సర్వే సగమే

ABN , First Publish Date - 2020-10-12T05:50:25+05:30 IST

ఆస్తుల లెక్క పక్కాగా ఉంచుతూ భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా చూడాలనే ఉద్దేశంతో చేపట్టిన

సర్వే సగమే

ఇరు జిల్లాలో మందకొడిగా ‘ధరణి ఆన్‌లైన్‌’

సగటున రోజుకు 30 ఆస్తుల వివరాలు మాత్రమే నమోదు

రూరల్‌ ప్రాంతాల్లో ఆటంగా మారిన సాంకేతిక సమస్యలు

మరో పదిరోజులు గడువు పెంపు

దసరాకు పాస్‌పుస్తకాల పంపిణీ ఆనుమానమే 


ఖమ్మం/కొత్తగూడెం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ఆస్తుల లెక్క పక్కాగా ఉంచుతూ భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా చూడాలనే ఉద్దేశంతో చేపట్టిన వ్యవసాయేత ఆస్తుల సర్వే ప్రక్రియ మందగొండిగా సాగుతోంది. ఇరు జిల్లాల్లో ఇప్పటివరకు సుమారు 50శాతం సర్వే మాత్రమే పూర్తి చేశారు. ఈ సర్వే ద్వారా గ్రామాల్లోని వ్యవసాయేతర ఆస్తుల సమాచారాన్ని ధరణి వెబ్‌సైట్‌కు అనుసంధానించడం ద్వారా భవిష్యత్తులో ఆయా ఆస్తులకు సంబంధించి లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో గత పదిరోజుల నుంచి అధికారులు వ్యవసాయేతర ఆస్తులను రికార్డు చేసే పనిలో పడ్డారు. అయితే ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి మాత్రం అధికారులు తమ టార్గెట్‌ పూర్తిచేయలేకపోయారు. 10వ తేదీనాటికి ఆస్తుల గణాంకాలను ఆన్‌లైన్‌ చేయాలని భావించినా గడువు నాటికి కేవలం సగం ఆస్తులను మాత్రమే ఆన్‌లైన్‌ చేయగలిగారు. 


ఖమ్మం జిల్లాలోని 584 పంచాయతీల్లో మొత్తం 2,93,580 ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉండగా ఇందుకోసం 612 మంది అధికారులను నియమించారు. అయితే పదోతేదీ నాటికి 1,62,612 (55.38ు) మాత్రమే నమోదు చేశారు. అర్బన్‌ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలతో సర్వేకు ఆటంకం ఏర్పడుతోందని, అందువల్లనే ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉమ్మడి ఆస్తుల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆలస్యమవుతోంది. జిల్లాలో రోజుకు సగటున కేవలం 30 నుంచి 50 ఆస్తుల వివరాలను మాత్రమే ఆన్‌లైన్‌ చేయగలుగుతున్నారు.  


 కొత్తగూడెం జిల్లాలో 52శాతం.. 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 21 మండలాల్లో ఆదివారం నాటికి వ్యవసాయేతర ఆస్తుల సర్వే 52 శాతం పూర్తయింది. ఇప్పటి వరకు 14,3,320 కుటుంబాల ఆస్తుల సర్వే పూర్తిచేశారు. పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు మునిసిపాలిటీల పరిధిలో 53.33శాతం సర్వే పూర్తయింది. జిల్లాలో మొత్తం 480  పంచాయతీల్లో ఇప్పటి వరకు 52 శాతం మాత్రమే సర్వే పూర్తయింది. ఇప్పటి వరకు 29,159 గృహాలకు వెళ్లి సర్వే నిర్వహించారు. సగటున 18శాతం ప్రతి రోజు సర్వే నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం మునిసిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు 7,418 ఆస్తుల వివరాలను సేకరించారు. మణుగూరు 3,526, పాల్వంచ 13,812, ఇల్లెందు మునిసిపాలిటీ పరిధిలో 4,403 ఆస్తుల వివరాలను సేకరించారు. బూర్గంపాడు మండలంలో ఇప్పటి వరకు 7,915 గృహాలను సర్వే చేయగా, 96శాతం సర్వేలో ముందంజలో ఉన్నారు. కరకగూడెం మండలంలో 3,630 గృహాలను సర్వేచేసి 25శాతంతో అతి తక్కువ సర్వే నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో సిగ్నల్‌ సమస్యలతో ఆన్‌లైన్‌ ప్రక్రియ మందగొడిగా సాగుతోంది.  


మరో పదిరోజులు గడువు పెంపు 

ఆస్తుల సర్వే ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా అనేక సమస్యలు ఎదురవుతుండడంతో నమోదుకు మరో పది రోజులు గడువు పెంచుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.  20 వతేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 25న దసరా ఉండగా.. ఆ రోజు నాటికి వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి పాసుపుస్తకాలు జారీచేయాలనుకున్న లక్ష్యం నెరవేరుతుందా.. లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా సర్వే పూర్తిచేసి దసరా నాటికి పాసుపుస్తకాలు జారీ చేయడం సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

Updated Date - 2020-10-12T05:50:25+05:30 IST