Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 9 2021 @ 08:37AM

పచ్చని అడవిలో చిచ్చు... నెత్తురోడిన నీలగిరి జిల్లా

- 13 మందిని పొట్టనబెట్టుకున్న లోహవిహంగం

- ఇందులో 12 మంది దేశరక్షకులే

- ఉలిక్కిపడిన రాష్ట్రం


చెన్నై: పచ్చని అడవిలో చిచ్చు రేగింది. లోహవిహంగం సృష్టించిన బీభత్సంతో నీలగిరి జిల్లా నెత్తురోడింది. ఏకంగా 12 మంది దేశరకక్షలతో కలిపి మొత్తం 13మందిని పొట్టనబెట్టుకుంది. బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో రాష్ట్రంతో పాటు యావద్దేశం దిగ్ర్భాంతి చెందింది. భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది వున్నట్లు వార్తలు వెలువడడంతో అందరూ సురక్షితంగా వుండాలంటూ ప్రజలంతా వేనోళ్ల భగవంతుడిని ప్రార్థించారు. ఆ తరువాత ప్రమాదంలో నలుగురైదుగురు చనిపోయారని, ఘటనలో బిపిన్‌ రావత్‌ తదితరులు కూడా వున్నారన్న సమాచారం పొక్కడంతో కనీసం ఆయనైనా బయటపడాలంటూ దేశం యావత్తు ఉత్కంఠతో ఎదురు చూసారు. అయితే గంటగంటకూ మృతుల సంఖ్య పెరుగుతుండడం, ఘటనాస్థలి భీతావహంగా వుండడంతో బిపిన్‌ రావత్‌ దంపతులు కూడా మరణించివుంటారని అందరూ నిర్ధారణకు వచ్చారు. ఆ తరువాత వాయుసేన సైతం దీనిని నిర్ధారించడంతో ఈ వార్త సాధారణ పౌరుడి నుంచి రాష్ట్రపతి వరకు దిగ్ర్భాంతి గొలిపింది. నిజానికి మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య సమయంలో రాష్ట్రం ఆ స్థాయిలో ప్రపంచం నోళ్లలో నానింది. ఇప్పుడు హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో దేశ సీడీఎస్సే మృతి చెందడంతో అదే స్థాయిలో యావత్‌ ప్రపంచం తమిళనాడు వైపు ఉత్కంఠతో చూసింది. నాడు జాతీయ నేత రాజీవ్‌ హత్యకు, ఇప్పుడు దేశాన్ని రక్షించే సైన్యాధికారుల బలికి రాష్ట్రం సాక్ష్యంగా మిగలడంతో ప్రజల్లో తీవ్ర విషాదం నెలకొంది. 


వెల్లింగ్టన్‌ ఆస్పత్రికి స్టాలిన్‌

హెలిక్యాప్టర్‌ ఘటనలో ఇంతమంది మరణించడంతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ హుటాహుటిన నీలగిరికి బయలుదేరి వెళ్లారు. అక్కడ నుంచి బిపిన్‌ రావత్‌ భౌతికకాయం ఉన్న వెల్లింగ్టన్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన అక్కడ అందుబాటులో ఉన్న సైనిక ఉన్నతాధికారులో సమావేశమై పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హెలిక్యాప్టర్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు. 


నేతల సంతాపం

హెలిక్యాప్టర్‌ దుర్ఘటన పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. బిపిన్‌ రావత్‌ మృతి పట్ల రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఇదే విషయంపై బుధవారం రాత్రి రాజ్‌భవన్‌ ఒక  ప్రకటన విడుదల చేసింది. బిపిన్‌ రావత్‌ మృతి తనను ఎంతో దిగ్ర్భాంతితో పాటు వేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. రావత్‌ కుటుంబం దేశసేవకే అంకితమై సైన్యంలో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. రావత్‌ తండ్రి భారత సైన్యంలో పనిచేయగా, ఆయన వారసుడుగా సైన్యంలోకి ప్రవేశించిన బిపిన్‌ రావత్‌ దేశ 26వ ఆర్మీ చీఫ్‌గా పనిచేశారన్నారు. జాతి సేవకే అంకితమైన రావత్‌ రక్షణ వ్యూహాలు అత్యున్నతమైనవిగా కొనియాడారు. రావత్‌ సమర్థ నాయకత్వం, అపారమైన అనుభవం, వినూత్న ఆలోచనలు భారత సైన్యం నవీకరణకు దోహదపడ్డాయని గుర్తుచేశారు. ఎంతో నిజాయతీ నిబద్ధతతో సైన్యంలో సేవ చేసిన రావత్‌ వంటి ధైర్యశాలిని దేశం కోల్పోయిందన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రావత్‌తో పాటు ఆయన అర్థాంగి మధులికా రావత్‌తో పాటు ఇతర రక్షణ సిబ్బంది కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ, అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, ఓ.పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అమరవీరుల మృతి పట్ల ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.


తగిన విచారణ చేపట్టాలి : డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌

సైనికాధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కున్నూర్‌ కొండ ప్రాంతంలో ప్రమాదానికి గురైన ఘటన దిగ్ర్భాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులిక రావత్‌ సహా 13 మంది మృతిచెందిన ఘటన ఆవేదనకు గురిచేసింది. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేపట్టాలి.


మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

 ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌

సైనిక హెలికాప్టర్‌ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ సహా 13 మంది మృతిచెందిన ఘటన తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.Advertisement
Advertisement