బండెనక బండి...తోడేస్తున్నారండీ

ABN , First Publish Date - 2022-01-14T05:12:56+05:30 IST

జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ప్రధాన ఆదాయ వనరుగా మారడంతో అందివచ్చిన అవకాశాలను మాఫియా విడిచిపెట్టడం లేదు. స్థానిక అవసరాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణం పేరిట ఇసుక తరలించుకుపోతున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం నగరం సమీపంలోని నాగావళి నదీ తర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. టైరుబళ్లలో తరలిస్తున్నారు.

బండెనక బండి...తోడేస్తున్నారండీ
శ్రీకాకుళం నగరంలో మార్కెట్‌ సెంటర్‌ వద్ద బారులు తీరిన ఇసుక బళ్లు

- జోరుగా ఇసుక తవ్వకాలు

- సొంత అవసరాల పేరుతో వ్యాపారం

- రహస్య ప్రదేశాల్లో స్టాక్‌ పాయింట్లు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ప్రధాన ఆదాయ వనరుగా మారడంతో అందివచ్చిన అవకాశాలను మాఫియా విడిచిపెట్టడం లేదు. స్థానిక అవసరాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణం పేరిట ఇసుక తరలించుకుపోతున్నారు.  ప్రధానంగా శ్రీకాకుళం నగరం సమీపంలోని నాగావళి నదీ తర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. టైరుబళ్లలో తరలిస్తున్నారు. గూనపాలెం రేవు, కళ్లేపల్లిరేవు, శాంతినగర్‌ కాలనీ, హయాతీనగరం, తోటపాలెం, ఎచ్చెర్ల మండలం పొన్నాడ, తమ్మినాయుడుపేట, ముద్దాడపేట వద్ద తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.  ఆమదాలవలస మండలం కొత్తవలస, చవ్వాకులపేట, పాతనిమ్మతుర్లాడ, తొగరాం, దూసి, తోకాడ పరిసరాల్లో సైతం తవ్వి... టైరుబళ్లతో తరలిస్తున్నారు. ఒక్కో బండి ఇసుక రూ.800కు విక్రయిస్తున్నారు. దూరాన్నిబట్టి రూ.1200 వరకూ వసూలు చేస్తున్నారు. పోలాకి మండలం వనితమండలం, నరసన్నపేట మండలం మడపాం, కరజాడ, బుచ్చిపేట, లుకలాం, జలుమూరు మండలం దొంపాక, అంధవరం, కరకవలస, వంశధార కుడి కాలువ పరిధిలో పొన్నాం బట్టేరు, రోణంకి, కరజాడ, పురుషోత్తపురం గ్రామాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. పాలకొండ, మంగళాపురం, అంపిలి, అన్నవరం, గోపాలపురం, బూర్జ మండలం అల్లిన, నారాయణపురం లాభాం, లంకాం, గుత్తావెల్లి గ్రామాల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రేగిడి మండలం తునివాడ, సంకిలి, తునివాడ, సరసనాపల్లి, పుర్లి, కుమిరె వెంకటాపురం గ్రామాల్లో ఇసుక తోడేస్తున్నారు. వంగర మండలం సంగాం, గీతనాపల్లిల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. సంతకవిటి మండలం జావాం, రంగారాయపురం, తమరాం, మేడమర్తి, వంజరాం, కోడలి, చిత్తారిపురం, వాల్తేరు, కావలి గ్రామాల్లో నాగావళి నదీ పరీవాక ప్రాంతం నుంచి ఇసుక తరలిపోతోంది. 


రహస్యంగా ఇసుక స్టాక్‌ పాయింట్లు...

శ్రీకాకుళంలోని ప్రధాన రహదారులన్నీ అర్ధరాత్రి నుంచి తెల్లారే వరకు ఇసుక లోడులతో ఉన్న ఎడ్లబళ్లతో నిండిపోతున్నాయి. కొందరు రహస్య ప్రదేశాలలో ఇసుక నిల్వ చేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు.  ఒక చోట ఇసుక పోగులు వేసుకొని ట్రాక్టర్ల ద్వారా సుదూర ప్రాంతాలకు  తరతలిస్తున్నారు. పాత బిల్లులు, ప్రభుత్వ నిర్మాణాలకు స్థానికంగా పొందిన అనుమతుల రసీదులతో రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల అనుమతి లేని ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నా, మొక్కుబడిగా అపరాధ రుసుం విధించి. వదిలేస్తున్నారు.  ఇదే అదునుగా స్థానిక చోటా నాయకులు ఎడ్లబళ్లకు వేలాది రూపాయిలు పెట్టుబడులు పెట్టి తయారు చేయించి, ఇసుక రవాణా చేసి అమ్ముకొనే పనిలో ఉన్నారు 

Updated Date - 2022-01-14T05:12:56+05:30 IST