కరోనాలెక్కలను దాచేస్తున్నారు

ABN , First Publish Date - 2021-04-17T06:17:07+05:30 IST

మొదటి నుంచి కరోనా విషయంలో అధికార యంత్రాంగం కాకిలెక్కలు చెబుతూ వాస్తవాలను వక్రీకరిస్తోందన్న ఆరోపణలున్నాయి.

కరోనాలెక్కలను దాచేస్తున్నారు

జిల్లాలో కరోనా సంఖ్యను వెల్లడించని అధికారులు

కాకి లెక్కలు చెప్పి దాటేస్తున్న వైనం

రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు 

స్పష్టత లేని గణాంకాలు.. ఎవరికీ పట్టని బాధ్యతలు

వాస్తవాలు దాచడంతో నిర్ణయాలలో మార్పులు

అబద్ధాలతో అధికార గణం.. భయం గుప్పిట్లో జనం

నిర్మల్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : మొదటి నుంచి కరోనా విషయంలో అధికార యంత్రాంగం కాకిలెక్కలు చెబుతూ వాస్తవాలను వక్రీకరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం మొదలైన కరోనా భీభత్సంపైనా కూడా అప్పట్లో అధికారులు తప్పుడు లెక్కలు చెప్పి పక్కదోవ పట్టించారన్న విమర్శలున్నాయి. అదే మాదిరి మళ్లీ రెండోదశ కరోనా విష యంలో కూడా అధికార యంత్రాంగం వాస్తవాలను దాటి వేస్తూ తప్పుడు లెక్కలతో జనాన్ని పక్కదోవ పట్టిస్తోందన్న విమర్శలున్నాయి. టీకాల విషయంలో వాస్తవాలు వెల్లడిస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ కరోనా పరీక్షల విషయంలో మాత్రం కాకిలెక్కలు చెబుతూ తప్పించుకుంటోందంటున్నారు. రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులసంఖ్య పెరిగిపోతున్నప్పటికీ ఆ లెక్కలను బయటకు వెల్లడించకుండా కేసులసంఖ్యను తక్కువగా చేసి చూపుతుండడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కరోనాపాజిటివ్‌ కేసుల లెక్కల విషయంలో అధికారులు ఒకరి నుంచి మరొకరిపై బాధ్యతలు చూపుకొని తప్పించుకుంటున్నారంటున్నారు. జిల్లావ్యాప్తంగా 19 పీహెచ్‌సీల్లో అలాగే జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు భైంసా, ఖానాపూర్‌లలోని ఏరియా ఆసుపత్రుల్లో ప్రతీరోజూ కరోనాపరీక్షలను నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకా రం సాయంత్రానికల్లా ప్రతీ పీహెచ్‌సీ పరిధిలో కరోనాపాజిటివ్‌ కేసులసంఖ్యను సంబంధిత అధికారులు వెల్లడించాల్సి ఉంది. అయితే అధికారులు వివరాలను వెల్లడించకుండా దాటవేత వైఖరిని అవలంభిస్తున్నారు. ఎవరైనా వివరాలు అడిగితే ఆ బాధ్యతలనుపై అధికారులపై నెట్టివేస్తూ తప్పించుకుంటున్నారంటున్నారు. ఇదిలాఉండగా పాజిటివ్‌ కేసులతో పాటు కరోనాతీవ్రత కారణంగా మరణాల సంఖ్య సైతం పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది కరోనా తీవ్రతతో మరణించినట్లు చెబుతున్నారు. అయితే వైద్య,ఆరోగ్యశాఖ మాత్రం ఇప్పటి వరకు కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని వెల్లడి

 స్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే కరోనా కారణంగా మరణాలు జరుగుతున్నట్లు వెల్లడవుతోం ది. అయితే ఈ మరణాలను మాత్రం వైద్య, ఆరోగ్యశాఖ ధృవీకరించడం లేదు. కరోనా కారణంగానే మరణాలు జరగడం లేదని మృతులకు ఇతర రోగాలు ఉన్నందునే ఆ రోగాలతోనే మరణిస్తున్నారంటూ వైద్య,ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తోంది. అయితే ఈ లెక్కలన్నీ సాధారణజనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరోనాతీవ్రతపై వాస్తవాలు వెల్లడికాకపోతుండడంతో జనం మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. భౌతికదూరం పాటించకుండా గుంపులుగా తిరుగుతుండడం, అలాగే మాస్క్‌లు ధరించకపోవడం, శానిటైజర్‌లను ఉపయోగించకుండా జనం ఇంకా నిర్లక్ష్యధోరణిని అవలంభిస్తున్నారంటున్నారు. సంబంధిత యంత్రాంగం కరోనా విషయంలో ఎప్పటికప్పుడు వాస్తవాలు వెల్లడించి పరి స్థితి తీవ్రతపై జనాన్ని అప్రమత్తం చేస్తే కొంత వరకైనా జాగ్రత్తలు అమలవుతాయంటున్నారు. 

పాజిటివ్‌ కేసుల లెక్కలపై తిరకాసు 

అయితే జిల్లాలో రోజురోజుకూ కరోనాపాజిటివ్‌ కేసులసంఖ్య పెరిగిపోతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం ఆ లెక్కలను తక్కువగా చేసి చూపుతున్నారంటున్నారు. మొన్నటి వరకు జిల్లావ్యాప్తంగా 300లకు పైగా పాజిటివ్‌ కేసులు దాటిపోగా ప్రస్తుతం ఆ సంఖ్య 500లకు చేరుకుందంటున్నారు. ప్రతీరోజూ అన్ని పీహెచ్‌సీల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. అయితే ఈ పాజిటివ్‌ కేసుల విషయంలో వైద్య,ఆరోగ్యశాఖ కాకి లెక్కలు చెబుతూ తప్పించుకుంటోందన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా జిల్లా వైద్య,ఆరోగ్యశాఖకు అలాగే వైద్య విధానపరిషత్‌కు మధ్య సమన్వయం ఉండడం లేదంటున్నారు. ప్రతీ దానికి కలెక్టర్‌పై భారం వేసి ఈ అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. అధికారికంగా ఏవైనా వివరాలు అడిగితే ఆ వివరాలన్నీ కలెక్టర్‌కే తెలుసంటూ దాటవేస్తున్నారు. 

మరణాలపైనా గందరగోళం

ఇదిలా ఉండగా కరోనాకారణంగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నప్పటికీ అధికారులు మాత్రం మరణాలను కరోనా పేరిట ధృవీకరించడం లేదు. భైంసాలో ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇందులో ఒకరు టీవీ జర్నలిస్టు కూడా ఉన్నారంటున్నారు. తానూర్‌ మండలంలో కూడా ఓ మహిళ మరణించినట్లు పేర్కొంటున్నారు. వీరు కరోనాతీవ్రతతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. సారంగాపూర్‌ మండలంలోని గోపాల్‌పేట్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా హైదరాబాద్‌ లోనే చికిత్స పొందుతూ మరణించారని మరోవ్యక్తి నిజామాబాద్‌లో చికిత్స పొందు తూ మృతి చెందినట్లు ఆ గ్రామస్థులు వెల్లడిస్తున్నారు. అలాగే చించోలి (బి) గ్రామంలో కూడా ఓ వ్యక్తి, బీరవెల్లి గ్రామానికి చెందిన మరోవ్యక్తి కరోనా కారణంగా మృతి చెందారని పేర్కొంటున్నారు. దిలావర్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారం రోజుల క్రితం మృతి చెందినట్లు సమాచారం. కుభీర్‌ మండలంలోని మాలేగాం గ్రామానికి చెందిన వ్యక్తి ఓ వ్యక్తి కూడా శుక్రవారం మరణించినట్లు అక్కడి గ్రామస్తులు చెబుతుండగా లోకేశ్వరంగ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాకు గురై నిజామాబాద్‌లో చికిత్స తీసుకొని మరణించినట్లు ఆ గ్రామస్థులు పేర్కొంటున్నారు. అలాగే కడెం మండల కేంద్రానికి చెందిన పాలం బుచ్చన్న అనే వ్యక్తి కూడా శుక్రవారం కరోనా తీవ్రతతో మరణించినట్లు పేర్కొంటున్నారు. 

అందరు అప్రమత్తం కాకుంటే ముప్పే

ప్రజలు కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు ఎవరికి వారు సంసిద్ధులు కావాల్సిన అవసరం ఉందంటున్నారు. స్వీయజాగ్రత్తలతోనే కరోనాను కట్టడి చేయవచ్చంటున్నారు. కేసులసంఖ్య పెరుగుతున్నప్పటికీ మరణాల సంఖ్య కూడా పోటీ పడుతున్నప్పటికీ జనం నిర్లక్ష్యాన్ని మాత్రం వీడకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ దానికి అధికారులపైనా బాధ్యత నెట్టేసే కన్నా తమకు తాము స్వీయ నియంత్రణ పాటిస్తే వైరస్‌వ్యాప్తి తగ్గిపోతుందంటున్నారు. ముఖ్యంగా ప్రజలు గుంపులు గుంపులుగా ఒకే చోట ఉండకూడదని అలాగే సభలు, సమావేశాలకు పెద్దసంఖ్యలో హాజరు కాకుండా చూడాలని అంగళ్లు, జాతరలు, పండగలు లాంటి వాటిలో జనం సామూహికంగా పాల్గొనకుండా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. మాస్క్‌లు ధరించడం ఇక నిర్భంధం కావాల్సిన అవసరం ఉందంటున్నారు. దీంతో పాటు భౌతికదూకం పాటించాలని, సానిటైజర్‌ను కూడా ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇలా ఓ వైపు ప్రజలు, మరోవైపు అధికారులు సమన్వయంగా వ్యవహరించి కరోనాకట్టడికి సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఫలితం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-04-17T06:17:07+05:30 IST