మాటలు కాదు... చేతలే

ABN , First Publish Date - 2021-11-23T13:41:57+05:30 IST

‘మాటలు తక్కువ - చేతలు ఎక్కువ’ అన్నట్టుగానే తన వ్యవహారం వుంటుందని, న్యాయ వ్యవస్థకు వీలైనంతగా సేవ చేసేందుకు పాటుపడతానని మద్రాస్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన

మాటలు కాదు... చేతలే

- వీలైనంతగా న్యాయవ్యవస్థకు సేవ

- ఈ గడ్డపై పుట్టాలన్న కోరిక ఇలా నెరవేరింది

- మద్రాస్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతల స్వీకారం


చెన్నై: ‘మాటలు తక్కువ - చేతలు ఎక్కువ’ అన్నట్టుగానే తన వ్యవహారం వుంటుందని, న్యాయ వ్యవస్థకు వీలైనంతగా సేవ చేసేందుకు పాటుపడతానని మద్రాస్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ మునీశ్వర్‌నాథ్‌ భండారీ పేర్కొన్నారు. నిన్నటివరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వున్న సంజీబ్‌ బెనర్జీ మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలహాబాద్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిగా వున్న జస్టిస్‌ మునీశ్వర్‌నాథ్‌ భండారీని హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫారసును రాష్ట్రపతి ఆమోదించారు. ఈ నేపథ్యంలో సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమం లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి జస్టిస్‌ మునీశ్వర్‌నాథ్‌ భండారీ చేత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఇతర మంత్రులు, న్యాయ మూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు తదితరులు హాజరై జస్టిస్‌ భండారీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైకోర్టుకు చేరుకున్న జస్టిస్‌ భండారీకి ఘన స్వాగతం లభించింది. అడ్వకేట్‌ జనరల్‌ షణ్ముగ సుందరం, తమిళనాడు బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు అమల్‌రాజ్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు మోహనకృష్ణన్‌,న్యాయవాద సంఘాలకు చెందిన ప్రతినిధులు సీజేకే పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్‌ భండారీ మాట్లాడుతూ... ఐదేళ్ల క్రితం తమిళనాడులోని కొన్ని పర్యాటక ప్రాంతాలను సందర్శించినప్పుడు, ఇక్కడున్న సంస్కృతి, సంప్రదాయాలను చూసి పరవశించిపోయానని, ఈ గడ్డపై పుడితే బావుండేదని ఆనాడే భావించానని గుర్తు చేసుకున్నారు. ఆ కోరిక ఇప్పటికి హైకోర్టు న్యాయమూర్తిగా నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. తమిళనాడుకు, న్యాయవ్యవస్థకు సేవ చేయడానికి ఈ రోజు తనకు పునర్జన్మ లభించినట్టుందన్నారు. తాను, తనసోదర న్యాయమూర్తులు నిర్భయంగా, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా న్యాయ దేవాలయానికి మెరుగైన సేవలందిస్తామని హామీ ఇచ్చారు. ‘ఈ సందర్భంగా నేను ఇంతకంటే ఎక్కువ చెప్పబోను. కానీ నా చేతల్ని మీరే చూస్తారు’ అని వ్యాఖ్యానించారు. తనకు అప్పగించిన బాధ్యతలను ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా నెరవేర్చేందుకు పాటుపడతానన్నారు. ఇందుకు న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని విశ్వసిస్తున్నట్టు జస్టిస్‌ మునీశ్వర్‌నాథ్‌ భండారీ తెలిపారు. ఇదిలా వుండగా జస్టిస్‌ భండారీ 2007లో రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2019లో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లి, అక్కడి నుంచి మద్రాస్‌ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వచ్చారు.

Updated Date - 2021-11-23T13:41:57+05:30 IST