రవాణాకు రాజమార్గం!

ABN , First Publish Date - 2021-10-12T04:38:03+05:30 IST

దండకారణ్య సరిహద్దు ప్రాంతమంటే మావోయిస్టు కార్యకలాపాలు, హింసాత్మక, విధ్వంసకర సంఘటనలే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఆ కార్యకలాపాల కంటే గంజాయి అ

రవాణాకు రాజమార్గం!
ఖమ్మంలో ఇటీవల పోలీసులు పట్టుకున్న గంజాయి

పొరుగు రాష్ట్రాల నుంచి ఉమ్మడి జిల్లా మీదుగా యథేచ్ఛగా తరలుతున్న గంజాయి 

తనిఖీలు చేస్తున్నా, కేసులు పెడుతున్నా ఆగని దందా

ఏజెన్సీ కేంద్రంగా రూ.కోట్లలో సాగుతున్న వ్యాపారం

ఖమ్మం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : దండకారణ్య సరిహద్దు ప్రాంతమంటే మావోయిస్టు కార్యకలాపాలు, హింసాత్మక, విధ్వంసకర సంఘటనలే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఆ కార్యకలాపాల కంటే గంజాయి అక్రమ రవాణానే అధికంగా కనిపిస్తోంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుంటున్న అక్రమార్కులు దేశంలోని పలు ప్రాంతాల నుంచి కోట్ల విలువైన గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి అక్రమ రవాణాకు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజమార్గంగా మారింది. ఈ జిల్లాకుండా పలు మార్గాల్లో ప్రతీరోజు భారీగా గంజాయి తరలిపోతోంది. గత ఆరునెలల్లో ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.25కోట్ల గంజాయి పట్టుబడిందంటే సరిహద్దు గిరిజన ప్రాంతంనుంచి గంజాయిని ఏ స్థాయిలో రవాణా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒడిశాలోని మల్కనగిరి, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, ఏపీలోని విశాఖ, తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాలనుంచి భారీగా గంజాయి గిరిజనులతో పండిస్తున్నారు. మహారాష్ట్ర తమిళనాడు, యూపీ, హైదరాబాద్‌, పంజాబ్‌, ఢిల్లీ తదితర రాష్ట్రాలతోపాటు హైదరాబాద్‌కు సరిహద్దు దండకారణ్య ప్రాంతంనుంచి ఉమ్మడి ఖమ్మంజిల్లా మీదుగా జీపులు, వ్యాన్లతోపాటు బస్సులు, రైళ్లలోనూ తరలిస్తున్నారు. ఇలా తరలుతున్న గంజాయి భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మంరూరల్‌, మధిర, తదితర పోలీసుస్టేషన్ల పరిధిలో తనిఖీల్లో పట్టుబడుతోంది. 

సీలేరు నదీ పరివాహకప్రాంతంలో సాగు

సీజనకుముందే గంజాయి విత్తనాలు పంపించి.. ఒడిశా, ఆంధ్రా సరిహద్దులోని సీలేరు, ఛత్తీస్‌గడ్‌, ఒడిశా, సరిహద్దులోని శబరి నదలు పరివాహక ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలోని కొండకోనల్లో వాగుల వెంట అక్కడి వారితో సాగుచేయిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో గిరిజన గ్రామాల్లో సాగును అటుపోలీసులుకానీ, బటయప్రాంత వ్యక్తులు గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. గంజాయి మాఫియా ముఠాలు ఏజెన్సీలో ఏజెంట్లను పెట్టుకుని వారిద్వారా గిరిజనులకు పెట్టుబడులు పెట్టి గంజాయి పండించి.. తర్వాత దాన్ని కోసి ప్లాస్టిక్‌ సంచుల్లో ప్యాకింగ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత దశలవారీగా పలువాహనాల్లో గోదావరి నదిపై పడవల ద్వారా దాటించడం, దండకారణ్య సరిహద్దునుంచి వచ్చే లారీలు, వ్యాన్లు తదితర వాహనాల్లో గప్‌చుప్‌గా  తాము కోరుకున్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాహనాల్లో ప్రత్యేకంగా రహస్య క్యాబిన్లు తయారుచేయించి గంజాయి ప్యాకెట్లను ఎవరూ గుర్తించకుండా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, చంద్రాపూర్‌, ముంబై, తమిళనాడులోని చెన్నై, యూపీ, ఢిల్లీ పంజాబ్‌ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రైళ్లలో తరలే గంజాయి రవాణాలో కొందరు రైల్వే కానిస్టేబుళ్లుకూడా భాగస్వామ్యం అవుతున్నారంటే ఈ గంజాయి దందా ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.  

తక్కువ పెట్టుబడి.. రూ.కోట్లలో లాభాలు

దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన గంజాయి వ్యాపారుల ముఠా దండకారణ్య సరిహద్దు గిరిజన ప్రాంతంపై దృష్టిపెట్టింది. మావోయిస్టు కార్యకలాపాలు ఉండే ఆప్రాంతంలో గిరిజనులతోగంజాయి సాగుచేయిస్తున్నారు. అక్కడే కిలో రూ.3వేల నుంచి రూ.5వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా స్థానిక ఏజెంట్లు గిరిజనులనుంచి కొనుగోలుచేసిన గంజాయిని ఉమ్మడి ఖమ్మంజిల్లా మీదుగా సబ్‌సెంటర్లకు తరలిస్తున్నారు. వీరికి కిలోకు రూ.10వేల వరకు గిట్టుబాటవుతుంది. అక్కడనుంచి ప్రాంతం మారిన కొద్దీ ధర పెరుగుతుంది. ప్రధాన నగరాలకు వెళ్లిన తర్వాత కిలో రూ.30నుంచి రూ.50వేల వరకు పలుకుతుంది.  

పోలీసుశాఖ దృష్టి

దండకారణ్య సరిహద్దు ప్రాంతంనుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా గంజాయి రవాణా జరుగుతుండటంతో పోలీసులు దీనికి అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇరు జిల్లాలో గడిచిన ఆరు నెలల్లో జరిపిన తనిఖీల్లో సుమారు రూ.25కోట్ల విలువైన గంజాయిని పట్టుకుని పలు వాహనాలను సీజ్‌చేశారు. ఖమ్మంజిల్లా పరిధిలోనే సుమారు రూ.4కోట్ల విలువైన గంజాయి పట్టుకున్నారు. ఇందులో ఖమ్మంరూరల్‌ మండలం కోదాడ క్రాస్‌రోడ్డువద్ద ఇటీవల విశాఖ జిల్లా చింతపల్లినుంచి కోళ్లవాహనంలో వస్తున్న 170కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇది మహారాష్ట్రలోని షోలాపూర్‌కు తరలుతుండగా పోలీసులకు చిక్కింది. జులై నెలలో పైనాపిల్‌ పండ్ల వాహనంలో 230 కిలోల గంజాయి తరలుతుతుండగా ఖమ్మంరూరల్‌ మండలంలోని ఏదులాపురం వద్ద పోలీసులు పట్టుకున్నారు. రూ.కోటిన్నర విలువైన ఈ గంజాయిని గార్ల రైల్వేస్టేషనకు తెచ్చి అక్కడ నుంచి యూపీకి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మధిర వద్ద పోలీసుల తనిఖీల్లో 300కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.60లక్షల వరకు ఉంటుంది. ఫిబ్రవరి నెలలో కారేపల్లి మండలంలో వస్రాంతండా వద్ద వంద కిలోలు పట్టుకోగా.. ఇది ఏపీలోని చింతూరు నుంచి మహారాష్ట్రకు తరలించేందుకు గార్ల రైల్వేస్టేషనకు తరలించేందుకు సిద్ధంగా ఉంచగా పోలీసులు పట్టుకున్నారు. ఇదే నెలలో సత్తుపల్లి వద్దకూడా 630కిలోల గంజాయి రాజమండ్రి మీదుగా వరంగల్‌కు వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఆరు నెలల్లో సుమారు 11క్వింటాళ్ల గంజాయి పట్టుకున్నారు. దీని విలువ రూ.21కోట్లు ఉంటుంది. దీనికి సంబంధించి 30కేసులు నమోదుకాగా 80మందిని అరెస్టుచేశారు.   చుంచుపల్లి మండలం బృందావన గ్రామం వద్ద 2,210 కిలోలు ఒకసారి, మరో సారి 3,653కిలోలు పట్టుకున్నారు. అశ్వారావుపేట పోలీసుచెక్‌పోస్టు వద్ద 609కిలోలు, భద్రాచలం ఏరియాలోని అంజుబాక ఫారెస్టు చెక్‌పోస్టువద్ద 200కిలోలు పట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖమ్మం నగర పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునిల్‌దత ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా వెళ్లే వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. రాత్రివేళ తనిఖీల్లో ప్రతివారం ఏదో ఒకచోట గంజాయి  పట్టుబడుతోంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు ఎన్ని తనిఖీలు నిర్వహిస్తున్నా అసలు  పంట పండిస్తున్న పొరుగురాష్ట్రాల నుంచి ఇది రాకుండా అడ్డకోపోవడంతో రవాణా ఏదో ఒక రూపంలో జరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-10-12T04:38:03+05:30 IST