70 లక్షల రైతుల ఆత్మగౌరవాన్ని పీయూష్ దెబ్బతీశారు: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-12-22T18:00:01+05:30 IST

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

70 లక్షల రైతుల ఆత్మగౌరవాన్ని పీయూష్ దెబ్బతీశారు: హరీష్‌రావు

హైదరాబాద్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న పీయూష్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 70 లక్షల రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. ‘‘పీయూష్ నిన్ను కలవడానికి వచ్చిన మా బృందాన్ని ఎందుకొచ్చారు అని ప్రశ్నిస్తావా.. నీది రాజకీయం.. మాపై బురద చల్లుతున్నావ్.. మీ పార్టీ నాయకులను ముందు కలుస్తావా? లేక మా బృందాన్ని కలుస్తావా? 6 గురు మంత్రులు నిన్ను కలవడానికి వచ్చారు.. మా ప్రాధాన్యం రైతులు.. నీ ప్రాధాన్యం రాజకీయం.. ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా.. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మా పార్టీ పుట్టుకునే తెలంగాణ ప్రయోజనాల కోసం, మా రాష్ట్రం, మా రైతులే ముఖ్యం. మాట మార్చారు.. నైతికత లేదు మీకు.. మోసం చేసింది మీరు, చావు నోట్లోకి వెళ్లి వచ్చిన ఘనత కేసీఆర్‌ది.. రైతులు చలిలో పడిగాపులు కాస్తున్నారు. 3 రోజులైనా మమ్మల్ని కలవలేదు.. మీ పార్టీ వాళ్ళను కలిసావు.. మమ్మల్ని కలవలేదని’’ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


రైతుల ఓట్లు కావాలి కానీ.. రైతుల భాద పట్టించుకోరా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. కేంద్రమంత్రి గోయల్ మాట్లాడేవన్నీ అబద్ధాలేనన్నారు. పంజాబ్‌లో ఒడ్లు కొన్నట్లే.. తెలంగాణలో కొనమని ఆడిగామన్నారు. పంజాబ్‌లో కొని, ఇక్కడ ఎందుకు కొనరని ప్రశ్నించారు. యాసంగిలో ఓడ్లు కొంటారా కొనరా? అని నిలదీశారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రూ. 14 వేల 5 వందల కోట్లు రైతు బంధు ఇస్తున్నామన్నారు. పంటల సేకరణ కేంద్రం పరిధిలో ఉందన్నారు. కరువు వస్తే రాష్ట్రాల దగ్గర ఉన్న ధాన్యం బలవంతంగా తీసుకుంటున్నారని, ఎగుమతి, దిగుమతులు కేంద్రం పరిధిలో ఉందన్నారు. రాష్ట్రాలపై బురద చల్లితే ఊరుకోమని హరీష్‌రావు అన్నారు.

Updated Date - 2021-12-22T18:00:01+05:30 IST