అతనివి మొసలి కన్నీళ్లు!

ABN , First Publish Date - 2022-03-08T05:36:57+05:30 IST

ఏడుస్తున్నట్టు నటించే వాళ్లను చూసి ‘మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు’ అనడం వింటుంటాం. అంటే మొసలి నిజంగా ఏడవడం వల్ల వచ్చే కన్నీళ్లు కావవి.

అతనివి మొసలి కన్నీళ్లు!

ఏడుస్తున్నట్టు నటించే వాళ్లను చూసి ‘మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు’ అనడం వింటుంటాం. అంటే మొసలి నిజంగా ఏడవడం వల్ల వచ్చే కన్నీళ్లు కావవి. ఆహారం అరిగే సమయంలో అలా కన్నీళ్లు కారుస్తుందని చదువుకున్నాం. మొసలి విషయం పక్కన పెడితే మనుషుల విషయంలో అలా జరుగుతుందా? అంటే చైనాకు చెందిన జాంగ్‌ను చూస్తే నమ్మక తప్పదు. 


ఎవరికైనా ఏడ్చినా, బాగా నవ్వినా కన్నీళ్లు వస్తాయి. కానీ జాంగ్‌కు మాత్రం ఏదైనా ఆహారం తింటుంటే కన్నీళ్లు వస్తాయి.  మొదట్లో తేలిగ్గా తీసుకున్నా జాంగ్‌ తరువాత ఆ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.


భోజనం చేయాలంటే ఒక్కడే గదిలో కూర్చుని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆహారం నములుతుంటే తెలియకుండానే కన్నీళ్లు కారిపోయేవి. చివరకు వైద్యుల దగ్గరకు వెళితే జాంగ్‌  ‘క్రొకడైల్‌ టియర్‌ సిండ్రోమ్‌’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తేల్చారు.


గతంలో ఫేసియల్‌ పెరాలసిస్‌ బారినపడి ఉన్న వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. పెరాలసిస్‌ నుంచి కోలుకుంటున్న క్రమంలో లాక్రిమల్‌ గ్రంథులపై ప్రభావం పడుతుంది. దీనివల్ల కంటి నుంచి నీళ్లు కారుతుంటాయి. ఫేసియల్‌ నర్వ్‌ మిస్‌ డైరెక్షన్‌ వల్ల ఇలా జరగుతోందని, సర్జరీతో ఈ సమస్య నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని వైద్యులు తేల్చారు. 

Updated Date - 2022-03-08T05:36:57+05:30 IST