గాలి.. వాన..

ABN , First Publish Date - 2022-05-26T06:40:38+05:30 IST

అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు గాలి, వానతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

గాలి.. వాన..
భీమవరం మండలం కరుకువాడలో ఆరబెట్టిన ధాన్యం

అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు గాలి, వానతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చేల వద్ద వరి కుప్పలు, ధాన్యం రాశులు, బస్తాలు తడిచిపోయాయి. గాలి ధాటికి పూరిళ్లు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగి సరఫరా నిలిచిపోవడంతో చుట్టూ అంధకారం. ఎడతెరిపిలేని వర్షంతో ఎటూ కదలడానికి వీలులేక రైతులు నష్టాల బారిన పడ్డారు. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 


భీమవరం రూరల్‌, మే 25 : అర్థరాత్రి వేళ అకస్మాత్తుగా కురిసిన వర్షం ధాన్యం రాశులు, బస్తాలను తడిపింది. మండలంలో బేతపూడి, కరుకువాడ, తుందుర్రు, తాడేరు ప్రాంతాలలోని ధాన్యం రాశులు తడిచాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతెరిపిలేని వర్షంతో పంట చేలల్లో అడుగు లోతు నీరు నిలిచింది. ఈదురు గాలులకు చెట్లు కొమ్మలు విరిగి 12గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.


పాలకోడేరు: మండలంలో గాలి వాన నష్టాన్ని మిగిల్చింది. అర్ధరాత్రి పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. మోగల్లులో కట్టా కృష్ణమూర్తి ఇల్లు కుప్ప కూలడంతో పదేళ్ల బాలుడు సహా ముగ్గురు లోపల చిక్కుకుపోయారు. స్థాని కులు స్పందించి వారిని వెలికితీశారు. గరగపర్రు, వేండ్ర అగ్రహారంలో రెండు ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. శృంగవృక్షం, పెన్నాడ, వేండ్ర అగ్రహారం, కోరుకొల్లు, మైప, గరగపర్రు, కొండేపూడి గ్రామాల్లో విద్యుత్‌ వైర్లపై చెట్లు విరిగిపడి 20 స్తంభాలు నేలకొరిగాయని ఎలక్ట్రికల్‌ ఏఈ ఆర్‌వి అప్పారావు తెలిపారు. కొండేపూడిలో ఒక రైతుకు చెందిన సుమారు 50 బస్తాలు ధాన్యం గాలివానకు తడిచి ముద్దయ్యాయి.


పాలకొల్లు టౌన్‌: పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి వర్షానికి తోడు బలమైన గాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పల్లపు ప్రాంతమై రైల్వే గేటు వీధిలో నీరు నిలిచిపోయింది. విద్యుత్‌ శాఖ సిబ్బంది తెల్లవార్లు శ్రమించి బుధవారం ఉదయానికి సరఫరా పునరుద్ధరించినట్లు విద్యుత్‌ శాఖ వీరవల్లి నాగేశ్వరరావు తెలిపారు.


వీరవాసరం: గాలులకు చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. విద్యుత్‌ తీగలు తెగి సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. రైతులు చేలల్లో ఉంచిన ధాన్యం రాశులు, బస్తాలు తడిచిపోయాయి. బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు బ్రేక్‌ డౌన్‌లో ఉన్నాయి. రక్షిత నీటి సరఫరా నిలిచిపోయింది. సాయంత్రానికి కొన్ని గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. మత్స్యపురి, బొబ్బనపల్లి, మత్స్యపురిపాలెంలో ధాన్యం రాశులు తడిచిపోయాయి. ఆకు కూరలు, భీర తోటలు నీట మునిగాయి. అరటితోటలు విరిగి పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Updated Date - 2022-05-26T06:40:38+05:30 IST