Covid నియంత్రణే ప్రధానం

ABN , First Publish Date - 2022-04-06T13:23:05+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చినా విదేశాల్లో ఒమైక్రాన్‌ వ్యాప్తి అధికమవుతుండటంతో చెన్నై సహా అన్ని విమానాశ్రయాల్లో నిఘా పెడుతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం

Covid నియంత్రణే ప్రధానం

- విమానాశ్రయాల్లో నిఘా తీవ్రతరం 

- ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం


చెన్నై:  రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చినా విదేశాల్లో ఒమైక్రాన్‌ వ్యాప్తి అధికమవుతుండటంతో చెన్నై సహా అన్ని విమానాశ్రయాల్లో నిఘా పెడుతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం ప్రకటించారు. విదేశీ విమాన ప్రయాణికులందరికి థర్మల్‌ స్కాన్‌ చేయిస్తామని చెప్పారు. స్థానిక వలసరవాక్కంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులను పరీక్షించే అలా్ట్రసౌండ్‌ స్కానర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 38 జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఆస్పత్రులకు శ్యాసకోశ పనితీరును పసిగట్టే స్పైరోమీటర్‌ను ఆయా ఆస్పత్రుల ఇన్‌చార్జులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సుబ్రమణ్యం మాట్లాడుతూ అసెంబ్లీలో ఆరోగ్యశాఖ కు సంబంధించి 110 కింద ప్రకటించిన పథకాలను వీలై నంత త్వరగా నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నగరాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నుంచి కోలుకున్నవారిలో శ్వాసకోశాల పనితీరును పరీక్షించేందుకు జిల్లా ఆస్పత్రులకు స్పైరోమీటర్లను పంపిణీ చేసామని, ఇదే విధంగా నగరంలోని పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రూ.1.10 కోట్లతో అలా్ట్రసౌండ్‌ స్కానర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 25 సామాజిక ఆరోగ్య కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మాధవరంలో 19.2 ఎకరాల్లో సిద్ధవైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ నెల 8నముఖ్యమంత్రి స్టాలిన్‌ 389 సంచార వైద్య వాహనాలను ప్రారంభించనున్నారని తెలిపారు. 


వ్యాప్తి తగ్గినా అప్రమత్తత అవసరం: రాధాకృష్ణన్‌

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గినా ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. చెన్నైలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ నిబంధనలు పూర్తిగా సడలించడంతో గత రెండు రోజులుగా బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, మాల్స్‌, దుకాణాలలో ప్రజలు మాస్కులు లేకుండా సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. రెండేళ్లుగా ప్రజలు కరోనా వ్యాప్తిపై అవగాహన కలిగి ఉన్నారని, ఈ నేపథ్యం లో వైరస్‌ వ్యాప్తి బాగా తగ్గిపోయిందని తొందరపడి భౌతిక దూరం పాటించకుండా మాస్కులు లేకుండా తిరగడం మంచిది కాదని  ఆయన హెచ్చరించారు.  

Updated Date - 2022-04-06T13:23:05+05:30 IST