‘హయగ్రీవ’లో అంతా అడ్డగోలు వ్యవహారమే

ABN , First Publish Date - 2022-08-09T07:14:51+05:30 IST

విశాఖపట్నంలో వృద్ధుల ఆశ్రమం కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా అమ్మేసుకున్నారని, అసలు ప్రయోజనం నెరవేరనందున దానిని రద్దు చేసి వెనక్కి తీసుకోవచ్చునంటూ ప్రభుత్వానికి కలెక్టర్‌ రాసిన లేఖ ఇక్కడ సంచలనం కలిగిస్తోంది.

‘హయగ్రీవ’లో అంతా అడ్డగోలు వ్యవహారమే
ఎండాడలో హయగ్రీవకు కేటాయించిన భూమిలో పనులు

అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన

లేఅవుట్‌కు అనుమతి లేకుండానే భూములు అమ్ముకున్నారు 

స్వలాభం, స్థిరాస్తి వ్యాపారమే తప్ప వృద్ధులకు సేవ చేయాలనే దృక్కోణం లోపించింది

భూ కేటాయింపు రద్దును పరిశీలించవచ్చు

ప్రభుత్వానికి కలెక్టర్‌ నివేదిక

మరోవైపు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణ పనులు

సంస్థలో భాగస్వాములుగా వైసీపీ నేతలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో వృద్ధుల ఆశ్రమం కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా అమ్మేసుకున్నారని, అసలు ప్రయోజనం నెరవేరనందున దానిని రద్దు చేసి వెనక్కి తీసుకోవచ్చునంటూ ప్రభుత్వానికి కలెక్టర్‌ రాసిన లేఖ ఇక్కడ సంచలనం కలిగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.500 కోట్ల విలువైన ఈ భూమిపై కొన్నేళ్లుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. వివరాలిలా ఉన్నాయి.

రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయాన 2006లో హయగ్రీవ ఫామ్స్‌ అండ్‌ డెవలపర్స్‌కు ఎండాడ సర్వే నంబరు 92/3లో 12.51 ఎకరాలను కేటాయించారు. ఎకరా రూ.45 లక్షల చొప్పున ధర నిర్ణయించారు. ఆ భూమిలో పది శాతం విస్తీర్ణంలో నిరాశ్రయులైన వృద్ధులకు ఆశ్రమం నిర్మించి, ఉచితంగా అందులో వసతి కల్పించాలని నిబంధన పెట్టారు. మిగిలిన భూమిలో 30 శాతం రహదారులు, కాలువలు నిర్మించి, మిగిలిన 60 శాతం కూడా వృద్ధుల కోసమే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ఈ భూమిని ఎలియనేషన్‌ చేసినప్పుడు వృద్ధుల ఆశ్రమం నిర్మించాకే మిగిలిన భూమిని ఉపయోగించుకోవాలని సంస్థ అధినేత చిలుకూరి జగదీశ్వరుడుకు స్పష్టంచేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అనేక పరిణామాల అనంతరం నిర్మాణం కోసం కలెక్టర్‌ నిరభ్యంతర ధ్రువపత్రం ఇస్తూ భవన నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ ఆమోదం పొందిన మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఇదిలావుండగా, ఇటీవల జగదీశ్వరుడు తన నుంచి ఆ భూమిని కొందరు వైసీపీ నాయకులు (ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గన్నమని వెంకటేశ్వరరావు) బలవంతంగా రాయించుకున్నారంటూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై మళ్లీ దృష్టి సారించి విచారణకు ఆదేశించింది. కలెక్టర్‌ను నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై ప్రస్తుత కలెక్టర్‌ మల్లికార్జున అన్ని శాఖల నుంచి వివరాలు తెప్పించుకొని నివేదిక తయారుచేసి పంపారు.


ఇవీ కలెక్టర్‌ నివేదికలో అంశాలు

- మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేయాలనే నిబంధన అమలు కాలేదు.

- భవన నిర్మాణానికి సమర్పించిన ప్లాన్‌లో ఒక రకంగా పేర్కొని, ఆ తరువాత మరొక రకంగా దానిని మార్పు చేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం.

- వీఎంఆర్‌డీఏ నుంచి లేఅవుట్‌ అనుమతి, జీవీఎంసీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేకుండా ఆ ప్రాజెక్టులో మిగిలిన భూమిని లేదా భవనాలను విక్రయించకూడదు. కానీ ఈ నిబంధనను కూడా ఉల్లంఘించారు. వృద్ధుల ఆశ్రమం పూర్తి చేయకుండా, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేకుండా 32,857 చ.గ. భూమిని 31 డాక్యుమెంట్ల ద్వారా విక్రయించినట్టు జిల్లా రిజిస్ట్రార్‌ ద్వారా నివేదిక వచ్చిందని పేర్కొన్నారు. ఇది ప్రధాన ఉల్లంఘనగా పేర్కొన్నారు. 

- ఈ నిర్మాణం ప్లాన్‌ వృద్ధుల నివాసానికి, రాకపోకలకు అనువుగా లేదని, దివ్యాంగులు పై అంతస్థులకు చేరుకోవడానికి ర్యాంపు కూడా లేదని స్పష్టంచేశారు. 

- హయగ్రీవ సంస్థలో భాగస్వాముల సంఖ్య పెరిగిందని, మేనేజింగ్‌ పార్టనర్‌గా చేరిన బ్రహ్మాజీ అధిక లావాదేవీలు నిర్వహించారని, అందులో స్వలాభం, స్థిరాస్తి వ్యాపారమే తప్ప వృద్ధులకు సేవ చేయాలనే దృక్కోణం లోపించినందున భూ కేటాయింపునకు రద్దు చేయవచ్చునని కలెక్టర్‌ సూచించారు. 

- భూమి కేటాయింపును రద్దు చేయాల్సిందిగా కలెక్టర్‌ నివేదిక అందజేయగా...ఇప్పుడు ఆ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా పనులు జరిగిపోతున్నాయి.


అక్టోబరు 2024 వరకు గడువు ఉంది

జి.వెంకటేశ్వరరావు, హయగ్రీవ భాగస్వామి

వృద్ధుల ఆశ్రమం నిర్మించడానికి అక్టోబరు 2024 వరకు గడువు ఉంది. జీవీఎంసీ పనులు నిలిపివేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను కోర్టు సస్పెండ్‌ చేసింది. వృద్ధుల భవనానికి ర్యాంపు నిర్మించాల్సిందిగా జీవీఎంసీ సూచించింది. కలెక్టర్‌ నివేదిక గురించి మాకు తెలియదు. 

Updated Date - 2022-08-09T07:14:51+05:30 IST