అట్టహాసంగా.. అమృత్‌ మహోత్సవ్‌

ABN , First Publish Date - 2022-07-19T05:51:55+05:30 IST

రైల్వేలో ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

అట్టహాసంగా.. అమృత్‌ మహోత్సవ్‌
విద్యుత్‌ దీపాలతో అలంకరించిన రైల్వేస్టేషన్‌

గుంటూరు స్టేషన్‌లో వారోత్సవాలు ప్రారంభం

వారం రోజులు  వివిధ కార్యక్రమాల నిర్వహణ

రంగురంగుల విద్యుత్‌దీపాలతో రైల్వేస్టేషన్‌ అలంకరణ


గుంటూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రైల్వేలో ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఆజాది కి రైల్‌ గాడి ఔర్‌ స్టేషన్‌ వారోత్సవాన్ని రైల్వే అధికారులు ప్రారంభించారు. వారం పాటు నిత్యం వివిధ  కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఏడీఆర్‌ఎం(ఇన్‌ఫ్రా) ఆర్‌ శ్రీనివాస్‌ లాంఛనంగా వారోత్సవాన్ని ప్రారంభించగా మరో ఏడీఆర్‌ఎం(ఆపరేషన్స్‌) రామా మెహర్‌, సీనియర్‌ డీసీఎం వీ ఆంజనేయులు, ఏ సీతశ్రీనివాస్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు రైల్వేస్టేషన్‌ని రంగురంగుల విద్యుత్‌దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఏడీఆర్‌ఎం శ్రీనివాస్‌ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారిని స్మరించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోండటం అభినందనీయమన్నారు. నేటితరం ప్రజలు నాటి అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. మహాత్మాగాంధీ 1937 జనవరి 23వ తేదీన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించారని గుర్తు చేశారు. ఆయన నిడుబ్రోలు రైల్వేస్టేషన్‌లో దిగి 160 కిలోమీటర్ల పొడవునా యాత్ర చేసి వరద బాధితుల కోసం విరాళాలు సేకరించారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులు యుద్ధనపూడి  పుల్లయ్య, ఉప్పాల నర్సిరెడ్డి కుటుంబ సభ్యులు జానికీరాం, శ్యామలమ్మని సత్కరించి గౌరవించారు. అలానే స్టేషన్‌ ఆవరణలో స్వాత్రంత్య సమరయోధుల ఫోటోలతో ఒక ప్రదర్వన ఏర్పాటు చేశారు. డిజిటల్‌ స్ర్కీన్‌ని కూడా ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు ప్రాణత్యాగాన్ని కళ్లకు కట్టేలే నాటక ప్రదర్శన నిర్వహించారు. ఆజాది రైల్‌ గాడి ఔర్‌ స్టేషన్‌ బ్యాక్‌డ్రాప్‌తో సెల్ఫీ పాయింట్‌ని ఏర్పాటు చేశారు. మైకు ద్వారా జింగిల్స్‌ ప్లే చేస్తూ ప్రయాణీకుల్లో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టారు. 

టీటీఈలకు హ్యాండ్‌హెల్డ్‌ టెర్మినల్స్‌

డిజిటల్‌ ఇనీషియేటివ్‌ కార్యక్రమంలో భాగంగా రైళ్లలో టిక్కెట్‌లు తనిఖీ చేసే టీటీఈలకు హ్యాండ్‌హెల్డ్‌ టెర్మినల్స్‌ని సోమవారం అందజేశారు. ట్రైన్‌ నెంబరు. 12795 విజయవాడ - లింగంపల్లి ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వహించే టీటీఈలకు ఆయా పరికరాలను అందజేశారు. ఏడీఆర్‌ఎం ఆర్‌ శ్రీనివాస్‌, సీనియర్‌ డీసీఎం వీ ఆంజనేయులు వాటి పనితీరుని పరిశీలించారు. రైళ్లలో ఏవైతే ఖాళీ సీట్లు/బెర్తులున్నాయో వాటిని టీటీఈలు ఈ హెచ్‌హెచ్‌టీలలో నమోదు చేస్తారు. దీని వలన మాన్యువల్‌ ఛార్టింగ్‌తో అవసరం లేకుండా పోయింది. ప్యాసింజర్ల ఛార్ట్‌ లిస్టు, ఖాళీలు అన్ని హెచ్‌హెచ్‌టీలలో కనిపిస్తాయి. ఇది ఆన్‌బోర్డు సౌకర్యంగా ఏడీఆర్‌ఎం తెలిపారు. దీని వలన ప్రయాణీకులకు రియల్‌టైంలో ఖాళీ బెర్తులు తెలిసిపోతాయన్నారు. రైలులో ప్రయాణీకులకు కేటాయించిన తర్వాత ఇంకా ఖాళీలుంటే వాటిని తదుపరి స్టేషన్‌కు పంపిస్తారు. దీని వలన రైలు బయలుదేరిన తర్వాత కూడా ఖాళీలుంటే రిజర్వేషన్‌ ఛార్ట్‌లో కనిపిస్తాయి. దాంతో రైలు రాబోయే స్టేషన్‌లో ఎక్కే ప్రయాణీకులు బెర్తులు బుకింగ్‌ చేసుకోవచ్చు. దీని వలన సిస్టమ్‌లో పారదర్శకత పెరుగుతుందని, అంతేకాకుండా ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఏడీఆర్‌ఎం తెలిపారు.  

Updated Date - 2022-07-19T05:51:55+05:30 IST