అధికారులకు.. అక్షింతలు!

ABN , First Publish Date - 2022-05-22T05:46:59+05:30 IST

జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అధికారులకు.. అక్షింతలు!
కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షకు హాజరైన సీఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు

ఎస్‌ఈపై సీఎం అదనపు కార్యదర్శి కన్నెర్ర

మీటింగ్‌ నుంచి బయటకు వెళ్లిపో అంటూ పంచాయతీరాజ్‌ ఎస్‌ఈపై రుసరుసలు

వాడివేడిగా జరిగిన సమీక్ష


గుంటూరు, మే 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే ఇళ్లకు వెళ్లిపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, డ్వామా తదితర శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశానికి మీడియాని, ఆఖరికి సమాచార పౌరసంబంధాల అధికారిని కూడా అనుమతించలేదు. జిల్లా కలెక్టర్‌ మాట్లి వేణుగోపాల్‌రెడ్డి, జేసీ గణియా రాజకుమారి, వివిధ శాఖల అధికారులు, నోడల్‌ ఆఫీసర్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. వివిధ శాఖల్లో డీఈఈ, ఈఈ, ఎస్‌ఈ స్థాయి అధికారులు, పీడీ, ఏపీడీలు, తహసీల్దార్లను పిలిపించారు. 

 ఇంకా జిల్లాలో 31,139 మందికి వివిధ కారణాలతో పట్టాల పంపిణీ జరగాల్సి ఉండటంపై అదనపు కార్యదర్శి ముత్యాలరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు కేసులకు సంబంధించి ఎందుకు వేగవంతంగా అఫిడవిట్‌లు దాఖలు చేయడం లేదని నిలదీశారు. ఓటీఎస్‌ పథకం అమలుకు సంబంధించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా ఆశాజనకంగా లేదన్నారు. కాగా జగనన్న కాలనీల లేఅవుట్లలో ఎస్టిమేట్లు విషయంలో అవసరానికి మించి ఎక్కువ వేశారని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈని ప్రశ్నించారు. దీనిపై ఆయన సరైన సమాధానం చెప్పలేకపోవడంతో సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆగ్రహించారు. 

భూముల రీసర్వే ప్రాజెక్టు విషయంలోనూ జిల్లా వెనకబడి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  భూమి రికార్డుల స్వచ్ఛీకరణ కూడా ఆశాజనకంగా లేకపోవడంపై ఆయన తహసీల్దార్లను నిలదీశారు. గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌, విజయవాడ - గూడూరు మూడో లైను, గుంటూరు - తెనాలి డబ్లింగ్‌ రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ, చినకాకాని - గుండుగొలను విజయవాడ బైపాసు రోడ్డు భూసేకరణ పైనా సమీక్షించారు. విజయవాడ బైపాసు రోడ్డు భూసేకరణ విషయంలో ఇంకా రూ.30 కోట్లకు పైగా డిపాజిట్‌ చేసిన నగదు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. 

 జిల్లాలో ఉపాధి హామీ పనులు జరుగుతోన్న తీరుపై ఆయన సమీక్షించారు. సీజన్‌లో పనులు ఎక్కువగా చేయడం లేదు. వర్షాకాలం వరకు సాగదీస్తున్నారు. ఆ తర్వాత హడావిడిగా ఏవేవో పనులు చేసి బిల్లులు డ్రా చేస్తున్నారు. ఇది సబబు కాదని ముత్యాలరాజు అన్నారు. జగనన్న హౌసింగ్‌ లేఅవుట్లలో ల్యాండ్‌ లెవలింగ్‌కు ఎందుకు ఎస్టిమేట్లు ఎక్కువగా వేశారో చెప్పాలని నిలదీశారు. చాలామంది ఇంకా రిటైర్‌మెంట్‌ మూడ్‌లో ఉన్నారని, ప్రభుత్వం 62 ఏళ్లకు సర్వీసు పొడిగించినందున వారు ఆ మూడ్‌ నుంచి బయటకు వచ్చి పని చేయాలన్నారు. 

సమావేశంలో రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ భరత్‌ గుప్తా, నగర కమిషనర్‌  కీర్తి చేకూరి, డీఆర్‌వో చంద్రశేఖర్‌రావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సత్యన్నారాయణరాజు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మాధవి సుకన్య, ప్రజారోగ్య శాఖ ఎస్‌ఈ శ్రీనివాసులు, హౌసింగ్‌ పీడీ సాయినాథ్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్‌, డ్వామా పీడీ యుగంధర్‌కుమార్‌, మెప్మా పీడీ వెంకటనారాయణ, జడ్పీ సీఈవో శ్రీనివాసరెడ్డి, సర్వే ఏడీ రూప్లా నాయక్‌, డీపీవో కేశవరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T05:46:59+05:30 IST