ఎంజాయ్ చేయండి: కాంగ్రెస్‌పై విమర్శలపై హరీశ్ రావత్

ABN , First Publish Date - 2021-12-23T17:03:29+05:30 IST

ఈ వ్యాఖ్యల వెనుక కారణం ఏంటని ఆయనను మీడియా గురువారం ప్రశ్నించింది. దీనికి రావత్ సమాధానం ఇస్తూ ‘‘టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ప్రతీది మీతో పంచుకుంటాను. మీతో కాకుంటే ఇంకెవరితో పంచుకుంటాను? కానీ ఇప్పటికైతే ఎంజాయ్ చేయండి..

ఎంజాయ్ చేయండి: కాంగ్రెస్‌పై విమర్శలపై హరీశ్ రావత్

డెహ్రడూన్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. చేతులు కట్టేసి ఈదమంటున్నారంటూ బుధవారం వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆయనను ప్రశ్నించగా.. సస్పెన్స్‌ను కొనసాగిస్తూ ‘చెప్తాను కానీ, ఇప్పటికైతే ఎంజాయ్ చేయండి’ అంటూ వ్యాఖ్యానించారు.


బుధవారం ఆయన తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఎంత చిత్రమో కదా... ఎన్నికల సముద్రంలో ఈదమన్నారు. నేను ఈదుతున్నప్పుడు నాకు సహకరించడానికి బదులుగా ముఖం తిప్పుకొంటున్నారు.  లేదంటే వ్యతిరేక పాత్ర పోషిస్తున్నారు. నేను ఈత కొడుతుంటే.. అధికారంలో ఉన్నవారు కొన్ని మొసళ్లను కూడా వదిలారు. కానీ, ఎవరి ఆజ్ఞతో నేను ఈత కొట్టడానికి దిగానో వారి బినామీలు నా కాళ్లు, చేతులు కట్టేస్తున్నారు. ఇక చాలు... అలసిపోయా. ఇప్పటికే చాలాకాలం నుంచి ఈత కొడుతున్నావు... ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నా అంతరాత్మ చెబుతోంది. నేను సందిగ్ధంలో ఉన్నాను. కొత్త సంవత్సరం నాకో దారి చూపిస్తుందేమో. ఆ కేదారేశ్వరుడే ఒక మార్గాన్ని చూపిస్తాడనే విశ్వాసం ఉంది’’ అంటూ ట్వీట్లు చేశారు.


అయితే అసలేం జరిగిందని, ఈ వ్యాఖ్యల వెనుక కారణం ఏంటని ఆయనను మీడియా గురువారం ప్రశ్నించింది. దీనికి రావత్ సమాధానం ఇస్తూ ‘‘టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ప్రతీది మీతో పంచుకుంటాను. మీతో కాకుంటే ఇంకెవరితో పంచుకుంటాను? కానీ ఇప్పటికైతే ఎంజాయ్ చేయండి’’ అంటూ వ్యాఖ్యానించారు.


కొద్ది రోజుల క్రితం వరకు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా ఉన్న రావత్.. సీఎం పదవి నుంచి కెప్టెన్ అమరీందర్‌ను తప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. అంతే కాకుండా గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో విధేయుడన్న వార్త కూడా వినిపిస్తోంది. అయితే చాలా చోట్ల నూతన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోన్న కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే సీనియర్ నేతలను పక్కన పెడుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే రావత్ ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-12-23T17:03:29+05:30 IST