సొసైటీ ఎన్నికల్లో బోణి కొట్టిన టీడీపీ

ABN , First Publish Date - 2020-02-20T10:25:49+05:30 IST

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా సాగింది. కాని భద్రాచలం ప్రాథమిక వ్యవసాయ

సొసైటీ ఎన్నికల్లో బోణి కొట్టిన టీడీపీ

మిత్రపక్షాల కూటమి నుంచి చైర్మన్‌గా అబ్బినేని శ్రీనివాసరావు

ఖంగుతిన్న టీఆర్‌ఎస్‌

వరుసగా రెండోసారి సొసైటీ కైవసం


 భద్రాచలం, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా సాగింది. కాని భద్రాచలం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో కారుకు ఎదురు దెబ్బ తగిలింది. భద్రాచలం సొసైటీలో మాత్రం టీడీపీ తన మిత్రపక్షాల సహకారంతో సత్తా చాటింది. గతంలో 2014లో సైతం భద్రాచలం సొసైటీ పీఠం తెలుగుదేశం పార్టీయే కైవసం చేసుకుంది. ఆనాడు సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైన సంకా వెంకట నగేష్‌ తాజాగా నిర్వహించిన సొసైటీ ఎన్నికల సమయంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.


అయినా తెలుగుదేశం పార్టీ తన మిత్రపక్షాల సహకారంతో సొసైటీలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. భద్రాచలం సొసైటీలో 13 స్థానాలకు ఒక స్థానం ఎస్టీ జనరల్‌, మరో స్థానం ఎస్సీ మహిళకు పోటీ చేసే వారు ఎవరు లేకపోవడంతో 11 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. సొసైటీ పరిధిలో మొత్తం 40 ఓటర్లుండగా ఇందులో 30 మంది ఓటర్లు బుధవారం జరిగిన ఎన్నికకు హాజరయ్యారు. ఈక్రమంలో నాలుగు స్థానాలకు పోటీగా అభ్యర్థులెవరు లేకపోవడంతో ఏకగ్రీవ మయ్యాయి. కాగా మిగిలిన ఏడుస్థానాలకు తొమ్మిది నామినేషన్లు  దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో టీఆర్‌ఎస్‌కు చెందిన ఇరువురు అభ్యర్థులు నర్రా లక్ష్మీ కాంతమ్మ, ఇంటూరి రామ కోటయ్య  ఉపసంహరించుకోవడంతో మిగిలిన ఏడు స్థానాలు ఏకగ్రీ వమయ్యాయి. దీంతో ఎన్నికలు జరిగిన 11 స్థానాలు ఏకగ్రీ వం కావడం జరిగింది. ఈ ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ ఐదు వార్డులు, కాంగ్రెస్‌ రెండు, సీపీఎం, సీపీఐ ఒక్కొక్కటి చొప్పున విజయం సాధించగా అధికార టీఆర్‌ఎస్‌ కేవలం రెండు వార్డులను మాత్రమేదక్కించుకుంది. 


భద్రాచలం సొసైటీ చైర్మన్‌గా అబ్బినేని శ్రీనివాసరావు

భద్రాచలం సొసైటీ చైర్మన్‌గా మిత్రపక్షాల సహకారంతో టీడీపీ అభ్యర్థి అబ్బినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మనాపల్లి సత్యనారాయణ వైస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 11మంది డైరెక్టర్లలో తొమ్మది మంది డైరెక్టర్లు మిత్రపక్షాలకు చెందిన వారే ఉండటం ఎన్నికలు నిర్వహించే సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఇరువురు డైరెక్టర్లు బయటకు వెళ్లిపోవడంతో  ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జి.శ్రీనివాసకుమార్‌ ఇరువురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. అంతకు ముందు సొసైటీ డైరెక్టర్లుగా ఎంపికైన 11 మందిని  ధ్రువీకరిస్తూ వారికి సైతం ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. 


సొసైటీ డైరెక్టర్లు వీరే 

భద్రాచలం సొసైటీ డైరెక్టర్లు 11 మంది ఎన్నికయ్యారు. ఒకటో వార్డు నుంచి సీపీఎంకు చెందిన చాట్ల శ్రీనివాస రావు, రెండో వార్డు నుంచి కాంగ్రెస్‌కు చెందిన కొమ్మనాపల్లి ఆదినారాయణ, కొమ్మనాపల్లి సత్యనారాయణ, 4వ వార్డు నుంచి టీడీపీకి చెందిన అబ్బినేని శ్రీనివాసరావు, 5వ వార్డు నుంచి వైట్ల సత్యనారాయణ, 6వ వార్డు నుంచి సీపీఐకి చెందిన ఇంటూరి జగన్నాధరావు, 7వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన కొండవీటి సరోజని, 8వ వార్డు నుంచి దార పనేని కృష్ణ, 9వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌కు చెందిన బోడేపూడి వెంకటరామయ్య, 10వ వార్డు నుంచి సంకా వెంకట నగేష్‌, 11వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ఇంటూరి నారాయణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


మిత్రపక్షాల్లో హర్షాతిరేకం

టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐలు మిత్రపక్షంగా కలిసి భద్రాచలం సొసైటీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను ఢీకొని విజయం సాధించడంతో మిత్రపక్షాల్లో హర్షం వ్యక్తమవుతోంది. నియోజకవర్గ కేంద్రమైన భద్రాచలంలో టీఆర్‌ఎస్‌ను మరోసారి బోల్తాకొట్టించడం పట్ల మిత్రపక్షాల శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, రైతుబంధుతో పాటు ఇతర రాయితీలు రావంటూ భయపెట్టినా రైతులు ధైర్యంగా మిత్రపక్షాల అభ్యర్థులకు ఓటు వేయడం పట్ల  మిత్రపక్షాల నాయకులు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. విజేతలుగా నిలిచిన మిత్రపక్షాలకు చెందిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల ను ఎమ్మెల్యే పొదెం వీరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్న వరపు కనకయ్య, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజ య్య, డీసీసీబీ మాజీ చైర్మన్‌ యలమంచి రవికుమార్‌తో పాటు మిత్రపక్షాల నాయకులు అభినందిం చారు. 


రాబోయే ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో విజయం సాధిస్తాం: భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య

భద్రాచలం వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఇదే స్ఫూర్తిగా తీసుకొని రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని భద్రాచలం ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్నికల్లో గెలిచిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లను శాలువ, పూలదండలు, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అనైతికంగా గెలిచేందుకు అధికార టీఆర్‌ఎస్‌ ఎన్ని కుయుక్తులు పన్నినా రైతులు ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేసి మిత్రపక్షాలను ఆశీర్వదించారని అన్నారు. భద్రాచలం అభివృద్ధికి అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి సారించడం లేదని ఈ నేపఽథ్యంలో ప్రజలు ఈ గెలుపు ద్వారా మరోసారి టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పారన్నారు. 


Updated Date - 2020-02-20T10:25:49+05:30 IST