కలుషిత కాటు..

ABN , First Publish Date - 2022-04-12T18:07:36+05:30 IST

మాదాపూర్‌ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో సోమవారం మరొకరు మృతి చెందారు. ఈ బస్తీకి చెందిన ఒకరు ఇంతకు ముందే

కలుషిత కాటు..

గుట్టల బేగంపేటలో మరొకరు మృతి


హైదరాబాద్/మాదాపూర్‌ : మాదాపూర్‌ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో సోమవారం మరొకరు మృతి చెందారు. ఈ బస్తీకి చెందిన ఒకరు ఇంతకు ముందే మృత్యువాత పడ్డారు. కలుషిత నీటి వల్ల సుమారు రెండొందల వరకూ ఆస్పత్రి పాలయ్యారు. తాజాగా వడ్డెర బస్తీకి చెందిన కన్నమ్మ (80) మృతితో మరోమారు ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఇప్పటికీ వాటర్‌వర్క్స్‌ అధికారులు తాగునీరు కలుషితం కాలేదనే చెబుతున్నారు. దీంతో బస్తీలో అసలు ఏం జరిగిందో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 


బాధితులను ఆదుకోవాలి: బీజేపీ

వడ్డెరబస్తీ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందని బీజేపీ నాయకులు మురళీధర్‌రావు ఆరోపించారు. సోమవారం ఆయనతో పాటు నాయకులు ప్రభాకర్‌రావు, యోగానంద్‌తో కలిసి బస్తీలో పర్యటించారు. మంచినీటిని కూడా సరఫరా చేయలేని ప్రభుత్వం హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు ఆర్థిక సాయం అందించకపోతే పార్టీ తరఫున పెద్దఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. కన్నమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వడ్డెర బస్తీ వాసులను ఎమ్మెల్యే గాంధీ పరామర్శించారు. 


ఆ నీరు సురక్షితమే..: రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి

మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటలో నీళ్లు కలుషితం కాలేదని, వాటర్‌బోర్డు సరఫరా చేస్తున్న నీరు నీళ్లు సురక్షితమైనవని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్య లక్ష్మి ప్రకటించారు. బస్తీలో ఈ నెల 7నఅతిసారం (ఏడీడీ) ప్రబలిందని స్థానిక ఏఎన్‌ఎం సమాచారం మేరకు వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ ఇంట్లోనూ సర్వే చేసి వాంతులు విరేచనాలు స్వల్పంగా ఉన్నవారందరికీ చికిత్స అందించామని తెలిపారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని కొండాపూర్‌ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. మరుసటి రోజున బస్తీలోని తాగునీటి నమూనాలు సేకరించి రాష్ట్ర నిర్ధారణ కేంద్రం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం)కు పంపామని తెలిపారు. సోమవారం వచ్చిన ఫలితాల్లో నీటిలో ఎలాంటి హానికర రసాయనాలు గానీ, బాక్టీరియా గానీ లేదని తేలిందని వెల్లడించారు.

Updated Date - 2022-04-12T18:07:36+05:30 IST