసం లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేకగా చెరువుల పరిరక్షణ కోసమే ఇంజనీరింగ్‌ నిపుణులు ఉన్నతాధికారులుగా ఉన్నా 12 ఏళ్లలో చేసిందేమీ లేదని స్టష్టమవుతోంది. కేవలం కాగితాల్లోనే లెక్కలు సరి చేస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో చెరువుల రక్షణకు చర్యలు చేపట్టడం లేదు. సర్వే చేసి  ఎల్‌టీఎఫ్‌ హద్దు రాళ్లు పాతినా వాటిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తొలగించి వెంచర్లు చేసినా, లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ గానీ, స్థానిక రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు గానీ అడ్డుకోవడం లేదు.


దిగువకు నీరు వెళ్లే పరిస్థితి లేదు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 27(ఆంధ్రజ్యోతి): చెరువుల వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు నీటి పారుదల శాఖ 15 మంది సూపరింటెండెంట్‌ ఇంజనీర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందం 13 నుంచి 15 వరకు చెరువులను పరిశీలించి ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించింది. వరదల నేపథ్యంలో కట్టల పునరుద్ధరణ, అలుగుల మరమ్మతు ఇతరత్రా పనులకు రూ.54 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. సమస్య శాశ్వత పరిష్కారానికి మరో రూ.50-60 కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నారు.


ఎలా ఉన్నాయి...?

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 185 చెరువులతోపాటు ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న ఇతర ఏరియాల్లోని పలు చెరువులను బృందాలు పరిశీలించాయి. కట్ట తెగిందా..? తూములు పాడయ్యాయా..? అలుగులు దెబ్బతిన్నయా..? అన్నది చూశారు. చెరువుల్లో నీటి మట్టం పెరగడంతో ఎన్ని కాలనీలు, బస్తీలు నీట మునిగాయి అన్న వివరాలు సేకరించారు. చాలా ప్రాంతాల్లో చెరువులకు అవుట్‌లెట్‌లు నిర్ణీత సామర్థ్యంతో లేవని గుర్తించారు. వాస్తవ సామర్థ్యం కంటే 60-70 శాతం తక్కువగా ఉన్నట్టు తేల్చారు. గతంలో ఓ చెరువులో నీటి మట్టం పెరిగితే.. దిగువ చెరువులోకి వెళ్లేలా నాలాలు నిర్మించారు. ఈ నాలాలు చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. ప్రస్తుత ముంపు ముప్పునకు ఇదే ప్రధాన కారణంగా బృందాలు తేల్చాయి. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో నివాసాలు రావడమూ నీట మునగడానికి కారణంగా ఓ ఇంజనీరింగ్‌ అధికారి తెలిపారు. చెరువుల్లో తక్షణ మరమ్మతు/పునరుద్ధరణకు ఏం చేయాలన్న దానిపై ఫ్లడ్‌ డ్యామేజ్ట్‌ రిపోర్ట్‌ (ఎఫ్‌డీఆర్‌) కింద ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 


గుర్తించిన వాటిలో కొన్ని...

  • ఖాజాగూడలోని తౌతోని కుంట చెరువు అవుట్‌లెట్‌ ద్వారా నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు. రోడ్డు భూగర్భంలో వేసిన పైపుల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో వరద నీరు ఆవలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఈ పైపులను మార్చాలని నిర్ణయించారు. 
  • హఫీజ్‌పేటలోని మీదికుంట చెరువు కట్ట మీదుగా వర్షపు నీరు పొంగి పొర్లింది. అవుట్‌లెట్‌ నిర్ణీత సామర్థ్యం మేర లేకపోవడమే దీనికి కారణంగా గుర్తించారు. అవుట్‌లెట్‌ సామర్థ్యం పెంపునకు రూ. కోటి అవసరమని అంచనా వేశారు. 
  • దుర్గం చెరువు అలుగు, తూములు పాడయ్యాయి. అవుట్‌లెట్‌లు పునరుద్ధరించాలి. కట్టను బలోపేతం చేయాలి. 
  • మల్కం చెరువు తూము పని చేయడం లేదు. అలుగు దెబ్బతింది. మరమ్మతు చేయాల్సి ఉంటుంది. 
  • పలు చెరువుల తూములకు కంట్రోలింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. 
  • చెరువుల అవుట్‌లెట్‌ల నుంచి ఉన్న నాలాలను విస్తరించాలి. లేదా... దిగువ చెరువు వాలును బట్టి వీలైనంత మేర లోతు పెంచాలి.

Updated Date - 2020-10-28T09:42:55+05:30 IST