భారీ వర్షం.. రైతుల హర్షం

ABN , First Publish Date - 2021-06-24T05:41:50+05:30 IST

వాతావరణ ప్రభావంతో బుధవారం చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది.

భారీ వర్షం.. రైతుల హర్షం
చోడవరంలో కురుస్తున్న వర్షం

చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో హోరు వాన

చల్లబడిన వాతావరణం.. జనం ఉపశమనం


చోడవరం, జూన్‌ 23: వాతావరణ ప్రభావంతో బుధవారం చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం ప్రారంభమైన వాన మధ్యాహ్నం వరకూ పడింది. అడపాదడపా జల్లులతో పాటు మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం వానా కాలాన్ని తలపించింది. ఈ నెల 3వ తేదీ తరువాత నుంచి వర్షం కురవకపోవడం, 20 రోజుల తరువాత హోరు వాన పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. చోడవరం మండలంలో 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


రావికమతం: మండలంలో కురిసిన భారీ వర్షం ఖరీఫ్‌ వరి సాగుకు సమాయత్తమవుతున్న రైతులకు ఊరటనిచ్చింది. ఇప్పటికే వరినారు మడులు దున్ని విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. వారం, పది రోజుల్లో నారు పోసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో వర్షం పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మినుము, పెసర, బొబ్బర పంటలకు ఈ వర్షం ఎంతగానో దోహదపడుతుందని రైతులు చెబుతున్నారు. మరోవైపు పది రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న మండల ప్రజలకు ఈ వర్షం సేదదీర్చింది. 


బుచ్చెయ్యపేట: మండలంలో బుధవారం కురిసిన వర్షంతో వారం రోజులుగా ఎండ వేడికి అల్లాడుతున్న ప్రజానీకం ఉపశనం పొందారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లపడింది. ఈ వర్షం చెరకు, సరుగుడు, అపరాల పంటలతో పాటు పచ్చిరొట్ట ఎరువుల సాగుకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు తెలిపారు.


మాడుగుల రూరల్‌: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం మోస్తరు వర్షం పడింది. ఉదయం ఎనిమిది గంటలకే వాతావరణంలో మార్పు వచ్చింది. తేలికపాటి గాలులు వీస్తూ వర్షం కురవడంతో పంట భూముల్లో నీరు చేరింది. అలాగే రహదారులపై వర్షం నీరు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. మండలంలోని వీరవిల్లి అగ్రహారం, పోతనపూడి  అగ్రహారం, గొటివాడ అగ్రహారం, వీరనారాయణం, ముకుందపురం, కేజే పురం, ఎం.కోటపాడు తదితర గ్రామాల్లో వాన భారీగా పడింది. వరి ఆకుమడులు తయారు చేసుకునేందుకు, చెరకు తోటలకు ఈ వర్షం ఉపయోగకరంగా ఉందని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2021-06-24T05:41:50+05:30 IST