కంటిపాపలు జాగ్రత్త

ABN , First Publish Date - 2021-07-26T06:16:38+05:30 IST

కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఏడాదిన్నరగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు.

కంటిపాపలు జాగ్రత్త

ఆన్‌లైన్‌ తరగతులతో ఆరోగ్య సమస్యలు

ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సమస్యలతో విసుగు, చిరాకు, కోపం 

గంటల తరబడి స్ర్కీన్‌ ఎఫెక్ట్‌తో కంటికి ఇబ్బందులు 

జాగ్రత్తలే మేలంటున్న వైద్య నిపుణులు


‘మా పాప ప్రైవేట్‌ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులు వింటోంది. ఏడాదిన్నరగా దాదాపు రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగైదు గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతోంది. గంటల తరబడి సెల్‌ఫోన్‌ ముందు కూర్చోవడం వల్ల కళ్లు ఎర్రబడటం, అలర్జీ వస్తున్నాయి. ఎక్కువసేపు సెల్‌ఫోన్‌ ముందు కూర్చోవటం వల్ల నడుము నొప్పి అంటోంది. ఆన్‌లైన్‌ క్లాసులు ఆపేద్దామంటే చదువులో వెనుకబడిపోతుందేమోనని భయం. కొనసాగిస్తుంటే ఆరోగ్యం దెబ్బతింటోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 

..అశోక్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థిని తల్లిదండ్రుల ఆవేదన ఇది. ఈ సమస్య ఆ ఒక్క పాపదే కాదు. కేజీ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా చదువుకుంటున్న లక్షలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బంది. ఇందుకు కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. 


విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఏడాదిన్నరగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు థర్డ్‌వేవ్‌ ముంచుకొస్తుందన్న నిపుణుల హెచ్చరికలతో పాఠశాలలు తెరుచుకుంటాయా, లేదా అనే సందిగ్ధం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూ, తమ విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా వర్చువల్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. విపత్కర పరిస్థితుల్లో ఇది మంచిదేనన్న అభిప్రాయంతో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇదే అవకాశంగా అధిక ఫీజులు, ఇంటిగ్రేటెడ్‌ సిలబస్‌ పేరుతో పుస్తకాలను విక్రయిస్తూ రెండు, మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి ప్రైవేట్‌ విద్యాసంస్థలు.


తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఆందోళన 

ఆన్‌లైన్‌లో స్ర్కీన్‌ కాంటాక్ట్‌లో పాఠాలు బోధిస్తుండటం వల్ల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని, చిన్నపిల్లలు ఒత్తిడికి గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. చిరాకు, విసుగు, కోపం వంటి దుష్పరిణామాలు కూడా సంభవిస్తున్నాయంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా క్లాసులు నిర్వహిస్తుండటంతో చిన్నపిల్లలకు కంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. క్లాస్‌రూమ్‌ వాతావరణానికి, ఆటపాటలకు దూరమై, ఇంట్లోనే ఉండటం వల్ల కొంతమంది చిన్నారుల్లో ఒబెసిటీ సమస్య తలెత్తుతోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడుపుతున్న పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసుల కంటే ఇతర వెబ్‌సైట్లలోకి వెళ్తుండటం వల్ల వారి ప్రవర్తనపై దుష్ప్రభావాలు (బిహేవియర్‌ ప్రాబ్లమ్స్‌) ఏర్పడుతున్నాయనే ఫిర్యాదులున్నాయి.  


ఇలా చేయాలి..

ఆన్‌లైన్‌లో పిల్లలకు పాఠాలు చెప్పడం మంచిదే. రోజూ ట్రాఫిక్‌లో ప్రయాణించాల్సిన అవసరం లేకపోవడం, ప్రమాదాలకు దూరంగా ఉండటం, బయట చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌ తినకుండా ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. అయితే స్ర్కీన్‌టైమ్‌ పెరిగి పిల్లల్లో కంటి సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంట్లోనే ఒంటరిగా ఉండటం మానసిక స్థితిపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు పిల్లలను చదివించుకుంటూనే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాల్సిన అవసరం తల్లిదండ్రుల్లో ఉంది. తోటి పిల్లలతో కాసేపు ఆటలాడించడం, వారితో సరదాగా గడపటం చేయాలి. - డాక్టర్‌ చలసాని మల్లికార్జునరావు, పిల్లల వైద్య నిపుణుడు


తల్లిదండ్రులూ.. జాగ్రత్త

పిల్లలు ఇంతకుముందు ఏవిధంగా ఉదయమే నిద్రలేచి స్కూలుకు వెళ్లేవారో అదే క్రమశిక్షణ ఇంట్లోనూ పాటించేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. ఆన్‌లైన్‌ తరగతులు ముగిశాక స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లకు దూరంగా ఉంచాలి. స్ర్కీన్‌ టైమ్‌లో పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. పిల్లలకు చిన్నచిన్న వ్యాయామాలు నేర్పించాలి. సైకిల్‌ తొక్కించడం, స్కిప్పింగ్‌, బ్యాడ్మింటన్‌ ఆడించవచ్చు. - డాక్టర్‌ రాధికారెడ్డి, మానసిక వైద్యనిపుణురాలు 

Updated Date - 2021-07-26T06:16:38+05:30 IST