గురుగ్రామ్‌లో ఆరోగ్య కార్యకర్త మృతి

ABN , First Publish Date - 2021-01-23T06:49:37+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో తొలిరోజున (జనవరి 16) టీకా వేయించుకున్న మహిళా ఆరోగ్య కార్యకర్త ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన హరియాణాలో

గురుగ్రామ్‌లో ఆరోగ్య కార్యకర్త మృతి

 టీకా వేయించుకున్న ఆరు రోజులకు...  

 వేములవాడలో ఆశా కార్యకర్తకు అస్వస్థత


న్యూఢిల్ల్లీ/ఢాకా, జనవరి 22 : కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో తొలిరోజున (జనవరి 16) టీకా వేయించుకున్న మహిళా ఆరోగ్య కార్యకర్త ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. గురుగ్రామ్‌ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో మహిళా హెల్త్‌ విజిటర్‌గా సేవలు అందిస్తున్న 55 ఏళ్ల రజ్వంతి గత శనివారం కరోనా టీకా వేయించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆమె ఎంతకూ నిద్ర నుంచి మేల్కొనకపోవడంతో.. భర్త లాల్‌సింహ్‌, కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే స్థానిక మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రజ్వంతి చనిపోయినట్లు నిర్ధారించారు. అంతకుముందు తన భార్యకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, టీకా వేసుకోవడం వల్లే ఏదో జరిగి ఉండొచ్చని ఆరోపిస్తూ రజ్వంతి భర్త లాల్‌సింహ్‌, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కారణాలు తెలుస్తాయని గురుగ్రామ్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వీరేందర్‌ యాదవ్‌ వెల్లడించారు. ఈ మరణానికి టీకాతో సంబంధం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. కాగా, పొరుగుదేశాలతో మైత్రిని బలోపేతం చేసుకునే చర్యల్లో భాగంగా బంగ్లాదేశ్‌కు 20 లక్షలు, నేపాల్‌కు 10 లక్షల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను భారత్‌ ఉచితంగా అందించింది. అవి గురువారం సాయంత్రానికేఆ దేశాలకు చేరాయి. ఈనేపథ్యంలో వ్యాక్సిన్‌ బహుమతిని ఇచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ధన్యవాదాలు తెలిపారు.  అంతకుముందు 1.50 లక్షల డోసులను భూటాన్‌కు, లక్ష డోసులను మాల్దీవులకు భారత్‌ సమకూర్చింది. 


హైబీపీ వల్లే.. : వైద్యులు

సిరిసిల్ల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):వేములవాడ   పీహెచ్‌సీ  పరిధిలోని చంద్రగిరిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్త శంకరవ్వ 18న టీకా వేయించుకున్నప్పటి నుంచి స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారు.  ఆమెను చికిత్స నిమిత్తం వేములవాడ పీహెచ్‌సీలో శుక్రవారం చేర్పించారు. శంకరవ్వ హైబీపీతో బాధపడుతున్నారని, వైద్యులు చెబుతున్నారు. కాగా, దేశంలో మొత్తం 12.7 లక్షల మందికి కరోనా టీకాలు వేసినట్లు కేంద్రం వెల్లడించింది. శుక్రవారమే 4,049 కేంద్రాల పరిధిలో 2,28,563 మందికి వ్యాక్సినేషన్‌ జరిగిందని తెలిపింది. 

Updated Date - 2021-01-23T06:49:37+05:30 IST