నత్తనడకన.. నిర్మాణాలు

ABN , First Publish Date - 2022-07-04T05:08:45+05:30 IST

అందరికీ ఆరోగ్యం.. ప్రజలందరికీ వైద్యం అనే లక్ష్యంతో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింది మున్సిపల్‌ పట్టణాల్లో అర్బన్‌ హెల్త్‌ క్లీనిక్‌లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నది.

నత్తనడకన.. నిర్మాణాలు
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్మాణంలో హెల్త్‌ క్లినిక్‌ భవనం

అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లపై నిర్లక్ష్యం

ఆగస్టు కల్లా భవనాలు పూర్తయ్యేనా 

16 భవనాలకు రూ.13.44 కోట్లు మంజూరు

కేంద్ర నిధులు విడుదలవుతున్నా పనుల్లో జాప్యం


నరసరావుపేట, జూలై 3: అందరికీ ఆరోగ్యం.. ప్రజలందరికీ వైద్యం అనే లక్ష్యంతో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింది మున్సిపల్‌ పట్టణాల్లో అర్బన్‌ హెల్త్‌ క్లీనిక్‌లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. ఈ కేంద్రాల్లో 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలు అందించేలా జిల్లాలోని మున్సిపాల్టీలో 16 హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకు రూ.13.44 కోట్లు నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.  రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ పేరుతో వీటిని నిర్మిస్తున్నది. ఆగస్టు కల్లా భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే నెలలు గడుస్తున్నా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేత్రస్థాయిలో జరుగుతున్న పనులను చూస్తే నిర్ధేశించిన సమయానికి భవనాలు పూర్తి అయ్యే పరిస్థితులు కానరావడంలేదు. నరసరావుపేట, వినుకొండ, దాచేపల్లి, పిడుగురాళ్ల, చిలకలూరిపేట, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి మునిసిపాల్టీలలో భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రెండు హెల్త్‌ క్లినిక్‌ భవనాల పనులు మాత్రమే పూర్తయ్యాయి. మున్సిపల్‌ స్థలాల్లో నిర్మిస్తున్న ఈ హెల్త్‌ క్లినిక్‌ల పనులు మునిసిపాల్టీల ఆధ్వర్యంలో  జరుగుతున్నాయి. చేసిన పనులకు బిల్లులు కూడా సకాలంలోనే చెల్లిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలకు ఇప్పటికి రెండు విడతలుగా బిల్లు చెల్లింపు జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే కొన్ని పట్టణాల్లో పనుల పురోగతి కనిపించడంలేదు. మరికొన్ని చోట్ల భవనాల నిర్మాణం ఫౌండేషన్‌ స్థాయి కూడా దాటలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పనుల్లో జాప్యం జరుగుతున్నదన్న విమర్శలున్నాయి. పేదలకు వైద్య సేవలు అందుబాటులోని వచ్చే ఘనమైన లక్ష్యంతో చేట్టిన క్లినిక్‌ల నిర్మాణం వేగవంతం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి.  


 

Updated Date - 2022-07-04T05:08:45+05:30 IST