డీపీఓకి తలపోటు

ABN , First Publish Date - 2022-06-15T05:56:50+05:30 IST

జిల్లా పంచాయతీ అధికారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నచందంగా మారింది. పంచాయతీ కార్యదర్శుల బదిలీ ప్రక్రియ ఆయనకు తలనొప్పిగా మారింది.

డీపీఓకి తలపోటు

అడ్డదిడ్డంగా బదిలీలు.. డెప్యుటేషన్లు

రద్దు చేయాలని కమిషన ఉత్తర్వులు

దిక్కుతోచని స్థితిలో ఉన్నతాధికారి


 అనంతపురం న్యూటౌన, జూన 14: జిల్లా పంచాయతీ అధికారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నచందంగా మారింది. పంచాయతీ కార్యదర్శుల బదిలీ ప్రక్రియ ఆయనకు తలనొప్పిగా మారింది. ఇక్కడ పని చేయడం మహా కష్టంగా ఉందని సన్నిహితులతో చెప్పుకున్నట్లు సమాచారం. జిల్లాలోని 31 మండలాల్లో ఇబ్బడి ముబ్బడిగా పంచాయతీ కార్యదర్శుల డెప్యుటేషన్లు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా.. గ్రేడ్‌-2 స్థానంలో గ్రేడ్‌-4 సెక్రటరీలను నియమించారు. డెప్యుటేషన్ల రద్దు చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా గ్రేడ్‌-2 స్థానంలో గ్రేడ్‌-4 కార్యదర్శులను నియమించకూడదని ఆదేశిస్తూ.. సోమవారం రాత్రి పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంగళవారం ఉదయం నుంచే అక్రమ బదిలీల వివరాలు సేకరించడం ప్రారంభించారు. మంగళవారం రాత్రి వరకు ఇది కొలిక్కిరాలేదు. బుధవారం పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే అవకాశం ఉందని డీపీఓ తెలిపారు.


ఇష్టారాజ్యం

- రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పంచాయతీ కార్యదర్శుల నియామకాల్లో నిబంధనలను గాలికి వదిలేశారు. వజ్రకరూరు పంచాయతీకి గ్రేడ్‌-1 కార్యదర్శిని నియమించాలి. అక్కడ గ్రేడ్‌-2 కార్యదర్శి అయిన మల్లికార్జునను నియమించారు. బుక్కరాయసముద్రానికి గ్రేడ్‌-1 కార్యదర్శిని నియమించాలి. ఆ స్థానంలో ఏకంగా గ్రేడ్‌-4 కార్యదర్శి నాగార్జునరెడ్డిని నియమించారు. ఆకుతోటపల్లి పంచాయతీ కార్యదర్శి స్థానానికి గ్రేడ్‌-1కి బదులుగా గ్రేడ్‌-4 కార్యదర్శి మల్లికార్జున రెడ్డిని నియమించారు. రాప్తాడుకు ఇప్పటి వరకు ప్రేమ్‌కుమార్‌ గ్రేడ్‌-1 పంచాయతీ సెక్రటరీగా ఉండేవారు. ఆ స్థానంలో గ్రేడ్‌-4 కార్యదర్శి శంకర్‌ను నియమించారు. 

- జిల్లా వ్యాప్తంగా భారీగా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. కొందరు అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతూ, రాజకీయ నాయకుల సిఫార్సులకు తలొగ్గి.. నియామకాలు చేపట్టారు. వీటన్నింటికీ చెక్‌ పెట్టేలా కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీంతో దిద్దుబాటు పనులు జిల్లా పంచాయతీ అధికారికి తలనొప్పిగా మారాయి. తమ పరిధిలో డెప్యుటేషన్లు, బదిలీలు జరగలేదని, గతంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగినవాటి వివరాలు సేకరించి, జాబితాను కమిషనర్‌కి పంపాలని నిర్ణయించారు. 


ఉత్తుర్వులు అమలయ్యేనా..? 

కమిషనర్‌ ఉత్తుర్వులు అమలయ్యేనా అన్న చర్చ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలు, డెప్యుటేషన్ల వెనుక నాయకుల ఒత్తిళ్లు ఉన్నాయని, వారిని కాదని రద్దు చేస్తారా..? అన్న చర్చ జరుగుతోంది. వివరాలు సేకరించినా.. సరిదిద్దడం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అటు కమిషనర్‌ ఉత్తర్వులు.. ఇటు నాయకుల ఒత్తిళ్ల మధ్య డీపీఓ నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - 2022-06-15T05:56:50+05:30 IST