హైర్‌ బస్సు హైరానా..!

ABN , First Publish Date - 2021-07-22T05:10:18+05:30 IST

కరోనా కాలంలో కష్టాలు పడనివారు లేరు.కరోనా తగ్గినా కొందరిని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రజా రవాణాశాఖలో సేవలందిస్తున్న అద్దె బస్సుల సిబ్బంది,

హైర్‌ బస్సు హైరానా..!

లాక్‌ డౌన్‌తో నిలిచిన సర్వీసులు

మూడు నెలలుగా రోడ్డెక్కని పీటీడీ అద్దె బస్సులు

ఉపాధి లేక ఉద్యోగుల అగచాట్లు

అద్దెలు రాక యజమానుల అవస్థలు


ఏలూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): 

కరోనా కాలంలో కష్టాలు పడనివారు లేరు.కరోనా తగ్గినా కొందరిని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.  ప్రజా రవాణాశాఖలో సేవలందిస్తున్న అద్దె బస్సుల సిబ్బంది, యజమానుల జీవితాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. 70 రోజుల క్రితం ఆగిన బస్సులు ఇప్పటికీ రోడ్డెక్కలేదు. జిల్లాలో కరోనా ప్రభావం తగ్గి నెలరోజులు గడుస్తున్నా ప్రయాణికుల సంఖ్య ఆశించిన స్థాయిని మించి పెరుగుతున్నా ఈ బస్సు లకు మాత్రం రోడ్డెక్కే అవకాశం లభించలేదు. వీటిపైనే ఆధారపడి జీవించేవారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.


జిల్లావ్యాప్తంగా నిలిచిన 130 బస్సులు

కొవిడ్‌ విజృంభించడంతో మే 5వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ అమలులోకి తెచ్చింది. దీంతో ఆ రోజు నుంచి పీటీడీ బస్సుల సంఖ్యను తగ్గించేసింది. ఫలితంగా జిల్లాలో సేవలు అందిస్తున్న 130 బస్సులు ఆరోజు నుంచి నిలిచిపోయాయి. ఏలూరు డిపో పరిధిలో 47 బస్సులు ఉండగా ఇంద్ర 2, అలా్ట్ర డీలక్స్‌ 6, ఎక్స్‌ప్రెస్‌ 15, పల్లెవెలుగు 24, జంగారెడ్డిగూడెం డిపోలో ఎక్స్‌ప్రెస్‌ 13, పల్లెవెలుగు 9, నిడదవోలు డిపోలో ఎక్స్‌ప్రెస్‌ 9, తాడేపల్లిగూడెం డిపోలో 13 పల్లెవెలుగు, భీమవరం డిపోలో 9 ఎక్స్‌ ప్రెస్‌, 3 పల్లెవెలుగు, కొవ్వూరు డిపోలో 6 పల్లెవెలుగు, నరసాపురం సూపర్‌ లగ్జరీ 2, పల్లెవెలుగు 5, తణుకు డిపో పరిధిలో ఎక్స్‌ప్రెస్‌ 8, పల్లెవెలుగు 6 అద్దెబస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. 


ఉపాధి కోల్పోయిన 300 మంది..

జిల్లావ్యాప్తంగా అద్దె  బస్సుల్లో సుమారు 300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఈ బస్సుల్లో డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర సిబ్బంది పని కోల్పోయారు. కిందటి లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఇలానే బస్సులు ఆగిపోవడంతో అప్పుడు కూడా మార్చి నుంచి జూలై, ఆగస్టు వరకూ వీరికి పనిలేకుండా పోయింది. మంత్రి పేర్ని నాని ఏలూరు వచ్చినప్పుడు ఆయనను వేడుకున్నారు. అయినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఏడాది చివరిలో అద్దెబస్సులు మళ్లీ నడపడంతో పని దొరికింది. కానీ మూడు నాళ్ల ముచ్చటగా మళ్లీ బస్సులు ఆగిపోయాయి. లాక్‌డౌన్‌ సమయంలో బస్సులకు అద్దెలు రాకపోవడంతో యజమానులు కూడా చేతులెత్తేశారు. సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేదు. కిందటేడాది, ఈ ఏడాది వరుసగా ఉపాధి లేకపోవడంతో కార్మిక కుటుంబాలు నానా అగచాట్లు పడుతున్నాయి. 


ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

వీరయ్య చౌదరి, పీటీడీ ఆర్‌ఎం

కర్ఫ్యూ కారణంగా అన్ని బస్సులు తగ్గించాం. ఆ క్రమంలో హైర్‌ బస్సులను పూర్తిగా ఆపేశాం. సొంత బస్సులతోనే నెట్టుకొస్తున్నాం. ప్రభుత్వం అద్దె బస్సులపై నిర్ణయం తీసుకున్న తరువాత మళ్లీ బస్సులు నడుపుతాం. స్థానికంగా మేమేమీ చేయలేం.


కార్మికులకు తిండిలేని పరిస్థితి

–దొర, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కార్యదర్శి

హైర్‌ బస్సు కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉంది. వారి ఉద్యోగానికి ఎలాంటి భద్రతా లేనికారణంగా ఇటు ఆర్టీసీ యాజమాన్యం, బస్సు యజ మానులు ఇరువురు వారిని వాడుకుని వదిలేస్తున్నారు. లాక్‌ డౌన్‌లో వారికి కనీసం తిండి ఖర్చులు కూడా ఇవ్వడం లేదు. తిండికి కూడా అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


అంతా రోడ్డున పడ్డాం..

–స్వామినాయుడు, హైర్‌ బస్సు ఓనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి

హైర్‌ బస్సు యజమానులంతా రోడ్డున పడ్డారు. నాకు రెండు బస్సులు ఉన్నాయి. గతేడాది కరోనా సమయంలో 9 నెలలు నిలిచిపోయాయి. జనవరి నుంచి తిప్పుతామని అంటే ఒక్కో బస్సుకు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాం.నాలుగు నెలల తర్వాత మళ్లీ లాక్‌ డౌన్‌ విధించారు. డిపోలో ఉన్న మా బస్సులను తక్షణమే అక్కడ నుంచి తీసివేయాలని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. తిరిగిన నాలుగు నెలల కాలానికి పూర్తిగా బిల్లులు ఇవ్వలేదు. ఫైనాన్స్‌ కంపెనీ వారు వాయిదాలు చెల్లించకపోతే బస్సులు తీసుకుపోతామంటు న్నారు. బస్సులు తిరగపోతే ఆత్మహత్యలే గతి.


Updated Date - 2021-07-22T05:10:18+05:30 IST