ఉద్యమకారుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-09-07T16:44:34+05:30 IST

ఎన్నికల సమయంలో తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా కార్పొరేటర్‌ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ అతని ఇంటివద్దే సోమవారం రాత్రి పెట్రోలు

ఉద్యమకారుడి ఆత్మహత్యాయత్నం

రూ.25లక్షలు తీసుకుని కార్పొరేటర్‌ వేధింపులు..! 

అప్పుల పాలై రోడ్డున పడిన కుటుంబం  

మనస్తాపంతో నాయకుడి ఇంటి వద్దే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం 
విషమంగా నర్సింహాచారి ఆరోగ్యం

హైదరాబాద్/జీడిమెట్ల: ఎన్నికల సమయంలో  తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా కార్పొరేటర్‌ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ అతని ఇంటివద్దే సోమవారం రాత్రి పెట్రోలు పోసుకుని ఓ తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

సిద్దిపేట్‌కు చెందిన చేవర్తి నర్సింహాచారి (43) కార్పెంటర్‌. ఇతడికి భార్య శ్వేత, ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న కుమార్తె లిఖిత, ఏడో తరగతి చదువుతున్న మరో కుమార్తె ఉన్నారు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి ఎల్లమ్మబండ ప్రాంతంలోని ద్వారకానగర్‌లో నివాసముంటున్నారు. గతంలో అదే ప్రాంతంలో ఓం మోల్డింగ్‌ టింబర్‌ను నిర్వహించే వాడు. తెలంగాణ ఉద్యమంలో నర్సింహాచారి ముందుండి పాల్గొన్నాడు. 2015లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ టికెట్‌ రేసులో ఉన్నాడు. అందుకు టింబర్‌ డిపోను విక్రయించి డబ్బు పోగుచేసుకున్నాడు. అయితే, ఆల్విన్‌కాలనీ టికెట్‌ను పార్టీ దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌కు ఇచ్చింది. ఎన్నికల సమయంలో దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌ రూ.25లక్షలు తీసుకున్నాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. గెలిచిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా, ప్లాటు ఇప్పిస్తానని చెప్పి ఎన్నోసార్లు ఇంటి చుట్టూ తిప్పుకున్నాడు. 

అంతేకాక అతని కుమారుడు దొడ్ల రామకృష్ణగౌడ్‌ గతంలో అప్పుగా తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా నర్సింహాచారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తన డబ్బులు ఇవ్వాలని కార్పొరేటర్‌ను  నర్సింహాచారి గట్టిగా నిలదీయడంతో సోమవారం రాత్రి ఇంటికి పిలిచాడు. ఎల్లమ్మబండలోని శిల్పా బృందావనంలోని కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లగా లేడని చెప్పించడంతోపాటు కుటుంబ సభ్యులు దుర్భాషలాడారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నర్సింహాచారి  ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా కాలిపోయిన అతడిని స్థానికులు రక్షించి పోలీసుల సాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జగద్గిరిగుట్ట పోలీసులు మంగళవారం బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌, అతని కుమారుడు రామకృష్ణగౌడ్‌లపై 306, 420, ఆర్‌డబ్ల్యూ 511సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్టు జగద్గిరిగుట్ట సీఐ సైదులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

రోడ్డు పాలయ్యాం
కార్పొరేటర్‌ తీసుకున్న రూ.25లక్షలు ఇవ్వకుండా వేధిస్తున్నాడని, అప్పుల పాలైన తాము ఇంటి అద్దెకట్టలేని స్థితిలో రోడ్డుపాలయ్యామని నర్సింహాచారి భార్య వాపోయారు. ప్రస్తుతం బాచుపల్లిలోని బంధువుల ఇళ్లవద్ద ఉంటున్నట్లు తెలిపారు. కార్పొరేటర్‌ వెంకటేశ్‌గౌడ్‌, అతని కుమారుడిని కఠినంగా శిక్షించి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని  డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-09-07T16:44:34+05:30 IST