కిక్కు.. తగ్గేదే లేదు

ABN , First Publish Date - 2022-07-13T04:42:19+05:30 IST

‘మన ప్రభుత్వం వచ్చాక మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తా’మని వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో.. ‘దశలవారీగా మద్యపానాన్ని నిషేధించి కేవలం ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తా’మని ప్రకటించారు. కానీ ఇప్పుడు.. మద్య నిషేధం మాట మరిచిపోయారు. దశల వారీ నియంత్రణకు నీళ్లొదిలేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం విక్రయాలతోనే ఖజానా నింపే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

కిక్కు.. తగ్గేదే లేదు

జోరుగా మద్యం విక్రయాలు
దశలవారీ నిషేధానికి వెనుకడుగు
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

‘మన ప్రభుత్వం వచ్చాక మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తా’మని వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో.. ‘దశలవారీగా మద్యపానాన్ని నిషేధించి కేవలం ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తా’మని ప్రకటించారు. కానీ ఇప్పుడు.. మద్య నిషేధం మాట మరిచిపోయారు. దశల వారీ నియంత్రణకు నీళ్లొదిలేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం విక్రయాలతోనే ఖజానా నింపే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాలు, ప్రజల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా పాలకులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. టీడీపీ హయాం కన్నా.. వైసీపీ మూడేళ్ల పాలనలో రూ.కోట్లలో విక్రయాలు పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో మద్య నిషేధం అమలవుతుందా? లేదోనన్నది చర్చనీయాంశమవుతోంది.

చెప్పిందొకటి.. చేసిందొకటి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు.. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానానికి పొంతన కుదరడం లేదు. 2024 నాటికి దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా 2019లో 20 శాతం మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 191 మద్యం దుకాణాలు ఉండగా.. వాటిని 158కి పరిమితం చేసింది. ఆ మరుసటి ఏడాది 2020లో తగ్గించాల్సిన 20 శాతాన్ని 13 శాతానికి కుదించారు.. 2021లో మూడో దశ నిషేధాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం ఒక్క షాపు కూడా మూయలేదు. పైగా వాక్‌ ఇన్‌ స్టోర్ల పేరిట భారీ ఎత్తున మద్యం మాల్స్‌ ఏర్పాటు చేసింది. గవర్నమెంట్‌ రిటైల్‌ అవుట్‌లెట్స్‌ పేరిట 14 దుకాణాలు వెలిశాయి. పర్యాటక ప్రాంతాల్లో ఆరు బార్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 178 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకి రూ.4 కోట్లకు పైగా అమ్మకాలు సాగుతున్నాయి.

మూడేళ్లలో రూ.3872 కోట్లు విక్రయాలు
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో(2014 నుంచి 2019 వరకు) రూ.3623.13 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి.  2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ ఏడాది జూన్‌ 30 వరకు జరిగిన మద్యం అమ్మకాలు ఏకంగా రూ.3872.57 కోట్లు. అంటే టీడీపీ హయాంలో ఐదేళ్ల కాలంలో మద్యం విక్రయాలపై వచ్చిన ఆదాయం కంటే.. వైసీపీ మూడేళ్ల పాలనలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయమే అధికం. ధరలు పెంచి మందుబాబులను తాగుడుకు దూరం చేస్తామన్న ప్రభుత్వం ఆ మాట మరిచిపోయింది. మద్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టలేదు సరికదా.. సొంత బ్రాండ్లు విక్రయించి ప్రజలను దోచుకోవడం చర్చనీయాంశమవుతోంది. రెండేళ్లలో మద్యం ధరలను 20 శాతం చొప్పున రెండు సార్లు తగ్గించగా.. జోరుగా విక్రయాలు సాగుతున్నాయి.  

 2014 నుంచి 2019 వరకు...
సంవత్సరం    లిక్కర్‌ కేసులు    బీర్‌ కేసులు        విక్రయాలు
-----------------------------------------------------------------
2014-15        14,49,847        7,07,711        రూ.552.08 కోట్లు
2015-16        15,91,359        8,11,311        రూ.629.54 కోట్లు
2016-17        16,20,229        7,78,706        రూ.639.81 కోట్లు   
2017-18        17,77,183        10,40,513        రూ.842.59 కోట్లు
2018-19        19,26,455        12,00,238        రూ.959.11 కోట్లు
-----------------------------------------------------------------
మొత్తం        83,65,073        45,38,479        రూ. 3623.13 కోట్లు
---------------------------------------------------------------

ఈ మూడేళ్ల కాలంలో.....

సంవత్సరం        లిక్కర్‌ కేసులు    బీరు కేసులు        విక్రయాలు
------------------------------------------------------------------- 
2019-20            15,67,589        9,80,492        రూ.1025.66 కోట్లు       
2020-21            10,35,958        3,25,997        రూ.1113.73 కోట్లు
2021-22            14,64,434        4,55,186        రూ.1380.73 కోట్లు
2022లో (జూన్‌)       4,09,062        2,43,301        రూ.352.45 కోట్లు
--------------------------------------------------------------- 
మొత్తం            44,77,043        20,04,976        రూ. 3872.57 కోట్లు
---------------------------------------------------------------- 

Updated Date - 2022-07-13T04:42:19+05:30 IST