రైల్వేస్టేషన్‌లో పారిశుధ్య పనులకు జీవీఎంసీ వాహనాలు

ABN , First Publish Date - 2022-07-01T06:38:23+05:30 IST

రైల్వేస్టేషన్‌ ఆవరణలో పారిశుధ్య పనులకు జీవీఎంసీ వాహనాలను వినియోగిస్తున్న ఉందంతం అధికారులను అవాక్కయ్యేలా చేసింది. రైల్వేస్టేషన్‌ ఆవరణతోపాటు ఫ్లాట్‌పారాలపైన పోగయ్యే చెత్త, ఇతర వ్యర్థాలను సేకరించి, వాహనాల్లో బయటకు తరలించేందుకు రైల్వేశాఖ ప్రత్యేకంగా కాంట్రాక్టర్‌ను నియమించుకుంటుంది.

రైల్వేస్టేషన్‌లో పారిశుధ్య పనులకు జీవీఎంసీ వాహనాలు
రైల్వేస్టేషన్‌ ఆవరణలో చెత్త తరలిస్తున్న జీవీఎంసీ వాహనాలు

అక్రమార్జన కోసం జీవీఎంసీ సిబ్బంది అడ్డదారి

జోనల్‌స్థాయి అధికారుల అండదండలు

విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రైల్వేస్టేషన్‌ ఆవరణలో పారిశుధ్య పనులకు జీవీఎంసీ వాహనాలను వినియోగిస్తున్న ఉందంతం అధికారులను అవాక్కయ్యేలా చేసింది. రైల్వేస్టేషన్‌ ఆవరణతోపాటు ఫ్లాట్‌పారాలపైన పోగయ్యే చెత్త, ఇతర వ్యర్థాలను సేకరించి, వాహనాల్లో బయటకు తరలించేందుకు రైల్వేశాఖ ప్రత్యేకంగా కాంట్రాక్టర్‌ను నియమించుకుంటుంది. సదరు కాంట్రాక్టర్‌ సిబ్బందితో పాటు వాహనాలు, యంత్రాలను సమకూర్చుకుని నిత్యం పారిశుధ్య నిర్వహణ చేయాలి. ఒక్కోసారి నగరంలోని ప్రైవేటు వాహనాలను తీసుకుని పనులు చేస్తుంటారు. అయితే జీవీఎంసీ జోన్‌-4లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది అక్రమార్జన కోసం రైల్వేకాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. నగరంలో పనులు చేస్తున్నట్టు చెప్పి ఒక లారీ, ఒక బాబ్‌కాట్‌ను రైల్వేస్టేషన్‌లో పారిశుధ్య నిర్వహణకు కేటాయించేశారు. ఆయా వాహనాలను నడిపే సిబ్బందితోపాటు డీజిల్‌ను కూడా జీవీఎంసీ నుంచే తీసుకుని,  రైల్వే కాంట్రాక్టర్‌కు పనులు చేసి పెడుతున్నారు. గురువారం దీనికి సంబంధించిన ఫొటోలను కొంతమంది జీవీఎంసీ ఉన్నతాధికారులకు చేరవేడయంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు ఆరా తీయగా రెండేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్టు తెలిసింది.  జోన్‌-4లో కొంతమంది అధికారులకు వాటాలు అందుతుండడంతో వ్యవహారం వెలుగుచూడలేదంటున్నారు. దీనిపై కమిషనర్‌ దృష్టిసారించాలని నగరవాసులు కోరుతున్నారు.


Updated Date - 2022-07-01T06:38:23+05:30 IST