న్యూఢిల్లీ : మారిషస్‌కు అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH Mark III)లను ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదిరిందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంతో తమకు, మారిషస్ ప్రభుత్వానికి మధ్య మూడు దశాబ్దాల నుంచి ఉన్న వ్యాపార సంబంధాలు మరింత బలపడినట్లు తెలిపింది. మారిషస్ ఇప్పటికే హెచ్ఏఎల్ తయారు చేసిన ALH, Do-228 విమానాలను వినియోగిస్తోంది.
మిత్ర దేశాలకు రక్షణ రంగ ఎగుమతులను పెంచాలనే కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ ఒప్పందం కుదిరింది. దీనిపై హెచ్ఏఎల్ హెలికాప్టర్ విభాగం జనరల్ మేనేజర్ బీకే త్రిపాఠీ, మారిషస్ ప్రధాన మంత్రి కార్యాలయంలో హోం అఫైర్స్ సెక్రటరీ ఏకే డబిడిన్ సంతకాలు చేశారు. ALH Mk III బహుళ పాత్రలను పోషించే హెలికాప్టర్. 5.5 టన్నుల విభాగంలో వైవిద్ధ్యభరితమైన హెలికాప్టర్. భారత దేశంతోపాటు విదేశాల్లో ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణాలను కాపాడటంలో ఇది తన సత్తాను అనేకసార్లు చాటుకుంది. ఇప్పటి వరకు 335కుపైగా హెలికాప్టర్లను హెచ్ఏఎల్ తయారు చేసింది. వీటిని కొనుగోలు చేసిన కస్టమర్లకు సాంకేతిక సహాయాన్ని కూడా హెచ్ఏఎల్ అందిస్తోంది.
మన దేశ సైన్యం కూడా ఈ హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. భారత నావికా దళం గత ఏడాది తొలి స్క్వాడ్రన్‌ను ప్రవేశపెట్టింది.
ఇవి కూడా చదవండి