వైసీపీలో.. మిర్చి యార్డు చిచ్చు

ABN , First Publish Date - 2022-05-17T05:22:30+05:30 IST

మిర్చియార్డు నూతన పాలకవర్గం కూర్పు వైసీపీలో విభేదాలకు దారి తీస్తోన్నది.

వైసీపీలో.. మిర్చి యార్డు చిచ్చు
మిర్చి యార్డు

కొత్త పాలకవర్గం కూర్పుపై అసంతృప్తి

ఛైర్మన్‌ మార్పు ఉండదంట

వైస్‌ఛైర్మన్‌ సహా సభ్యులందరికీ నో ఛాన్స్‌

కసరత్తు జరుపుతోన్న వైసీపీ నేతలు

తమకే మళ్లీ అవకాశం ఇవ్వాలంటోన్న ప్రస్తుత సభ్యులు

గుంటూరు, మే 16 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డు నూతన పాలకవర్గం కూర్పు వైసీపీలో విభేదాలకు దారి తీస్తోన్నది. ఈ ఏడాది మార్చి నెల చివరి వారంతోనే పాలకవర్గం పదవీకాలం ముగియడంతో నూతన కమిటీని నియమించే ప్రక్రియని ఆ పార్టీ వర్గాలు చేపట్టాయి. ప్రస్తుతం పాలకవర్గంలో ఒక్క ఛైర్మన్‌కు మాత్రమే మరోసారి అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. వైస్‌ ఛైర్మన్‌తో సహా మిగతా సభ్యులందరినీ కొత్త వారిని నియమించనున్నట్లు పార్టీ వర్గాలకు సమాచారం అందించారు. దీంతో పదవులు పోయిన ప్రస్తుత కమిటీలోని మిగతా సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోన్నారు. తమనే తిరిగి కొనసాగించాలని నేతలపై ఒత్తిడి చేస్తోన్నారు. దీంతో పాలకవర్గం కూర్పు వాయిదా పడుతూ వస్తోన్నది. దీని వలన అటు పాలకవర్గం లేక ఇటు పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌ నియామకం జరగక యార్డులో పరిపాలన వ్యవహారాలపై ప్రభావం పడుతోన్నది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే పదవిలో ఉన్న పాలకవర్గాలను రద్దు చేసింది. గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన చంద్రగిరి ఏసురత్నంకు మిర్చియార్డు ఛైర్మన్‌ పదవిని ప్రకటించింది. దాంతో 2020 సంవత్సరం ప్రారంభంలో ఆయన నేతృత్వంలో కమిటీ కొలువుదీరింది. ఆ వెంటనే కరోన రావడంతో 2021లో ఏడాది పదవీకాలం ముగిసినప్పటికీ మరో సంవత్సరం పాటు మొత్తం పాలకవర్గాన్ని కొనసాగిస్తూ మార్కెటింగ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంవత్సరం మార్చి నెలతో పొడిగించిన పదవీకాలం కూడా ముగిసింది. దాదాపుగా రెండు నెలలు పూర్తి కావొస్తోన్నప్పటికీ ఇప్పటివరకు కొత్త పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించలేదు. సహజంగా పాలకవర్గం లేకుంటే జాయింట్‌ కలెక్టర్‌/మార్కెటింగ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ని పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌గా నియమించి పరిపాలన వ్యవహారాలు సాఫీగా జరిగేలా చూస్తారు. అలాంటిది ఇప్పటివరకు ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోలేదు. కాగా తనకు మరోసారి ఛైర్మన్‌ పదవిని కొనసాగించాలని చంద్రగిరి ఏసురత్నం వైసీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసుకోవడంతో ఆయనకు మరో ఏడాది పాటు అవకాశం కల్పించాలని ఆ పార్టీ హైకమాండ్‌ నిర్ణయించింది. ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ జిల్లా నాయకులకు తెలియజేశారు. కమిటీలో మిగతా పదవులను మాత్రం కొత్త నాయకులు, కార్యకర్తలతో భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వారి అనుచరుల పేర్లను హైకమాండ్‌కు పంపుతోన్నారు.


Updated Date - 2022-05-17T05:22:30+05:30 IST