ఎమ్మెల్సీగా గుత్తా ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-11-23T06:10:33+05:30 IST

శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా సోమ వారం ఎన్నికయ్యారు. గతంలో కూ డా ఎమ్మెల్సీగా, శాసన మండలి చైర్మన్‌గా పనిచేసిన సుఖేందర్‌రెడ్డి రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

ఎమ్మెల్సీగా గుత్తా ఏకగ్రీవం
ఎమ్మెల్సీగా ధ్రుపత్రాన్ని అందుకుంటున్న గుత్తా

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కోటిరెడ్డి

మంత్రి సారధ్యంలో నేడు నామినేషన్‌ 

ఏకగ్రీవంపైనే టీఆర్‌ఎస్‌ ఆశలు

పోటీకి సిద్ధంగా ఉండాలని జిల్లా నేతలకు కాంగ్రెస్‌ ఆదేశం



చిట్యాల రూరల్‌, నవంబరు 22: శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా సోమ వారం ఎన్నికయ్యారు. గతంలో కూ డా ఎమ్మెల్సీగా, శాసన మండలి చైర్మన్‌గా పనిచేసిన సుఖేందర్‌రెడ్డి రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండోమారు ఎమ్మెల్సీగా ఎన్నికవ డంతో చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన శాసనమండలి చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఈ ఏడాది జూన్‌ 3న ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో శాసనసభ్యుల కోటాలో ఆయనకు కేసీఆర్‌ అవకాశం కల్పించగా, ఈనెల 16న నామినేషన్‌ దాఖలుచేశారు. మిగతా పార్టీలు నామినేషన్లు దాఖలు చేయకపోడంతో ఆయన ఏకగ్రీవంగా సోమవారం ఎన్నికయ్యారు. ఆయనకు మళ్లీ పదవి దక్కడంతో స్వగ్రామంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. గుత్తాకు మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


 కోటిరెడ్డికే దక్కిన టికెట్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అంతా ఊహించినట్టే ఎంసీ కోటిరెడ్డిని అధిష్ఠానం ఖరారుచేసింది. సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లే క్రమంలో అభ్యర్థికి సంబంధించిన బీ-ఫాంను రెండు రోజుల క్రితమే మంత్రి జగదీ్‌షరెడ్డికి అందజేశారు. కాగా, సోమవారం నామినేషన్‌ దాఖలుకు అవసరమైన వివరాలన్నింటినీ తీసుకొని కార్యక్రమం సాఫీగా సాగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థి కోటిరెడ్డి, సూర్యాపేటలో మంత్రి జగదీ్‌షరెడ్డిని కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నారు. మంత్రి సూచన మేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మునిసిపల్‌ చైర్మన్లను నామినేషన్‌ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 11గంటలకు కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి మంత్రితో పాటు వీరంతా హాజరుకానున్నారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మునిసిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లతో కలిసి విడివిడిగా ఈ నాలుగు సెట్లు దాఖలు చేయించి అందరినీ భాగస్వామ్యులను చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఇదిలా ఉండగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు 23వ తేదీ చివరి గడువు కాగా, ఇప్పటి వరకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. పోటీలో లేమని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఎన్నికల క్యాంప్‌ ఓటర్లకు నోట్ల పంపిణీ అనేది దాదాపు ఉండకపోవచ్చని, ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ నుంచి డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ను పోటీలో నిలపాలని ఆ పార్టీ భావించినా, ఓట్ల కొనుగోలుకు స్థోమత లేకపోవడం, పోటీలో నిలిచినా ఓట్లు అతి తక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో ఆయన విముఖత వ్యక్తం చేశారు. అయితే ఓటర్లు ఉన్నచోట పోటీ చేయాల్సిందేనని కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పార్టీకి చెందిన కొందరు ఎంపీటీసీలు పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పోటీలో ఉండాలా? లేదా? అనేది ఈ నెల 23న ఉదయం 10గంటలకు తేలనుంది.

Updated Date - 2021-11-23T06:10:33+05:30 IST