హవాలా..దారులు

ABN , First Publish Date - 2021-06-05T05:53:09+05:30 IST

హవాలా..దారులు

హవాలా..దారులు
కారు వెనుక భాగంలో లభించిన డబ్బు

కారు వెనుక సీటుకు రహస్య అర

టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల తనిఖీల్లో కొత్తకోణం

ముగ్గురు హవాలాదారుల అరెస్టు

1.400 కిలోల బంగారం, రూ.40 లక్షలు స్వాధీనం

ప్రధాన సూత్రధారి పశ్చిమగోదావరి జిల్లావాసి 

పరారీలో ఇద్దరు నిందితులు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : హవాలా వ్యాపారులు పోలీసులకు చిక్కకుండా కొత్తరకం పథకాలు రచిస్తున్నారు. వాహనాలకు లోలోపల రహస్య అమరికలు చేసుకుంటున్నారు. పోలీసుల తనిఖీలకు ప్రతివ్యూహాలను తయారు చేసుకుంటూ సరుకును గమ్యస్థానాలకు చేర్చుకుంటున్నారు. అసలు వ్యక్తులు అజ్ఞాతంలో ఉంటూ అనుచరులను రంగంలోకి దింపి, రవాణాకు ఉపయోగించుకుంటున్నారు. తాజాగా హవాలాదారులు స్లైడింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. కారులో డ్రైవర్‌కు వెనుక ఉన్న సీట్లకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాక్‌ సీటుకు వెనుక భాగాన్ని ఒక చిన్న కిటికీ మాదిరిగా కట్‌ చేయిస్తున్నారు. అక్కడ స్లైడింగ్‌ డోర్‌ను అమర్చుతున్నారు. ఆ తర్వాత మొత్తం సీటుకు ఇంటీరియర్‌ డెకరేషన్‌ చేయించి, కవర్‌ తొడిగేస్తున్నారు. 

కారు సీటులో రూ.40లక్షలు

విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో హవాలా గ్యాంగ్‌ను పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ జైన్‌ అనే వ్యక్తి దేవీ జ్యూయలర్స్‌ పేరుతో బంగారం షాపును నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన చామకూరి హరిబాబు, ఈలి బాలాజీ ఆయన వద్ద గుమస్తాలు. ఈ ఇద్దరూ గురువారం తెల్లవారుజామున ఏపీ16సీ 8590 నెంబర్‌ హోండా అమేజ్‌ కారులో విజయవాడ వచ్చారు. బకింగ్‌హాం పోస్టాఫీసు వద్ద రాజగోపాలచారి వీధికి చెందిన మోదీ మణిదీప్‌ నుంచి 1.400 కిలోల బంగారం బిస్కెట్లను తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వారికి రూ.40లక్షలు ఇచ్చాడు. దీన్ని తీసుకుని హరిబాబు, బాలాజీ నరసాపురం బయల్దేరారు. తాడిగడప 100 అడుగుల రోడ్డు వద్ద టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కారును ఆపి తనిఖీ చేశారు. వెనుక సీటు భాగానికి ఒక అరను ఏర్పాటుచేసి అందులో నగదు, బంగారం పెట్టారు. కారులో కొత్త అమరిక ఉండటంతో పోలీసులు అనుమానంతో మొత్తం బయటకు తీయగా అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. మణిదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు, మూడు సెల్‌ఫోన్లు, 1.400 కిలోల బంగారం, రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్‌కుమార్‌, హైదరాబాద్‌ నుంచి నగదును తీసుకొచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నారు.  ప్రవీణ్‌కుమార్‌ హవాలా మార్గంలో సరుకు రవాణా చేయిస్తూ పట్టుబడటం ఇది తొలిసారేం కాదు. ఆరు నెలల క్రితం నరసాపురానికి వీరిద్దరూ ఇలాగే తీసుకెళ్తున్న రూ.1.50 కోట్లను కూడా పట్టుకున్నారు. ముందుగా హరిబాబు, బాలాజీలను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, ప్రవీణ్‌కుమార్‌ పేరు వెలుగులోకి వచ్చింది. తర్వాత అతడ్నీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా ఇదే గ్యాంగ్‌ మళ్లీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు దొరికిపోయింది. 



Updated Date - 2021-06-05T05:53:09+05:30 IST