వీరభక్త హనుమాన్‎కీ

ABN , First Publish Date - 2022-04-17T16:25:14+05:30 IST

జై శ్రీరాం.. జైహనుమాన్‌ నామస్మరణతో శనివారం నగరం హోరెత్తింది. నగర వీధులన్నీ కాషాయమయమయ్యాయి. కాషాయ టోపీలు

వీరభక్త హనుమాన్‎కీ

 కాషాయమయంగా నగర వీధులు

వేలాదిగా తరలి వచ్చిన భక్తులు

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్‌/చంపాపేట/చిక్కడపల్లి/బోయినపల్లి: జై శ్రీరాం.. జైహనుమాన్‌ నామస్మరణతో శనివారం నగరం హోరెత్తింది. నగర వీధులన్నీ కాషాయమయమయ్యాయి. కాషాయ టోపీలు, జెండాలతో భక్తులు వీర హనుమాన్‌ విజయయాత్రలో పాల్గొన్నారు. కాషాయ చీరలను ధరించిన మహిళలు బైక్‌లపై ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ హనుమాన్‌ వేషాధారణలో ఓ యువకుడు డీజే పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ చూపరులను అలరించారు. వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ల సంయుక్తాధ్వర్యంలో వీర హనుమాన్‌ విజయయాత్ర గౌలిగూడలోని రామ మందిరం నుంచి ఘనంగా ప్రారంభమై రాత్రి 8.30గంటల సమయంలో తాడ్‌బంద్‌ ఆంజనేయస్వామి ఆలయం వద్దనున్న హాకీ గ్రౌండ్‌లో ప్రశాంతంగా ముగిసింది. అడుగడునా నిర్వాహకులు ఏర్పాటు చేసిన స్వాగత వేదికలపైనుంచి విజయయాత్రపై పూలవర్షం కురిపించారు. కర్మన్‌ఘాట్‌లోని శ్రీ ధ్యానాంజనేయస్వామి ఆలయంలో జయరాం గురుస్వామి గురూజీ, ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు వి.సురేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్టీసీక్రా్‌సరోడ్స్‌లో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక నుంచి బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, రాంనగర్‌ కార్పొరేటర్‌ రవిచారి శోభాయాత్రకు స్వాగతం పలికారు.  


ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి : రితేశ్వర్‌ జీ

 హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు, హిందుస్థాన్‌ను కాపాడుకునేందుకు యువకులు నడుం బిగించాలని సద్గురు రితేశ్వర్‌ జీ పిలుపునిచ్చారు. కోఠిలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై ఆయన ప్రసంగించారు. ఇతర దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో పరమతాలపై జరుగుతున్న దాడులను చూస్తున్నామని, అటువంటి పరిస్థితులు హిందుస్థాన్‌లో ఏర్పడకుండా ఉండేందుకు హనుమంతుని భక్తులు సిద్ధం కావాలని అన్నారు.  


ప్రధాన ఆకర్షణగా.. నడిచే హనుమంతుడు

 నగరంలో శనివారం నిర్వహించిన హనుమాన్‌ శోభాయాత్రలో నడిచే హనుమంతుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. కండలు తిరిగిన రూపం, భారీ ఆకారం, చేతిలో గద, హావభావాలతో గంభీరమైన చూపులతో శ్రీ ఆంజనేయస్వామి రూపంలో ఆకట్టుకున్నాడు ప్రీతమ్‌. కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్రీతమ్‌ (21) రెండేళ్లుగా హనుమంతుడి వేషధారణతో శోభాయాత్రలో పాల్గొంటున్నాడు. 5 అడుగులు న్న ప్రీతమ్‌ సుమారు 40 కిలోల బరువు గల వస్తువులతో హనుమాన్‌ అలంకరణతో ఎనిమిది అడుగుల భారీ ఆకారంలో కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రీతమ్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ జీవనోపాధి నిమిత్తం శ్రీఆంజనేయస్వామి రూపంలో ప్రదర్శనలు ఇస్తున్నట్లు తెలిపారు. 


ఎనిమిది వేల మందితో బందోబస్తు

హనుమాన్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన విజయయాత్ర ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. నగర పోలీసు విభాగాల్లో వివిధ శాఖలకు చెందిన ఎనిమిది వేల మందితో యాత్రకు బందోబస్తు ఏర్పాటు చేశారు. యాత్ర సాఫీగా సాగేందుకు కమిషనరేట్‌ కార్యాలయంలో అన్ని శాఖలకు సంబంధించి ఉమ్మడి కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. డ్రోన్‌ కెమెరాలు, ఎత్తైన భవనాలపై నిఘా, సీసీ కెమెరాలతో బందోబస్తును పర్యవేక్షించారు. యాత్ర సందర్భంగా సోషల్‌ మీడియాపై కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. యాత్ర జరుగుతున్నంత సేపు బందోబస్తు ఏర్పాట్లను సీపీ సీవీ ఆనంద్‌ పర్యవేక్షించారు. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో జరిగిన శోభా యాత్రలను సీపీలు స్టీఫెన్‌ రవీంద్ర, మహే్‌షభగవత్‌లు పర్యవేక్షించారు. యాత్ర జరుగుతున్న తీరును కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పరిశీలించారు.

Updated Date - 2022-04-17T16:25:14+05:30 IST