కమీషన్‌ ఇవ్వని రైతులకు వేధింపులు

ABN , First Publish Date - 2020-05-29T09:03:23+05:30 IST

పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు పెనమలూరు మండలంలో 278 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించారు.

కమీషన్‌ ఇవ్వని రైతులకు వేధింపులు

(విజయవాడ - ఆంధ్రజ్యోతి : పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు పెనమలూరు మండలంలో 278 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించారు. కంకిపాడు మండలంలో 107 ఎకరాలు, ఉయ్యూరు మండలంలో 103.64 ఎకరాల ప్రైవేటు భూమి సేకరించారు. నియోజకవర్గం మొత్తం మీద పేదలకు ఇళ్ల స్థలాల కోసం 488 ఎకరాలను సేకరించారు. ఆయా ప్రాంతాల్లో భూముల వాస్తవ ధర.. అధికారులు నిర్ణయించిన ధర ఆధారంగా రైతులు తిరిగి చెల్లించాల్సిన కమీషన్‌ను నిర్ణయించారు. 


పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో ఎకరాకు రూ.6 లక్షలు చొప్పున కమీషన్‌ దండుకున్నారు. ఇక్కడ మార్కెట్‌ ప్రకారం ఎకరా గరిష్ఠంగా రూ.60 లక్షల వరకు ఉంటుంది. రైతులు ఎవ్వరూ భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదంటూ రూ.75 లక్షల ధరగా నిర్ణయించారు. అందులో రూ.6 లక్షలు తిరిగి కమీషన్‌ రూపంలో చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నారు.  


కంకిపాడు మండలంలోని ఈడ్పుగల్లు- వేల్పూరు సరిహద్దులో సుమారు 30 ఎకరాలు సేకరించారు. ఇక్కడ ఎకరం రూ.50-60 లక్షలు ఉంటుంది. అధికారులు రూ.72 లక్షలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ రైతుల నుంచి ఎకరాకు రూ.12 లక్షలను కమీషన్‌గా వసూలు చేశారు. ఉయ్యూరులో ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ.6 నుంచి 15 లక్షల వరకు  దండుకున్నారు.  


రెవెన్యూ, పోలీసుల సాక్షిగా సెటిల్‌మెంట్లు

వణుకూరులో ఓ రైతు 13.70 ఎకరాలను భూసేకరణకు ఇచ్చారు. ఆయనకు సుమారు రూ.10 కోట్లు ప్రభుత్వం నుంచి వచ్చింది. కమీషన్‌గా సుమారు రూ.80 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. గతంలో ఈ రైతుకు, అధికార పార్టీ నేత బంధువులకు భూమి కొనుగులుకు సంబంధించిన ఓ వ్యవహారం అసంపూర్తిగా మిగిలి ఉంది. దాన్ని సెటిల్‌ చేస్తే కమీషన్‌ డబ్బులు ఇస్తానని ఆ రైతు అధికార పార్టీ నేతకు స్పష్టం చేశాడు. దీంతో ఆగ్రహించిన సదరు నేత దండోపాయానికి దిగారు. మరుసటి రోజే ఆ రైతు కుమారుడికి పోలీసుస్టేషన్‌ నుంచి పిలుపు వచ్చింది.


స్టేషన్‌కు వెళ్లి కారణమడిగితే ‘ప్రభుత్వ స్థలంలో ఉన్న మట్టిని తోలుకు వెళుతున్నావని స్థానిక రెవెన్యూ అధికారులు నీపై ఫిర్యాదు చేశారు. అందుకే నీపై కేసు పెడుతున్నాం’. అని పోలీసు అధికారి సెలవిచ్చారు. కొద్ది రోజుల క్రితం ఆ భూమిని తామే భూసేకరణ కింద ప్రభుత్వానికి ఇచ్చామని, పొలంలో ఉన్న మట్టిని తోలుకుంటామని అడిగితే, రెవెన్యూ అధికారులు అనుమతిచ్చారని, ఆ తరువాతే తోలుకున్నామని రైతు కుమారుడు చెప్పారు. ‘అదంతా మాకనవసరం.. ఏమైనా ఉంటే అధికార పార్టీ నేతతో మాట్లాడుకోండి’. అంటూ సదరు పోలీసు అధికారి సెలవిచ్చారు. 


కమీషన్‌ ఇవ్వనందునే తమను ఇలా వేధిస్తున్నారని అర్థం చేసుకున్న ఆ రైతు కుటుంబ సభ్యులు ఆగమేఘాలపై రూ.60 లక్షలను ఆ నేతకు సమర్పించుకున్నారు. మిగిలిన మొత్తాన్ని కొద్ది రోజుల్లో ఇస్తామని గడువు తీసుకుని వెనుదిరిగారు. 


వణుకూరుకు చెందిన మరో రైతు సుమారు కోటి రూపాయలు కమీషన్‌గా ఇవ్వాల్సి ఉండగా,  అందుకు ఆయన సుముఖత చూపలేదు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. వెనువెంటనే ఆ రైతుకు హైదరాబాద్‌లో ఉన్న సుమారు రూ.80 లక్షల విలువ చేసే అపార్ట్‌మెంటు ఫ్లాటు అధికార పార్టీ నేత బంధువుల పేరు మీదకు మారిపోయింది.


కమీషన్ల వ్యవహారంపై   వైసీపీ అధిష్ఠానం సీరియస్‌

పెనమలూరు నియోజకవర్గంలో కమీషన్ల వ్యవహారంపై వైసీపీ అధిష్ఠానం సీరియస్‌ అయినట్లు సమాచారం. స్థానిక నేతలు కొందరు ఈ వ్యవహారాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో అధిష్ఠానం వివరాలు సేకరిస్తోంది. మరోవైపు రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2020-05-29T09:03:23+05:30 IST