ఆర్మీలో భారీగా లంచాల బాగోతం
ABN , First Publish Date - 2021-03-16T06:37:15+05:30 IST
లంచం తీసుకుని భారీస్థాయిలో సైన్యంలోకి సిబ్బందిని నియమిస్తున్న వ్యవహారం బయటపడింది, అవినీతికి పాల్పడ్డ ఏడుగురు కల్నల్ ర్యాంక్ అధికారులు సహా 23మందిని సీబీఐ బుక్ చేసింది, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా 13
ఏడుగురు అధికారులతో పాటు
23 మందిపై సీబీఐ కేసు
విశాఖ సహా 13 నగరాల్లో సోదాలు
న్యూఢిల్లీ, మార్చి 15: లంచం తీసుకుని భారీస్థాయిలో సైన్యంలోకి సిబ్బందిని నియమిస్తున్న వ్యవహారం బయటపడింది, అవినీతికి పాల్పడ్డ ఏడుగురు కల్నల్ ర్యాంక్ అధికారులు సహా 23మందిని సీబీఐ బుక్ చేసింది, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా 13 నగరాల్లోని 30 చోట్ల గత మూడురోజులుగా దాడులు జరిపి ఇందుకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది, ఆర్మీ డిఫెన్స్ కాప్స్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ భగవాన్ ఈ రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సూత్రధారిగా అనుమానిస్తున్నారు. రిక్రూట్‌మెంట్ సమయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు డాక్యుమెంట్లలో ఉందని, ఇంకా వాటి పరిశీలన జరుగుతోందని సీబీఐ ప్రతినిధి ఆర్‌సీ జోషి తెలిపారు.
ఢిల్లీలోని బేస్ హాస్పటల్‌లో నియామకాలకు సంబంధించి- తిరస్కరణకు గురైన కొందరు అభ్యర్థుల మెడికల్ రివ్యూ పరీక్షలను ఓకే చేయించేందుకు కొందరు లం చం తీసుకున్నట్లు సమాచారం అందుకున్న మీదట ఆర్మీ విజిలెన్స్ విభాగం చీఫ్ బ్రిగేడియర్ వీకే పురోహిత్ రంగంలోకి దిగి వెంటనే సీబీఐకి ఫిర్యాదుచేశారు. ప్రస్తుతం స్టడీ లీవ్‌లో ఉన్న కల్నల్ భగవాన్‌తో పాటు నాయబ్ సుబేదారు కుల్‌దీ్‌పసింగ్ కీలక పాత్ర పోషించినట్లు, లంచాలు మరిగిన 17 మంది సైనిక సిబ్బంది, వారి బంధువులు ఇందులో ఉన్నట్లు సీబీఐ తేల్చింది. ఇది కొంతకాలంగా సాగుతున్నట్లు తెలుసుకున్న సీబీఐ- కపుర్తలా, భటిండా, ఢిల్లీ, కైతాల్, పల్వాల్, లఖ్‌నవూ, బరేలీ, గోరఖ్‌పూర్, విశాఖ, జైపూర్, గువాహటి, జోర్హట్, చిరాంగన్‌ల్లో సోదాలు జరిపి అనేకమందిని ప్రశ్నించి డాక్యుమెంట్లు స్వాధీన పర్చుకుంది.