మహాత్మా గాంధీ లేరనేది హిందుత్వవాదుల భావన : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-01-30T21:48:52+05:30 IST

జాతి పిత మహాత్మా గాంధీ లేరని హిందుత్వవాదులు భావిస్తున్నారని

మహాత్మా గాంధీ లేరనేది హిందుత్వవాదుల భావన : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : జాతి పిత మహాత్మా గాంధీ లేరని హిందుత్వవాదులు భావిస్తున్నారని, అయితే ఆయన సజీవంగానే ఉన్నారని, సత్యం ఉన్న చోట ఆయన ఉంటారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గాంధీజీ 74వ వర్థంతి సందర్భంగా ఆయన #ForeverGandhi హ్యాష్‌ట్యాగ్‌తో ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఆదివారం మహాత్మా గాంధీకి నివాళులర్పించింది. 


‘‘గాంధీజీని ఓ హిందుత్వవాది కాల్చి చంపాడు. గాంధీజీ లేరని హిందుత్వవాదులంతా భావిస్తున్నారు. సత్యం ఉన్న చోట బాపూ ఇంకా సజీవంగా ఉన్నారు’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘సత్యం, ప్రేమ ఎల్లప్పుడూ విజయం సాధించినట్లు చరిత్ర చెప్తోందనే విషయాన్ని నేను నిరుత్సాహంగా ఉన్నపుడు గుర్తు చేసుకుంటాను. నియంతలు, హంతకులు ఉన్నారు, కొంత కాలంపాటు వారు ఎదురులేనివారిగా కనిపిస్తారు. కానీ చివరికివారు పతనమవుతారు. ఎల్లప్పుడూ దీని గురించి ఆలోచించాలి’’ అని గాంధీజీ చెప్పిన మాటలను ఈ ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి రాహుల్ శ్రద్ధాంజలి ఘటించారు. 


కాంగ్రెస్ ఇచ్చిన ట్వీట్‌లో, జాతి పిత వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపింది. ఈ కష్టకాలంలో మాకు నాయకత్వం వహించడానికి మా ప్రియమైన బాపూ మా మధ్య లేరు కానీ నియంతృత్వం, నిర్లిప్తత, అన్యాయం, తప్పులకు వ్యతిరేకంగా నిర్భయంగా, అవిశ్రాంతంగా పోరాడేందుకు ఆయన అనుసరించిన విధానాలు సౌభాగ్యవంతమైన, ప్రగతిశీల భారత దేశం కోసం మా ప్రయత్నంలో మాకు నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తాయి’’ అని పేర్కొంది. 


Updated Date - 2022-01-30T21:48:52+05:30 IST