బోధన్‌ డివిజన్‌లో జోరుగా వరినాట్లు

ABN , First Publish Date - 2022-06-24T06:52:32+05:30 IST

జిల్లాలోని బోధన్‌ డివిజన్‌లో జోరుగా వరినాట్లు మొ దలయ్యాయి. మేలోనే నారుమడులను సిద్ధం చేసిన రైతులు 20 రోజులుగా నాట్లను కొనసాగిస్తున్నారు. భూగర్భజలాలకు తోడు వర్షాలు పడుతుండడంతో గ్రామాల కూలీలతో పాటు బీహార్‌, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల ద్వారా నాట్లను వేయిస్తున్నా రు.

బోధన్‌ డివిజన్‌లో జోరుగా వరినాట్లు

వర్షాలకు ముందే నాట్లను మొదలుపెట్టిన రైతులు

ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకువస్తున్న వైనం

డీజిల్‌ ధరలు పెరగడంతో రైతులకు పెరిగిన  పెట్టుబడి భారం

నిజామాబాద్‌, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని బోధన్‌ డివిజన్‌లో జోరుగా వరినాట్లు మొ దలయ్యాయి. మేలోనే నారుమడులను సిద్ధం చేసిన రైతులు 20 రోజులుగా నాట్లను కొనసాగిస్తున్నారు. భూగర్భజలాలకు తోడు వర్షాలు పడుతుండడంతో గ్రామాల కూలీలతో పాటు బీహార్‌, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల ద్వారా నాట్లను వేయిస్తున్నా రు. త్వరగా పనులు పూర్తిచేసేవిధంగా వరినాట్లను కొనసాగిస్తున్నారు. నిజాంసాగర్‌, అలీసాగర్‌ నీరు విడుదల కాకున్న బోర్లపైనే ఆధారపడి ఈ నాట్లను వేస్తున్నారు. ఈ నెలాఖరులోపు నిజాంసాగర్‌ నుంచి నీటి విడుదల చేసే అవకాశం ఉం డడంతో ముందస్తుగానే వరినాట్లను పూర్తిచేస్తున్నారు.

        నెల ఆరంభం నుంచే నాట్లు..

జిల్లాలోని బోధన్‌, కోటగిరి, వర్ని, ఎడపల్లి, నవీపేట, రెంజల్‌, మోస్రా, చందూర్‌ మండలాల పరిదిలో వరినాట్లను వేస్తున్నారు. నెల ఆరంభం నుంచే రైతులు వరినాట్లను మొదలుపెట్టారు. ఏప్రిల్‌ నెలలోనే వరికోతలు పూర్తిచేసిన రైతులు మే నెలలో నారుమడులను పోశారు. ఈ మండలాల పరిధిలోని గ్రామాల్లో నిజాంసాగర్‌ నీళ్లు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఈ వరినాట్లను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇంకా విడుదల చేయకున్నా ముందస్తుగానే బోర్ల ద్వారా నీటిని ఇస్తూ ఈ వరినాట్లను వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ డివిజన్‌ పరిధిలో సుమారు 50వేల ఎకరాల వర కు వరినాట్లను వేశారు. ప్రతిరోజూ వేలాది మంది రైతులు నాట్లను వేస్తున్నారు. ట్రాక్టర్‌ల ద్వారా పొలా లను దున్నుతూ నాట్లను కొనసాగిస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలో వ్యవసాయ కూలీలు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి నాట్లను వేస్తున్నారు. వీరితో పాటు బీహార్‌, యూపీ నుంచి వచ్చిన కూలీల ద్వారా కూడా వరినాట్లను కొనసాగిస్తున్నారు. వర్షాలు ఇంకా ఊపందుకోకున్న ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయకున్న భూగర్భజలాలు అందుబాటులో ఉండడంతో ఈ వరినాట్లను కొనసాగిస్తున్నారు. ప్రతి సీజన్‌లో ఈ డివిజన్‌ పరిధిలో జూన్‌ చివరిలోపే వరినాట్లను పూర్తిచేస్తున్న రైతులు మళ్లీ నవంబరు, డిసెంబరు నెలలోనే యాసంగి సాగును మొదలుపెడుతున్నారు. జిల్లాలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌ డివిజన్‌ కంటే ముందు గా ఈ డివిజన్‌ పరిధిలో ప్రతి సంవత్సరం వరినాట్ల ను కొనసాగిస్తున్నారు. ఈ నెలాఖరులోపు ఈ డివిజన్‌ పరిధిలోని అన్ని గ్రామాల పరిధిలో వరినాట్లు పూర్తవుతాయని వ్యవసాయ అధికారుల అంచనా వేస్తున్నారు.

       బోధన్‌ డివిజన్‌లో లక్షన్నర ఎకరాల్లో సాగు..

జిల్లాలో సుమారు 4లక్షల ఎకరాల వరకు వరిసాగవుతుందని అంచనా వేయగా.. బోధన్‌ డివిజన్‌ పరిధిలోనే లక్షన్నర ఎకరాల్లో వరిసాగవుతుందని వ్యవసాయ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ డివిజన్‌ పరిధిలో అత్యధికంగా వరినాట్లు పడుతుండడంతో కావాల్సిన ఎరువులను కూడా ఎక్కువశాతం ఈ డివిజన్‌కు మళ్లించారు. సహకార సంఘాలు, ఆగ్రోస్‌ కేంద్రాలు మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతులకు అందిస్తున్నారు. వరినాట్ల సమయంలో కాంప్లెక్స్‌తో పాటు యూరియాను అత్యధికంగా వేయనుండడంతో ముందస్తుగా ఈ ఏర్పాట్లను చేశారు. ఇతర డివిజన్‌లలో వరినాట్లు మొదలుకాక ఆరుతడి పంటలే ఎక్కువగా సాగవుతుండడంతో ఈ డివిజన్‌కు ఎక్కువగా ఈ ఎరువులను పంపిస్తున్నారు. ఈ డివిజన్‌ పరిధిలో రైతులు పెట్టుబడులకు బ్యాంకులతో పాటు ఇతరులను ఆశ్రయిస్తూ అప్పులు తీసుకుంటూ నాట్లను పూర్తిచేస్తున్నారు. జిల్లా బ్యాం కర్ల కమిటీ రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో ఆయా బ్యాంకుల పరిధిలో కూడా రైతులకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలను అందిస్తున్నారు. పాత రుణాలను రీషెడ్యూల్‌ చేయడంతో పాటు కొత్త రుణాలను రైతులకు ఇస్తున్నారు.

        పెరిగిన ఖర్చులు..

కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి వంద రూపాయలు ధర పెంచినా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం వరినాట్లపై పడింది. ట్రాక్టర్‌ ద్వారా పొలం దున్నుతుండడంతో గత సంవత్సరం కంటే ధరలను పెంచారు. ఎక్కువ మొత్తంలో డిమాండ్‌ చేస్తున్నారు. గత సంవత్సరం ఎకరం పొలం దున్నేందుకు రైతులు 4వేల వరకు వెచ్చించగా ప్రస్తుతం 5వేలకు పైగా ఖర్చు అవుతుంది. డీజిల్‌ ధరలు పెరగడం వల్ల ట్రాక్టర్‌ యజమానులు కూడా ధరలు పెంచారు. రైతులు తప్పనిసరి పరిస్థితిలో త్వరగా వేసేందుకు ధరలు ఎక్కువైనా ఖర్చుపెడుతున్నారు. ఈ దఫా నాట్లు కూలీ కూడా పెరిగింది. గత సంవత్సరం ఎకరాకు 3వేల వరకు ఖర్చుకాగా ప్రస్తుతం 3500 వరకు ఖర్చు అవుతుంది. దూర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావడం వల్ల రైతులపై  భారం పడుతోంది. త్వరగా వరినాట్లను పూర్తిచేసేందుకు భారం ఎక్కువైనా ఈ పనులను కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కూడా వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. సిరికొండ మండలం పరిధిలో రైతులు ముందస్తుగానే వరినాట్లను మొదలుపెడుతున్నారు. వర్షాలు పడి ప్రాజెక్టులు శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తే అన్ని ప్రాంతాల రైతులు కూడా నాట్లను మొదలుపెట్టనున్నారు. జిల్లాలో జూలై చివరి వరకు నాట్లు పూర్తిచేస్తే దిగుబడి కూడాబాగా వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వర్షాలను బట్టి ఆగస్టు వరకు వేసిన ముందుగా వేసిన వారికి కోతల సమయంలో ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం ఉంది.

బీహార్‌, పశ్చిమబెంగాల్‌ కూలీలే ఆధారం..

ఫ సాయిలు, రైతు (కోటగిరి)

నాకు 14 ఎకరాల భూ మి ఉంది. మొత్తం వరి వేస్తాం. కూలీల కొరతతో బీహార్‌, పశ్చిమబెంగాల్‌ కూలీలపై ఆధారపడా ల్సి వస్తోంది. ఎకరాకు 4వేలు చెల్లిస్తున్నాం. సాగు ఖర్చు విపరీతంగా పెరిగింది. గత సంవత్సరం 35వేలు ఉండగా ఈ యేడు 37వేలు దాటింది. రుణమాఫీ పూర్తిగా అమలుకాకపోవడంతో బ్యాంకులకు వెళ్లలేక ప్రైవేట్‌గా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

వరి సాగులో పెట్టుబడికి తీవ్ర ఇబ్బంది.. 

ఫ చలపతిరావు, ఎత్తొండ

వరి సాగుచేసేందుకు పెట్టుబడి లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తోంది. యాసంగి సీజన్‌లో అరకొరగా పంట సాగుచేయడం వల్ల దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపో యా ం. మరోవైపు కూలీలు, డీజిల్‌ రేట్లు పెరగడంతో పెట్టుబడి భారం పెరిగింది. సాగు చేసేందుకు ఎకరాకు రూ.35వేలకు పైగా ఖర్చు అవుతోంది. 

జిల్లాలో నాట్లు కొనసాగుతున్నాయి..

ఫ తిరుమలప్రసాద్‌, జేడీఏ 

జిల్లాలో ఈ నెల ఆరంభం నుంచే వరినాట్లు కొనసాగుతున్నాయి. బోధన్‌ డివిజన్‌ పరిధిలో ఎక్కువ మొత్తంలో రైతులు వరిసాగు కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుల నీటి విడుదల కాకున్నా రైతులు భూగర్భజలాలు ఉండడంతో వేస్తున్నా రు. వారికి కావాల్సిన ఎరువులను అందుబాటులో ఉంచాం. 

Updated Date - 2022-06-24T06:52:32+05:30 IST