Abn logo
Apr 10 2020 @ 05:21AM

అక్కయ్యపాలెంలో హై అలర్ట్‌

అష్ట దిగ్బంధం మే 4 వరకు ఆంక్షలు

రాకపోకలు పూర్తిగా బంద్‌

రహదారులపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు

అంతర్గత రోడ్డు కూడా మూసివేత

పాలు, నిత్యావసరాలు ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తామంటున్న అధికారులు

మూడో దశ భయంతోనే...

రైల్వే న్యూకాలనీ, తాటిచెట్లపాలెం,అక్కయ్యపాలెం ప్రాంతాల్లో ఇప్పటివరకూ ఏడుగురికి పాజిటివ్‌

వారి నుంచి ఎవరికైనా సోకినా 20 రోజులకు గానీ బయటపడదు

ఈలోగా మరింత మందికి విస్తరించే ప్రమాదం ఉందని అధికారుల ముందస్తు చర్యలు


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి అధికార యంత్రాంగం రోజుకొక నిర్ణయంతో ముందుకువస్తోంది. విశాఖపట్నంలో కరోనా రెండో దశ నుంచి మూడో దశకు వచ్చే ప్రమాదం పొంచి వుందనే సంకేతాలు వుండడంతో అప్రమత్తమైంది. తొమ్మిది కేసులు నమోదైన అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం, దొండపర్తి, రైల్వే న్యూకాలనీ ప్రాంతాలను బుధవారం రాత్రి నుంచి పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్థానిక ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఆయా కాలనీలు, వీధుల్లోకి వెళ్లే రహదారులు అన్నింటినీ బారికేడ్లతో మూసేశారు. స్థానికులకు అవసరమైన నిత్యావసర సరకులు, పాలు అన్నీ శుక్రవారం నుంచి తామే వార్డు వలంటీర్ల ద్వారా సమకూరుస్తామని ప్రకటించారు.


అయితే ఈ ఆంక్షలపై స్థానికులకు ఎటువంటి సమాచారం లేదు. కనీసం దండోరా వేయించలేదు. పత్రికల ద్వారా ప్రకటన చేయలేదు. ఈ విషయం తెలియక అత్యవసర పనులపై బయటకు వచ్చిన సామాన్యులపై పోలీసులు లాఠీలు మాత్రం ఝళిపిస్తున్నారు. దీనిపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. కాగా ఈ ఆంక్షలన్నీ మే నాలుగో తేదీ వరకు అమలులో వుంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.  


మూడో దశ భయంతోనే

విశాఖపట్నం జిల్లాలో 20 కోవిడ్‌-19  కేసులు నమోదు కాగా రైల్వే న్యూకాలనీలో ముంబై నుంచి వ్యక్తి ద్వారా వైరస్‌ మరో నలుగురికి సోకింది. వీరిలో ఇద్దరు తాటిచెట్లపాలెంలో ఉంటారు. వీరుకాకుండా అక్కయ్యపాలెంలో మరో ఇద్దరి (ఢిల్లీ జమాత్‌కు వెళ్లివచ్చినవారు)కి వైరస్‌ సోకింది. మొత్తం ఈ మూడు ప్రాంతాల్లో  ఏడుగురు వైరస్‌ బారినపడ్డారు. బాధితుల నుంచి ఇతరులకు ఎవరికైనా ఈ వైరస్‌ సోకి వుంటే అది బయటపడడానికి 20 రోజులు సమయం పడుతుంది. ఈలోగా వారు అన్ని ప్రాంతాల్లోను తిరిగితే మరింత మందికి ఆ వైరస్‌ సోకుతుంది. ఎవరికి ఎవరి నుంచి వైరస్‌ వచ్చిందో తెలియని పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు కరోనా మూడో దశలోకి వచ్చినట్టు. ఆ ప్రమాదం పొంచి వుందని ఉన్నత స్థాయి నుంచి సమాచారం రావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.


బుధవారం రాత్రి దీనిపై సబ్‌ కలెక్టర్‌ ఆధ్వర్యాన సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెంటనే మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రకటించిన కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో ఆంక్షలు విధించాలని, స్థానికులు బయటకు వెళ్లకుండా, బయటవారు లోపలకు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. దీనికి డీసీపీ-1 రంగారెడ్డి అధ్యక్షతన కమిటీ వేశారు. అందులో ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు జోనల్‌ కమిషనర్లు, అర్బన్‌ తహసీల్దార్‌ను సభ్యులుగా వేశారు. ప్రజలు బయటకు రాకుండా, వారికి అవసరమైన కూరగాయలు, పాలు, ఇతరాలు అన్నీ ఇళ్లకే నేరుగా సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇవన్నీ శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయి. పోలీసులు మాత్రం బుధవారం రాత్రి నుంచే రాకపోకలను నిలిపివేశారు. 


Advertisement
Advertisement
Advertisement