ఆసిఫాబాద్‌ జిల్లాలో విచ్చలవిడిగా గుట్కా దందా

ABN , First Publish Date - 2022-05-17T04:12:07+05:30 IST

గుట్కా, అంబర్‌, ఖైనీ, ఫుల్‌చాప్‌ పేర్లు ఏవైనా మత్తు పదార్థాల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా కాగజ్‌నగర్‌ డివిజన్‌లో గుట్కా విక్రయాలు ఆగడం లేదు. గుట్కా విక్రయిస్తూ పట్టుబడితే కోర్టు జరిమానా విధిస్తోంది.

ఆసిఫాబాద్‌ జిల్లాలో విచ్చలవిడిగా గుట్కా దందా

- నిషేధం ఉన్నా ఆగని అమ్మకాలు

- మత్తులో యువత

- మామూళ్ల మత్తులో పోలీసులు

- అనుమానం రాకుండా కొత్త పద్ధతులు

-మామూలుగా తీసుకుంటున్న అధికారులు 

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 16: గుట్కా, అంబర్‌, ఖైనీ, ఫుల్‌చాప్‌ పేర్లు ఏవైనా మత్తు పదార్థాల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా కాగజ్‌నగర్‌ డివిజన్‌లో గుట్కా విక్రయాలు ఆగడం లేదు. గుట్కా విక్రయిస్తూ పట్టుబడితే కోర్టు జరిమానా విధిస్తోంది. అయినా మత్తు పదార్థాల అమ్మకాలు ఆగడం లేదు. పేరుకే నిషేధం ఉన్నప్పటికీ మూడు పూలు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. కేవలం టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో భాగంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు స్థానిక పోలీసులు మచ్చుకు కొన్ని పట్టుకొని స్వాధీనం చేసుకొని చేతులు దులుపుకుంటున్నారు. మార్కెట్‌లో ఒక్కో గుట్కా ప్యాకెట్‌ ధర రెట్టింపు ధరలకు అమ్ముతుండడం హోల్‌ సేల్‌, చిరు వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. గతంలో ఉన్న డిఎస్పీ సుమారు సుమారు కోటి రూపాయల విలువ గల గుట్కా పట్టుకొని ఉక్కుపాదం మోపారు. ఐతే ప్రస్తుతం వ్యాపారం ఆగడం లేదంటే ఆశ్యర్యం కలుగకమానదు. 

చీకటి దందా వెనుక బడాబాబులు 

కాగజ్‌నగర్‌ కేంద్రంగా గుట్కా సప్లయి అవుతోందనే ఆరోపణలున్నా పెద్దగా పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో హోల్‌సేల్‌ వ్యాపారం చేసిన వారు వెనుక నుండి కొత్త వ్యక్తులను వ్యాపారంలోకి దింపి దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వ్యాపారులపై పదేపదే కేసులు నమోదు చేస్తున్నా వారి తీరు మాత్రం మారడం లేదని చెబుతున్నారు. ఆయా దుకాణాలకు సరఫరా అయ్యే విధానం, పలు చోట్ల నుంచి వచ్చే సరుకు రవాణా మార్గాలపై కొరడా ఝలిపిస్తే గుట్కా విక్రయాలకు బ్రేక్‌ వేయవచ్చునని భావిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు గుట్కా సరఫరాలో కీలకంగా మారుతోంది.

సాధారణ కేసులు..

గుట్కా వ్యాపారులు పట్టుబడితే సాధారణ కేసులు పెట్టడంతో మరింత రెచ్చిపోతున్నారు. అంతర్‌రాష్ట్ర రవాణాగా ఈ గుట్కా మారిపోయింది. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ తదితర ప్రాంతాల నుంచి సరుకు రవాణా చేస్తూ విచ్ఛల విడిగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ దందాలో కాగజ్‌గనగర్‌లోని ట్రాన్స్‌పోర్ట్‌లే కీలకంగా మారాయి. మహారాష్ట్రలో నిషేధం లేకపోవడంతో సరిహద్దున ఉన్న గ్రామాల్లో గోదాములు ఏర్పాటు చేసి కాగజ్‌నగర్‌ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారనే సమాచారం. గతంలో పలు కేసుల్లో ఉన్న వ్యాపారులే ఈ దందాను కొనసాగిస్తూ, మరి కొంత మంది చిరు వ్యాపారుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని పోత్సహిస్తున్నారు. అధిక లాభాలు ఉండడం తోడు చర్యలు కూడా నామమాత్రంగానే ఉండడంతో ఎలాంటి జంకు లేకుండా దందాను నిర్వహిస్తున్నారు. గతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చీకటి వ్యాపారాన్ని దెబ్బతీసినప్పటికీ ప్రస్తుతం కొంత వెనుకబాటు ప్రదర్శించడంపై ఆరోపణలు వినవస్తున్నాయి. 

కాగజ్‌నగర్‌ కేంద్రంగా మండలాలకు సరఫరా

కాగజ్‌నగర్‌ నుంచి సిర్పూర్‌(టి), బెజ్జూరు, చింతలమానేపల్లి, కౌటాల, పెంచికల పేట, దహెగాంతో పాటు ఆయా మండలాలకు గుట్కాసరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు మహారాష్ట్ర, అటు కర్నాటక మీదుగా హైదరాబాద్‌ నుంచి సరఫరా అవుతోంది. కాగజ్‌నగర్‌లోని మార్కెట్‌ ప్రాంతంలోని కొంతమంది వ్యాపారులు గుట్కా తెప్పించి ఆయా షాపులకు సరఫరా చేస్తుంటారు. గతంలో గోడౌన్లలో భారీగా గుట్కా సంచులు గుట్టలుగా పట్టుబడ్డాయి. భూమిలో బంకర్‌లలాగా గోతులు తవ్వి గుట్కా సంచులు దాచిపెట్టగా పట్టుబడ్డ సంఘటనలున్నాయి. వాహనాల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామన వరకు గుట్కా విక్రయాలు, సప్లై జరుగుతోందని అంటున్నారు. గల్లీకో చిరువ్యాపారిని ఏర్పాటు చేసి వ్యాపారాన్ని చేస్తున్నారు. ప్రతీ కిరాణా షాపు, పాన్‌టేలాల్లో గుట్కా విక్రయాలు జరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దున ఉన్న సిర్పూర్‌(టి), బెజ్జూరు, చింతలమానేపల్లి, కౌటాల మండలాల్లో అటువైపు నుంచి కూడా గుట్కా సరఫరా అవుతుండడంతో గుట్కా విక్రయాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. 

గుట్కా సమాచారం అందిస్తే గోప్యంగా ఉంచుతాం

- కరుణాకర్‌, డిఎస్పీ, కాగజ్‌నగర్‌ 

కాగజ్‌నగర్‌ డివిజన్‌లో గుట్కా విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అణిచివేస్తాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం. గతంలోనే అనేక మందిపై కేసులు నమోదు చేసి బెండోవర్‌ చేశాం. ప్రభుత్వం నిషేధం విధించినందున గుట్కా విక్రయాలు చేపడితే ఉపేక్షించేది లేదు. ప్రతీరోజు గుట్కా, మట్కా, పశువుల రవాణా తదితరాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచుతూ కేసులు నమోదు చేస్తున్నాం.

Updated Date - 2022-05-17T04:12:07+05:30 IST