పార్టీల ఉచిత హామీలు.. ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే

ABN , First Publish Date - 2022-04-10T00:47:18+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది ఎలక్షన్ కమిషన్. చట్టంలో సరైన మార్పులు చేయకుండా, పార్టీలు, ప్రభుత్వాలపై చర్యలు తీసుకోలేమని చెప్పింది ఈసీ.

పార్టీల ఉచిత హామీలు.. ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే

రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది ఎలక్షన్ కమిషన్. చట్టంలో సరైన మార్పులు చేయకుండా, పార్టీలు, ప్రభుత్వాలపై చర్యలు తీసుకోలేమని చెప్పింది ఈసీ. ఉచిత పథకాలు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా ఈసీ ఈమేరకు అఫిడవిట్ సమర్పించింది. ‘‘పార్టీలు ఎన్నికలకు ముందు.. లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చే ఉచిత పథకాల్ని నియంత్రించడం సాధ్యంకాదు. ఆ పథకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపినాసరే వాటిని అడ్డుకోలేం. ఉచిత పథకాల విషయంలో అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ఓటర్లే. చట్టంలో మార్పులు చేయకుండా, ఈ విషయంలో పార్టీలను నియంత్రించాలనుకుంటే అది ఎలక్షన్ కమిషన్ అధికారాల్ని పరిధిదాటి ఉపయోగించినట్లే అవుతుంది’’ అని ఈసీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. 


అయితే, ఈ విషయంలో చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరుతూ కేంద్రానికి కొన్ని సూచనలు చేశామని చెప్పింది. 2016లో దాదాపు 47 ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత హామీలు ఇస్తున్న పార్టీలపై చర్యలు తీసుకోవాలని, పార్టీ గుర్తు రద్దు చేయాలని కోరుతూ గత జనవరి 25న సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా, ఈసీ తాజా అఫిడవిట్ సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఉచిత హామీల వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారుతోందనే విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2022-04-10T00:47:18+05:30 IST