Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 01 Jul 2022 23:42:41 IST

మీటర్లతో రైతుకు ఉరితాడు

twitter-iconwatsapp-iconfb-icon
మీటర్లతో రైతుకు ఉరితాడుచిన్నకోడూరులో రింగు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి

బీజేపీ ప్రభుత్వం పెట్టమన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

రైతుబంధు డబ్బులిస్తూ సీఎం కేసీఆర్‌ రైతులకే పన్ను కడుతున్నారు 

రింగు రోడ్డు సిద్దిపేటకు ఒక వరం

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు


చిన్నకోడూరు, జూలై 1 : బీజేపీ ప్రభుత్వం బావులు, బోర్ల కాడ మీటర్లు పెట్టమని, రైతుల మెడకు ఉరితాడు బిగుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని అనంతసాగర్‌, చెర్ల అంకిరెడ్డిపల్లి, సికింద్లాపూర్‌, మల్లారం, మేడిపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బావులు, బోర్ల కాడ మీటర్లు పెట్టిన రాష్ట్రాలకు 4శాతం, పెట్టని రాష్ట్రాలకు 3.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం డబ్బులు ఇస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బావులు, బోర్ల కాడ మీటర్లు పెట్టి 4 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం నిధులు తెచ్చుకుందని మంత్రి చెప్పారు. కానీ సీఎం కేసీఆర్‌ రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌బీఎం కింద వచ్చే రూ.25వేల కోట్లు వద్దనుకుని, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారన్నారు. ఎంత కష్టమున్నా సీఎం కేసీఆర్‌ రైతుల కోసం, రైతుబంధు డబ్బులు వేయిస్తున్నారన్నారు. దేశంలో అన్ని ప్రభుత్వాలు రైతుల నుంచి పన్నులు వసూలు చేస్తే, రైతుబంధు డబ్బులు ఇస్తూ రైతులకు పన్ను కట్టిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రైతుబంధు డబ్బులు టింగ్‌టింగ్‌మని ఫోన్లు మోగుతూ ఖాతాల్లో పడుతుంటే రైతుల ముఖాల్లో ఆనందం కనబడుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కాలువల ద్వారా నీటిని ఇచ్చి రైతుల ముక్కు పిండి నీటి తీరువాను వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అన్నారు. బీజేపీ ప్రభుత్వం యాసంగి వడ్లు కొనలేదు కానీ రాష్ట్ర ప్రజలకు నూకలు తినుడు అలవాటు చేయమని పరిహాసం ఆడిందని మంత్రి మండిపడ్డారు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని తలదన్నేలా దేశంలోనే అతి ఎక్కువ వరి పంట తెలంగాణ రాష్ట్రంలోనే పండుతుందన్నారు. అనంతరం మల్లారం గ్రామంలో 30 మంది రైతులకు స్ర్పింక్లరు సెట్‌లను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. చిన్నకోడూరులో ఆర్‌అండ్‌బీ రింగు రోడ్డు నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేసి మాట్లాడారు.  రెండు వరుసల రింగు రోడ్డు సిద్దిపేటకు ఒక వరమని, సిద్దిపేట మెడలో ఒక హరంలాగా ఉంటుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిండ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచందు, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, వైస్‌ ఎంపీపీ పాపయ్య, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, పీఏసీఏస్‌ చైర్మన్‌లు సదానందం, కనకరాజు, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్‌ వెంకటేశం, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌ రామచంద్రం, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి రామలక్ష్మి, ఆర్డీవో అనంతరెడ్డి, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు.


నిరుపేదలకు నిలువెత్తు గౌరవం

నంగునూరు : నిరుపేదలకు నిలువెత్తు గౌరవంగా ఇవాళ బద్ధిపడగ వడ్డెరకాలనీలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం బద్ధిపడగ వడ్డెరకాలనీ, గట్ల మల్యాల గంగిరెద్దుల కాలనీలో డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి ఆయన పాల్గొని మాట్లాడారు. ఇవాళ వడ్డెర బస్తీ, గంగిరెద్దుల కాలనీలో ఇళ్లు చూస్తే హైదరాబాదు గేటెడ్‌ కమ్యూనిటీలో ఉన్నట్టు అనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, జడ్పీటీసీ తడిసిన ఉమావెంకటరెడ్డి, సర్పంచ్‌ కొండల్‌రెడ్డి, ఎంపీటీసీ జ్యోత్స్ననరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాగుల సారయ్య తదితరులు పాల్గొన్నారు.


దసరా నాటికి పెద్దవాగులోకి కాళేశ్వరం జలాలు

దసరా నాటికి పెద్దవాగులోకి కాళేశ్వరం జలాలు తరలించి ప్రత్యేక లిఫ్ట్‌ ద్వారా గట్లమల్యాలలోని చెరువులు, కుంటలు నింపుతామని రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. శుక్రవారం నంగునూరు మండలం గట్లమల్యాలలో నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని సర్పంచ్‌ తిప్పని రమేశ్‌ అధ్యక్షతన నిర్వహించి సమావేశంలో మంత్రి మాట్లాడారు. అందరూ తన బంధువులేనని, త్వరలోనే గట్లమల్యాల గ్రామానికి ఇంటి అడుగు జాగలో ఇళ్లు కట్టుకునేందుకు 50 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. 


వైద్యులు దేవుడితో సమానం

సిద్దిపేట టౌన్‌ : ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులు దేవుడితో సమానమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తిలో పనివేళలు ఉండవని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యుల వృత్తి నిబద్ధత గొప్పదని కొనియాడారు. ప్రభుత్వ వైద్య సేవల కోసం సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌లో రూ. 11,500 కోట్లు కేటాయించారని తెలియజేశారు. ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12,700 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణా పబ్లిక్‌ హెల్త్‌ డాకర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డా. కత్తి జనార్దన్‌, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల వైద్య ఆరోగ్య శాఖధికారులు డా. కాశినాథ్‌, డా.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మీటర్లతో రైతుకు ఉరితాడుసిద్దిపేట పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు స్వీట్లు తినిపిస్తున్న హరీశ్‌రావు

మెట్టుమెట్టు ఎక్కి  పదో తరగతి ఫలితాల్లో ప్రథమంగా నిలిచాం

సిద్దిపేట టౌన్‌ : మెట్టు మెట్టు ఎదిగి పదో తరగతి ఫలితాల్లో ఫస్ట్‌గా నిలిచామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు చెందిన  10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ఆయన స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తల్లిదండ్రులకు తమ పిల్లలు ఫస్ట్‌ క్లాస్‌లో పాసైయితే ఎంత ఆనందం పొందుతారో, జిల్లా మొదటి స్థానంలో ఉందంటే తాను కూడా అంతే సంతోషపడ్డానన్నారు. జిల్లా ఏర్పాటైన తొలినాలలో 13వ స్థానంలో ఉండేదని తర్వాత కష్టపడి అంచెలంచెలుగా ఈ స్థానానికి చేరుకున్నామన్నారు. ఈ ఎడాది ఎలాగైనా ఫస్ట్‌ నిలవాలని ప్రత్యేక తరగతులు, తల్లిదండ్రులకు లేఖలు, సమీక్షలు నిర్వహించగా ప్రథమ స్థానం సాధించామని ఆనందం వ్యక్తంచేశారు. అందరి సమష్టి కృషి అని, జిల్లా ప్రజలందరూ గర్వపడే సందర్భమన్నారు. ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, రాబోయే బావి విద్యార్థులకు స్ఫూర్తి అని తెలిపారు. వారు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు. ఒక ఐఏఎస్‌, డాక్టర్‌, ఇంజినీర్‌ కావాలనే తపనతో పైచదువుల్లో పోటీ పడాలని సూచించారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో చిన్నకోడూర్‌, సిద్దిపేట రూరల్‌ మండలంలోని మొత్తం 103 మంది లబ్ధిదారులకు డబుల్‌ ఇళ్ల ధ్రువీకరణ పత్రాలను జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మతో కలసి హరీశ్‌రావు అందజేశారు. గత నెల హరీశ్‌రావు జన్మదినం కాగా వారి కానుకగా పట్టణంలోని శేషాద్రి ఆసుపత్రి తరఫున మిట్టపల్లి గ్రామానికి చెందిన సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థులకు లైబ్రరీ పుస్తకాలు, ఇంటర్మీడియట్‌ పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, మెడికల్‌ కిట్లు, బీరువాను విరాళంగా అందించారు. ఈ మేరకు శేషాద్రి ఆసుపత్రి వైద్య బృందాన్ని మంత్రి హరీశ్‌రావు అభినందించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.