ఉద్యమ వీరుడు..పేదల పెన్నిధి

ABN , First Publish Date - 2022-08-15T04:42:02+05:30 IST

స్వాతంత్య్ర ప్రకటన వెలువడగానే అందరినోటా షేక్‌ మహ్మద్‌ మురాద్‌షా పేరు గట్టిగా మారుమోగింది. ఆయనే త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలన్న ప్రజల కోరిక మేరకు మదనపల్లెలో మొదటిసారిగా ఆయన మువ్వెన్నెల జెండాను ఎగురవేసి స్థానికుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

ఉద్యమ వీరుడు..పేదల పెన్నిధి
షేక్‌ మహ్మద్‌ మురాద్‌షా

స్వాత్రంత్యం వచ్చాక జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రథముడు 

వ్యాపారం విడిచి..ఉద్యమాల వైపు

స్వాతంత్య్ర సమరయోధుడు మురాద్‌షా


మదనపల్లె, ఆగస్టు 14: అది 1947 ఆగస్టు 14వ తేదీ రాత్రి 11:59 నిమిషాలు. వీరులు వందేళ్లు పోరాడి సాధించుకున్న ఫలితం ఆ నిమిషంలో రానుంది. బ్రిటీష్‌ పాలకులు మన దేశాన్ని మనకు అప్పగించి వెళ్లే సమయం అది. భారతీయులంతా ఆ ప్రకటనకోసం ఉద్విగ్నభరితంగా ఎదురు చూస్తున్న సమయం. ఆ సమయం రానే వచ్చింది. అదే భారతదేశానికి స్వాత్రంత్య ప్రకటన. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఆలయాల్లో పూజలు, మసీదుల్లో ప్రార్థనలు, చర్చిల్లో గంటలు మోగాయి. అదే సమయంలో స్థానిక బి.టి.కళాశాల మైదానంలో 30 వేల మందికిపైగా మొదటి స్వాతంత్య్ర సంబరాల వేడుకకు ఎదురుచూస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, త్యాగవీరులు, అధికార బృందాలు అక్కడే ఉండగా స్వాతంత్య్ర ప్రకటన వెలువడగానే అందరినోటా షేక్‌ మహ్మద్‌ మురాద్‌షా పేరు గట్టిగా మారుమోగింది. ఆయనే త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలన్న ప్రజల కోరిక మేరకు మదనపల్లెలో మొదటిసారిగా ఆయన మువ్వెన్నెల జెండాను ఎగురవేసి స్థానికుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

స్థానిక దేవళంవీధికి చెందిన షేక్‌ మహ్మద్‌ మురాద్‌షా 1888లో జన్మించారు. ఏడడుగుల ఆజానుబాహుడు. బలశాలి. అందుకే చాలామంది ఆయనను బహదూర్‌ మురాషా అని పిలిచేవారు. అన్నింటికి మించి ఫైటర్‌ కూడా. జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావంలో పట్టణంలో ప్రథమంగా పార్టీలో చేరిన వ్యక్తి కూడా ఈయనే. సంఘ సంస్కర్త, సామాజిక సేవల్లో ముందున్న మురాద్‌షా..గాంఽధేయవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఖాదీ ఉద్యమంలో భాగంగా 1929లో మదనపల్లెకు విచ్చేసిన మహాత్మాగాంధీ పిలుపు మేరకు క్విట్‌ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. క్యాన్సర్‌కు కారకమైన బీడీ, పొగాకు వాడకానికి స్వస్తి చెప్పాలన్న బాపూజీ పిలుపు మేరకు..అప్పటికే మదనపల్లెలో తాను నిర్వహిస్తున్న అతిపెద్ద బీడీ పరిశ్రమను మూసేసి వ్యాపారులకు ఆదర్శంగా నిలిచారు. మురాద్‌షా జాడీ-బీడీ పేరుతో రెండు బ్రాండ్లను ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ఎగుమతికి స్వస్తి చెప్పారు. అందులో పనిచేస్తున్న 500 మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని తెలిసినా..బాపూజీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్నట్లు చెబుతున్నారు.

దేశ కాంగ్రె్‌సలో ఉన్న అప్పటి అగ్ర నేతలలో మురాద్‌షా ఒకరు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ వెంట నడిచారు. అటు పార్టీ పరంగాను, ఇటు జాతీయోద్యమంలోనూ కీలకంగా వ్యవహరించారు. మదనపల్లెలోని అరడజను స్వాతంత్య్ర ఉద్యమకారుల్లో మురాద్‌షా ప్రథముడు. స్థానికంగా పార్టీ కార్యక్రమం జరిగినా..ఉద్యమం చేపట్టినా..అది మురాద్‌షా ఆధ్వర్యంలోనే ఉండేది. ఖాదీ ఉద్యమంలో భాగంగా పట్టణంలో ఇంటింటికీ చర్కాలు, పత్తి ఉచితంగా అందజేశారు. మరోవైపు కరువుతో ప్రజలు తిండిలేక ఆకలితో అలమట్టిస్తున్న రోజుల్లో...డెన్మార్క్‌ నుంచి పాలపొడి, కోడిగుడ్ల సొనను దిగుమతి చేసుకుని పేదలకు టోకెన్‌ పద్ధతిలో పంచి పెట్టారు. తన ఇంట్లో పని మనిషికి పాల పొడి డబ్బా ఇవ్వాలని స్వయాన ఆయన భార్య కోరినా నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించినట్లు మురాద్‌షా కుమారులు షేక్‌ మహ్మద్‌ యూసఫ్‌, షేక్‌ మహ్మద్‌ యహల్లి చెప్పడాన్ని చూస్తే...ఆయన నిజాయితీ, నిబద్ధత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవానికి స్థానిక దేవళంవీధి, ప్రస్తుత బెంగళూరు బస్టాండు ఏరియాలలో గంజి కేంద్రాలు ఏర్పాటు చేసి గంజి, సంగటి ముద్దలతో కడుపు నింపిన మహనీయుడు. అప్పటి వరకూ ఖాదీ ఖద్దర్‌ షూటు, బూటుతో ఠీవిగా తిరిగిన మురాద్‌షా..పేదరికంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి తన ఆడంబరానికి స్వస్తి చెప్పారు. పేదలకు ఉచితంగా వివాహాలు, వితంతు వివాహాలు చేయించేవారు. ఈ క్రమంలో సాధారణ ఖద్దర్‌ జుబ్బా, టవలు ధరించి వాడిపడేసిన వాహన టైరుతో ప్రత్యేకంగా చేయించిన చెప్పులతో నడియాడినట్లు చెబుతున్నారు. ఆయన మరణించిన 1975 వరకూ అదే వస్త్రధారణ, పాదరక్షలతోనే ఉన్నట్లు కుటుంబీకులు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కుటుంబం, మనా, తనా అనే స్వార్థానికి ఎక్కడా తావులేకుండా సమాజశ్రేయస్సు, స్వాతంత్య్ర సాధనే ధ్యేయంగా పనిచేసిన నిస్వార్థపరుడు మురాద్‌షా. ఈ క్రమంలో అప్పటికే తనకున్న వందల ఎకరాల భూములు, ఆస్తులు దానఽధర్మాలతో కొవ్వొత్తిలా కరిగిపోయాయి. చివరకు తనకంటూ  ఏమీ లేకుండానే తనువు చాలించారంటే అతిశయోక్తి కాదు.

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర షోషిస్తున్న మురాద్‌షాపై బ్రిటీష్‌ ప్రభుత్వం 1939, 1942లో రెండుసార్లు షూట్‌ అట్‌ సైట్‌ ఆర్డర్‌పాస్‌ చేసింది. ఈ పరిస్థితిలో మొదటిసారి ఏనుగు మల్లమ్మకొండ (ప్రస్తుత హార్సిలీహిల్స్‌)లో, రెండోసారి ఆవులపల్లె అడవుల్లో తల దాచుకున్నారు. చివరకు ప్రజల నుంచి బ్రిటీష్‌ పాలకులపై ఒత్తిడి పెరగడంతో ఆయనపై ఉన్న ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడంతో తిరిగి జనజీవనంలోకి ప్రవేశించారు. ఆజానుబాహునిగా, అంతకుమించి ఆజాత శత్రువుగా పేరొందిన మురాద్‌షా..ఇంటి నుంచి ఎక్కడికి బయలుదేరినా ఆయన వెంట వందమందికి పైగా ఉండేవారు. అందుకే అప్పటి కడప కలెక్టర్‌ హార్స్‌లీ వేసవివిడిదికి ఏనుగుమల్లమ్మకొండ (హార్స్‌లీహిల్స్‌)కు వస్తే మురాద్‌షా ముందుండేవారు. వారంరోజులకు ముందే టెలిగ్రామ్‌ ద్వారా సమాచారం ఇచ్చేవారని కుటుంబీకులు చెబుతున్నారు. ఆ దట్టమైన అడవిలో వెళ్లాలంటే మురాద్‌షా బలగంతోనే హార్స్‌లీ ముందుకెళ్లే వారని, ఈ విషయం మానాన్న తనతో చెప్పేవారని ఆయన రెండో కుమారుడు యూసఫ్‌ తెలిపారు. కలెక్టర్‌ హార్స్‌లీతో సంబంధమే మొదటిసారి షూట్‌ ఆర్డర్‌ నేపథ్యంలో మురాద్‌షా..హార్సీలీహిల్స్‌లో తలదాచుకునే ఆస్కారం ఏర్పడింది.

ఆలిండియా కాంగ్రె్‌స కమిటీలో ఏఐసీసీ సభ్యుడిగా, జిల్లా విద్యా శాఖలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా, జిల్లా పీస్‌ కమిటీ సభ్యుడిగా, ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్‌ మెంబర్‌గా దీర్ఘకాలం పనిచేశారు. స్థానికంగా ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా పీస్‌ కమిటీ హోదాలో వెళ్లి పరిష్కరించేవారు. బి.టి.కళాశాలలో పెండేకంటి వెంకటసుబ్బయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి చదివే రోజుల్లో మురాద్‌షా యూనియన్‌ నాయకుడిగా పనిచేశారు. కాంగ్రె్‌స పార్టీలో జాతీయస్థాయి నాయకులతో మంచి సంబంధాలున్నా..పార్టీ పరంగా ఎలాంటి పదవులు ఆశించకుండా ఇతరులకు త్యాగం చేసిన ఘనతగా చెప్పుకుంటున్నారు. ఈయనకు ఇద్దరు భార్యలు, 15 మంది సంతానంలో అయిదుగురు కుమారులు, పది మంది కుమార్తెలు. మూడో కుమారుడు షేక్‌ మహ్మద్‌ యాహల్లి..1981-1986 వరకు మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌, చైర్మన్‌గాను పనిచేయగా, రెండో కుమారుడు షేక్‌ మహ్మద్‌ యూస్‌ఫ..డాక్యుమెంట్‌ రైటర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి నేర్పిన నీతి, నిజాయితీ, సంస్కారంతోనే వీరంతా ఇప్పటికీ సాధారణ జీవితమే గడుపుతున్నారు. పుట్టుకతో వచ్చిన కాంగ్రె్‌స వాదం, తండ్రి ఉద్యమ స్ఫూర్తితో యాహల్లి నిత్యం..తన జేబులో జాతీయ జెండాను పోలిన చిహ్నంతో పెన్నులు పెట్టుకుని కనిపిస్తారు.

Updated Date - 2022-08-15T04:42:02+05:30 IST