హైకోర్టు జడ్జి జస్టిస్‌ పి.కేశవరావు మృతి

ABN , First Publish Date - 2021-08-10T09:07:07+05:30 IST

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ పొట్లపల్లి కేశవరావు(60) కన్నుమూశారు.

హైకోర్టు జడ్జి జస్టిస్‌ పి.కేశవరావు మృతి

  • తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూత.. 
  • సీజేఐ రమణ, కేసీఆర్‌, సీజే, జడ్జిల సంతాపం


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ పొట్లపల్లి కేశవరావు(60) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఉష, ఇద్దరు కుమారులు నిశాంత్‌, సిద్ధార్థ్‌లు ఉన్నారు. నిశాంత్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, సిద్ధార్థ్‌ ఇటీవలే ‘లా’ పూర్తి చేశారు. జస్టిస్‌ కేశవరావు 1961 మార్చి 29న వరంగల్‌ జిల్లాలో జన్మించారు. కాకతీయ వర్సిటీ నుంచి ‘లా’ పట్టా పొందిన తర్వాత ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు.


వరంగల్‌లో న్యాయవాది పింగళి సాంబశివరావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 1991లో హైకోర్టు న్యాయవాది ఎంవీ రమణారెడ్డి వద్ద జూనియర్‌గా చేరారు. 1996 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీసు ప్రారంభించారు. 1998 అక్టోబరు నుంచి 2001 అక్టోబరు వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2010-16 మధ్యకాలంలో సీబీఐ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్నారు. సీబీఐ న్యాయవాదిగా జగన్‌ అక్రమాస్తుల కేసులతోపాటు పలు కీలక కేసుల్లో బలంగా వాదనలు విన్పించారు. జీహెచ్‌ఎంసీ, ‘కుడా’లకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్నారు. 2017 సెప్టెంబరు 21న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 


వ్యక్తిగతంగా బాధించింది: సీజేఐ రమణ

జస్టిస్‌ కేశవరావు ఆకస్మిక మృతి తనను ఎంతగానో బాధించిందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ‘‘కష్టపడే, కరుణగల న్యాయమూర్తిగా ఆయన నాకు వ్యక్తిగతంగా తెలుసు. న్యాయం కోసం 35 ఏళ్లుగా న్యాయవ్యవస్థలో ఆయన వివిధ హోదాల్లో విశేష సేవలు అందించారు.’’ అని తెలిపారు. ఆయన లేని లోటు న్యాయవ్యవస్థకు, ముఖ్యంగా తెలంగాణ హైకోర్టుకు తీర్చలేనిదని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జస్టిస్‌ కేశవరావు ఆకస్మిక మరణంపై సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అందించిన న్యాయసేవలను కీర్తించారు. ఆయన సమన్యాయం అందించేందుకు ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. హబ్సిగూడలోని జస్టిస్‌ కేశవరావు నివాసంలో ఆయన పార్థివదేహానికి తెలంగాణ హైకోర్టు సీజే హిమా కోహ్లీ, హైకోర్టు న్యాయమూర్తులందరూ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సోమయాజులు, జస్టిస్‌ గంగారాం, జస్టిస్‌ విజయలక్ష్మి శ్రద్ధాంజలి ఘటించారు. 


తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌, లోకాయుక్త, పట్నా హైకోర్టు మాజీ సీజే ఎల్‌. నరసింహారెడ్డి, యశోద ఆస్పత్రుల చైర్మన్‌ దేవేందర్‌రావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఆయనకు నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా కోర్టుల బార్‌ అసోసియేషన్‌ తీవ్ర ది గ్ర్భాంతి వ్యక్తం చేసింది. జస్టిస్‌ కేశవరావు పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతికి సంతాప సూచకంగా హైకోర్టుతో సహా రాష్ట్రంలోని అన్ని కోర్టులకూ సోమవారం సెలవు ప్రకటించారు. అంత్యక్రియలకు పలువురు జడ్జిలు, సీనియర్‌ న్యాయవాదులతోపాటు ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2021-08-10T09:07:07+05:30 IST