Abn logo
Jul 27 2021 @ 17:34PM

హరప్పా నాగరికత కాలంనాటి ధోలావీరాకు యునెస్కో గుర్తింపు

న్యూఢిల్లీ : గుజరాత్‌లోని ధోలావీరాను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో హెరిటేజ్ కమిటీ గుర్తించింది. చైనా నుంచి ఆన్‌లైన్‌లో జరుగుతున్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ధోలావీరా హరప్పా నాగరికత కాలంనాటిది. సామాన్య శకానికి పూర్వం (బీసీ) 1800లో దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది.


తెలంగాణాలోని రామప్ప దేవాలయానికి జూలై 25న ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. హరప్పా నాగరికత కాలం నాటి ధోలావీరాకు మంగళవారం ఈ గుర్తింపు లభించింది. దీంతో మన దేశంలోని ప్రపంచ వారసత్వ సంపదల సంఖ్య 40కి చేరింది. గుజరాత్‌లో మొత్తం నాలుగు ప్రపంచ వారసత్వ సంపదలు ఉన్నాయి. అవి : ధోలావీరా, చంపనేర్, రాణీ కీ వావ్, అహ్మదాబాద్.


ప్రకృతి సంబంధమైన, సాంస్కృతిక ప్రాధాన్యంగల ప్రదేశాలను ఈ విధంగా ప్రపంచ వారసత్వ సంపదలుగా గుర్తిస్తారు. ప్రస్తుత, భావి తరాలకు ఉమ్మడి ప్రాధాన్యంగలవాటికి ఈ గుర్తింపు లభిస్తుంది.