హరి.. విశాఖ సిరి

ABN , First Publish Date - 2021-05-04T05:11:24+05:30 IST

భీమిలి సాగర తీరాన విచ్చుకున్న.. మనసుకు ముసుగేసి మాట్లాడడం తెలియని ముక్కుసూటి మనిషి...ఇక ముచ్చట్లు లేవంటూ మౌనమునిలా వెళ్లిపోయారు.

హరి.. విశాఖ సిరి

మరలిపోయిన మా మంచి మేయర్‌

నగర అభివృద్ధిలో తనదైన ముద్ర

1995-2000 మధ్య కాలంలో మేయర్‌గా పనిచేసిన సబ్బం హరి

శివాజీ పార్కు, స్వర్ణభారతి ఇండోర్‌ స్డేడియం నిర్మాణం

బీచ్‌రోడ్డు ఆధునికీకరణ

ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు

జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా గాంధీ విగ్రహం ఏర్పాటు

ఆయన హయాంలోనే రామ్మూర్తిపంతులు పేట బ్రిడ్జి నిర్మాణం

పారిశుధ్య నిర్వహణ విధానంలో సంస్కరణలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):

భీమిలి సాగర తీరాన విచ్చుకున్న వెలుగు కిరణం...సీతమ్మధార కొండల మాటున అస్తమించింది. 


మనసుకు ముసుగేసి మాట్లాడడం తెలియని ముక్కుసూటి మనిషి...ఇక ముచ్చట్లు లేవంటూ మౌనమునిలా వెళ్లిపోయారు. 


విశాఖ రాజకీయ శిఖరం ఒరిగిపోయింది. వెన్నుచూపని వ్యక్తిత్వం, ఎదురొడ్డి పోరాడే తత్వం, ప్రశ్నించే తెగువ...ఇదీ సబ్బం హరి వ్యక్తిత్వం. 


అనారోగ్యంతో కన్నుమూసిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. 1995-2000 మధ ్య కాలంలో మేయర్‌గా పనిచేసిన ఆయన అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుని నగర అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఇప్పటికీ జీవీఎంసీ మేయర్‌ అనగానే ఎవరికైనా సబ్బం హరి స్ఫురణకు వస్తారంటే ఎంతమాత్రం అతియోశక్తి కాదు. 


ఇప్పటి జీవీఎంసీ 2005కి ముందు విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (వీఎంసీ)గా ఉండేది. అప్పట్లో మేయర్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునేవారు. 1995లో వీఎంసీ పాలక వర్గానికి ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మేయర్‌ అభ్యర్థిగా సబ్బం హరి పోటీకి దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి పెతకంశెట్టి అప్పలనరసింహం బరిలో నిలిచారు. అప్పటికి టీడీపీ గాలి వున్నప్పటికీ సబ్బం హరి మేయర్‌గా విజయం సాధించి సంచలనం సృష్టించారు. మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో నగరాభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవడంతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ చిరస్థాయిగా నిలిచిపోయేవే కావడం ఆయన దూరదృష్టికి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అప్పట్లో నగరం మధ్యలో శివాజీపాలెంలో డంపింగ్‌ యార్డు ఉండేది. దీనివల్ల నగర ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు వాతావరణం కలుషితమయ్యేది. దీనిని గుర్తించిన సబ్బం హరి కాపులుప్పాడలో వంద ఎకరాలు కేటాయించి శివాజీపాలెం నుంచి డంపింగ్‌యార్డును అక్కడకు తరలించారు.


శివాజీపాలెంలోని ఆ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేసి శివాజీ పార్కుగా నామకరణం చేశారు. అలాగే రేసపువానిపాలెంలో వీఎంసీకి చెందిన ఖాళీస్థలంలో స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం నిర్మాణం చేపట్టారు. ఆ స్టేడియం ఇప్పుడు నగరంలో ఒక ల్యాండ్‌ మార్క్‌గా మారింది. స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించడంతో జాతీయ క్రీడలకు కూడా వేదికగా మారి విశాఖకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక, ఆర్కే బీచ్‌ రోడ్డును కూడా ఆయన హయాంలోనే ఆధునికీకరించారు. భవిష్యత్తులో పర్యాటకానికి సముద్ర తీరం ఒక వరంగా మారుతుందని అప్పట్లోనే గుర్తించిన సబ్బం హరి సింగిల్‌ రోడ్డుగా వున్న బీచ్‌రోడ్డును డబుల్‌రోడ్డుగా విస్తరించారు. బీచ్‌రోడ్డు పొడుగునా జాతీయ నాయకులు, వివిధ రంగాల్లో ప్రావీణ్యం సంపాదించిన కళాకారుల విగ్రహాలను ఏర్పాటుచేయించారు. అలాగే ఇప్పుడు ధర్నాలు, నిరసనలకు వేదికగా వున్న జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహాన్ని సబ్బం హరి హయాంలోనే ఏర్పాటుచేశారు.


కంచరపాలెం ప్రాంత వాసులు రైల్వే లైన్‌ దాటి వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను గమనించి సబ్బం హరి తాను మేయర్‌గా వున్నకాలంలోనే రామ్మూర్తిపంతులుపేట బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. తద్వారా ఆ ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. అదేవిధంగా నగరంలో అప్పటివరకూ వీధిదీపాలుగా వుండే ట్యూబులైట్ల స్థానంలో సోడియం హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటుచేయించారు. అలాగే అప్పటివరకూ తాగునీటి సరఫరాకు వీఎంసీ ఇబ్బంది పడుతుండేది. కొండవాలు ప్రాంతాల వారికి కొళాయి సదుపాయం ఉండేది కాదు. పైగా రాత్రిపూట కొళాయిలు ఇచ్చేవారు. సబ్బం హరి మేయర్‌గా వున్నప్పుడు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రైవాడ నుంచి కాలువ ద్వారా నగరానికి నీటిని తీసుకువచ్చే ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అందుబాటులోకి తెచ్చారు. దీంతో నగరానికి నీటి కష్టాలు తప్పడంతో పగటిపూట మాత్రమే కొళాయి ఇచ్చేలా ఆదేశాలు జారీచేశారు. కొండవాలు, శివారు ప్రాంతాల్లో కొత్తగా కొళాయిలు వేయించారు. ముడసర్లోవ పార్కును ఆధునికీకరించి, ముడసర్లోవ రిజర్వాయర్‌ చుట్టూ రోడ్డు నిర్మించారు.


అప్పటివరకూ వీఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పారిశుధ్య పనులపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యాన్ని ఆయన ప్రారంభించారు. దీనివల్ల పారిశుధ్య నిర్వహణ గాడిలో పడినట్టయింది. తాత్కాలిక, ప్రైవేటు ఉద్యోగులుగా పనిచేస్తున్న 400 మందిని రెగ్యులర్‌ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు. దీంతో ప్రస్తుతం జీవీఎంసీలో పనిచేస్తున్న ఎంతోమంది ఉద్యోగులు ఆయన్ను ప్రాణంగా అభిమానిస్తుంటారు. సబ్బం హరి మృతితో ఆయనతో అనుబంధం కలిగివున్న వారంతా ఆయన సాధించిన విజయాలు, నగరాభివృద్ధిలో ఆయన ముద్రను నెమరువేసుకుంటున్నారు. 


అనకాపల్లితో ‘హరి’ అనుబంధం 

ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి

అనకాపల్లి: అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంతో సబ్బం హరికి ఎంతో అనుబంధం ఉంది. 2009 ఎన్నికల్లో సబ్బం హరి అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగి విజయం సాధించారు. హరికి 3,69,968 ఓట్లు రాగా, టీడీపీ నుంచి పోటీచేసిన నూకారపు సూర్య ప్రకాశరావుకు 3,17,056 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన అల్లు అరవింద్‌కు 2,94,183 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి సూర్యప్రకాశరావుపై సబ్బం హరి 52,912 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనకాపల్లితో పాటు మాడుగుల, చోడవరం, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన ఎంపీ నిధులు మంజూరుచేశారు.


ప్రధానంగా చీడికాడ మండలంలో గిరిజన గ్రామాలకు బీటీ రోడ్ల సదుపాయం కల్పించారు. కోనాం నుంచి తెరువుపల్లి, పనసగెడ్డ, మల్లిపాడు, గొడుగుమామిడి, వాకపల్లి, గుడివాడ తదితర గ్రామాలకు తారు రోడ్లు వేయించారు. పాయకరావుపేటలో గ్రంథాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. రావికమతం మండలంలో రోడ్లు, కమ్యూనిటీ భవనాలకు రూ.కోటి నిధులను అందించారు. అనకాపల్లిలో దీర్ఘకాలిక సమస్య అండర్‌ బ్రిడ్జి పక్కన రెండో మార్గం నిర్మాణానికి హరి విశేష కృషిచేశారు. గంగదేవిపేటకు చెందిన న్యాయవాది జగదీశ్‌ విజ్ఞప్తి మేరకు అనకాపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ కోటా నుంచి నిధులు మంజూరుచేశారు.



Updated Date - 2021-05-04T05:11:24+05:30 IST