Afghan journalist: తాలిబాన్ల బారి నుంచి ఎలా తప్పించుకున్నానంటే...

ABN , First Publish Date - 2021-08-20T14:12:19+05:30 IST

అఫ్ఘాన్ జర్నలిస్ట్ రామిన్ రహమాన్ తాను తాలిబాన్ల బారి నుంచి అమెరికా విమానంలో తప్పించుకొని పారిపోయిన క్రమాన్ని వెల్లడిస్తూ మొట్టమొదటిసారి వీడియో విడుదల చేశారు....

Afghan journalist: తాలిబాన్ల బారి నుంచి ఎలా తప్పించుకున్నానంటే...

కాబూల్ : అఫ్ఘాన్ జర్నలిస్ట్ రామిన్ రహమాన్ తాను తాలిబాన్ల బారి నుంచి అమెరికా విమానంలో తప్పించుకొని పారిపోయిన క్రమాన్ని వెల్లడిస్తూ మొట్టమొదటిసారి వీడియో విడుదల చేశారు. తాలిబాన్లు కాబూల్‌ని స్వాధీనం చేసుకున్న రోజు హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికా విమానంలో రామిన్ రహమాన్ తప్పించుకున్న క్రమాన్ని వివరించి చెప్పారు.రామిన్ రహమాన్ తప్పించుకున్న భయంకర అనుభవాలను ఆయన మాటల్లోనే విందాం.

‘‘అది కాబూల్ నగరంలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం...రన్ వేపై వేలాదిమంది భయంతో సహాయం కోసం వేడుకుంటున్నారు...తుపాకీ గుళ్ల కాల్పుల మోతతోపాటు ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతున్నాయి. 


కాబూల్ విమానాశ్రయంలో భయం...భయం

వేలాదిమంది గుమిగూడిన ప్రజల మధ్య నేను కాబూల్ విమానాశ్రయానికి వచ్చాను. తాలిబాన్ల రాకతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. విమానాలు ఉన్నప్పటికీ వాటిని నడిపేందుకు పైలెట్ అందుబాటులో లేరు. అఫ్ఘానిస్థాన్ దేశంలోని ఓ ప్రైవేటు సంస్థ యాజమాన్యంలోని ఒక విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆ విమానంలోకి పెద్దసంఖ్యలో ప్రయాణికులు దూకారు.ఆ విమానంలో 1000 మందికి పైగా ప్రయాణికులు ఎక్కారు. మరికొందరు విమాన మెట్ల మీద నుంచి వేలాడుతున్నారు. అత్యంత రద్దీగా ఉన్న విమానం రాజకీయ నాయకులతో నిండిపోయింది. అంతలో వ్యక్తిగత గార్డులు పౌరులను మెట్లపై నుంచి నెట్టారు. దీంతో విమానం టేకాఫ్ కావచ్చు అనుకున్నాను. 


కాల్పుల శబ్ధం వినిపించింది...

నా చుట్టూ ఉన్న వారందరూ భయపడ్డారు. నేను జర్మనీలోని ఉన్న నా స్నేహితుడితో మాట్లాడాను. మరుసటి రోజు జర్మన్ల తరలింపు ప్రారంభిస్తారని అతను చెప్పాడు.అంతలో విమానాశ్రయం మొదటి గేటు వెలుపల కాల్పుల శబ్దం వినిపించింది. ఆ సమయంలో అమెరికన్ సైనిక దళాలు తార్మాక్ సైనికవిభాగంలోకి కొందరినీ తీసుకువెళ్లడం నేను చూశాను.ఇది సైనికుల నేల తాలిబాన్లు ఇక్కడకు రారు అని సైనికుల్లో ఒకరు విదేశీయుల బృందంతో చెప్పడం విన్నాను. తుపాకీ కాల్పుల మధ్య నేను ఇతరులతో కలిసి అమెరికా సైనికుల వెంట పరుగెత్తాను. వందలాదిమందితో కలిసి నేను విమానంలోకి ఎక్కినా కూర్చోడానికి స్థలం లేక నిలబడ్డాను. ప్రజలు పిల్లలను పట్టుకొని నిలబడ్డారు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. 


విమానం టేకాఫ్ అవుతుండగా చప్పట్లు కొట్టాం...

విమానంలో 1000 మంది ఎక్కడంతో సెంటీమీటరు కూడా ఖాళీ లేదు. యుద్ధ భూమి నుంచి విమానం ఎగురుతుండగా నేను చాలా సంతోషించాను. మేం కేవలం యుద్ధభూమి నుంచి ఎగురుతున్నందున అందరూ చప్పట్లు కొట్టాం. మేం విమానం బయట తుపాకీ కాల్పుల శబ్దాలు వింటున్నాం. అఫ్ఘానిస్తాన్ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులున్నారు.ఇది నా జీవితంలో సంతోషకరమైన క్షణాల్లో ఒకటి. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత అమెరికన్ పైలట్ పట్ల ప్రశంసల భావన కలిగింది. బహుశా ఆ విమానం రాకపోతే మేం చనిపోయేవాళ్లం. తాలిబాన్ల బారినుంచి బయటపడినందుకు నేను చాలా సంతోషించాను’’ అని తన భయానక అనుభవాలను అఫ్ఘాన్ జర్నలిస్ట్ రహమాన్ వివరించారు. 

 

Updated Date - 2021-08-20T14:12:19+05:30 IST