కీలక మలుపు తిరిగిన హత్రాస్ ఘటన.. ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

ABN , First Publish Date - 2020-10-02T02:51:51+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్‌ ఘటన నమ్మలేని మలుపు తిరిగింది. ఓవైపు పోస్టుమార్టం రిపోర్ట్‌, మరోవైపు ఫోరెన్సిక్‌ ..

కీలక మలుపు తిరిగిన హత్రాస్ ఘటన.. ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్‌ ఘటన నమ్మలేని మలుపు తిరిగింది. ఓవైపు పోస్టుమార్టం రిపోర్ట్‌, మరోవైపు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ వెలువడ్డాయి. హత్రాస్‌ను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తు సాగిస్తోంది. ఇక, హత్రాస్‌కు బయలుదేరిన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్ట్‌ చేశారు. ఈ పరిణామాలతో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


హత్రాస్‌ ఘటనపై దేశ వ్యాప్త నిరసనలు భగ్గుమన్న సమయంలో ఫోరెన్సిక్‌ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్‌ రిపోర్ట్ తేల్చినట్లు ఉత్తరప్రదేశ్‌ లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రశాంత్‌కుమార్‌ ప్రకటించారు. మెడపై గాయంతోనే బాధితురాలు చనిపోయినట్టు పోస్టుమార్టం రిపోర్ట్ స్పష్టం చేసినట్టు ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. 


బాధితురాలి శరీరంలో ఎక్కడా వీర్యపు ఆనవాళ్ళు కూడా దొరకలేదని ఫోరెన్సిక్‌ నివేదికలో ఉన్నట్టు ప్రశాంత్‌కుమార్‌ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. వాంగ్మూలంలో కూడా బాధితురాలు ఎక్కడా అత్యాచారం గురించి ప్రస్తావించలేదని చెప్పారు. దళిత యువతి మరణానికి కారణం ఆమె మెడపై తగిలిన గాయమని, ఆ గాయం వల్ల ఏర్పడిన తట్టుకోలేనంత బాధ అని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించినట్లు చెప్పారు. సమాజంలో అలజడి సృష్టించేందుకు, కుల ఘర్షణలు రేపేందుకే కొన్ని శక్తులు మొత్తం వ్యవహారాన్ని తప్పుదారి పట్టించాయని ప్రశాంత్‌కుమార్‌ వివరించారు. 


బాధిత యువతికి న్యాయం చేయాలంటూ.. రౌడీల రాజ్యంగా మారిన ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు శాంతియుతంగా జీవించే పరిస్థితులు కల్పించాలంటూ హత్రాస్‌కు బయలుదేరిన కాంగ్రెస్‌పార్టీ ముఖ్యనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.  గురువారం ఉదయం హత్రాస్‌ బయల్దేరిన రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలకు నొయిడా వద్ద పెద్దఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలు స్వాగతం పలికారు. మోదీ ప్రభుత్వం మొద్దునిద్ర మేల్కొని అత్యాచార ఘటనలను అడ్డుకోవాలని నినదించారు. ఆ సమయంలో అటు యూపీ, ఇటు ఢిల్లీ పోలీసులు వాళ్ల యాత్రలో భారీగా మోహరించారు.


ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను యూపీ పోలీసులు నోయిడా సర్కిల్‌ వద్ద అడ్డుకున్నారు. సిట్‌ విచారణ కొనసాగుతున్నందున, కాంగ్రెస్‌ ముఖ్యనేతలు హత్రాస్‌ వెళితే పరిస్థితి అదుపుతప్పుతుందన్న పోలీసులు వాహనాలను అడ్డుకున్నారు.  దీంతో, ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీలు.. తాము నడుచుకుంటూనే హత్రాస్‌ వెళ్తామని బయలుదేరారు. యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై నడచుకుంటూ వెళ్తున్న రాహుల్‌ను మొదట పోలీసులు అడ్డుకున్నారు.ఈ సందర్బంగా రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది.  ఓవైపు లాఠీచార్జ్‌ చేశారు. మరోవైపు తోపులాటలో రాహుల్‌ కిందపడ్డారు. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 


అయినా, తాను హత్రాస్‌ వెళ్ళితీరతానంటూ పోలీసులతో రాహుల్‌ స్పష్టం చేశారు. దీంతో.. ఆంక్షలు ఉన్నాయంటూ చివరికి రాహుల్‌ను అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. మరోవైపు.. దారి పొడవునా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అటు హత్రాస్‌ను పోలీసులు దిగ్బంధించారు. ఎవరినీ రానివ్వడం లేదు. హత్రాస్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణ జరిగింది. మరోవైపు.. ఉత్తర్‌ప్రదేశ్‌లో గుండాలు, మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు బీఎస్‌పీ అధినేత్రి మాయావతి... చట్టం అన్నది రాష్ట్రంలో కనిపించడం లేదన్నారు... బీజేపీ హయాంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందన్నారు... హత్రాస్‌ ఘటనతోనైనా మేల్కొంటారనుకుంటే అదీ జరగలేదన్నారు


అటు.. హత్రాస్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, యూపీ డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా యూపీ సర్కారు, డీజీపీలు నివేదికలు సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. మరోవైపు.. ఈ దుర్ఘటన, తర్వాత పరిణామాలు, పోలీసుల వ్యవహారశైలిపై జాతీయ మహిళా కమిషన్‌ కూడా కన్నెర్ర చేసింది. అర్థరాత్రే ఎందుకు అంత్యక్రియలు జరపాల్సి వచ్చిందని, కుటుంబ సభ్యులను ఎందుకు పిలవలేదని ప్రశ్నించింది. వీటన్నింటికీ జవాబులు ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్ డీజీపీకీ మహిళా కమిషన్‌ లేఖ రాసింది. 


- సప్తగిరి గోపగోని, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి


Updated Date - 2020-10-02T02:51:51+05:30 IST