గుక్కెడు నీరూ లేదయా!

ABN , First Publish Date - 2022-05-31T04:53:58+05:30 IST

నగరంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో (జీజీహెచ) రోగులు గొంతు తడుపుకుందామన్నా గుక్కెడు నీరు కరువవుతోంది.

గుక్కెడు నీరూ లేదయా!
జీజీహెచలో ఉన్న ఆర్వో ప్లాంట్‌

జీజీహెచలో దాహం దాహం

రూ.10 లక్షలతో ఐదు ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు

నిర్వహణ లేక 4 నెలల క్రితమే మూలకు..

వాటి మరమ్మతుకు డబ్బుల్లేవట!


నెల్లూరు (వైద్యం), మే 30 : నగరంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో (జీజీహెచ)  రోగులు గొంతు తడుపుకుందామన్నా గుక్కెడు నీరు కరువవుతోంది. ఆసుపత్రిలో మంచినీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్లు మరమ్మతులకు గురి కావడంతో వాటికి మరమ్మతు చేసే దిక్కు లేదు. ఎందుకని అధికారులను ప్రశ్నిస్తే ‘‘ఏం చేయమంటారు.. మా దగ్గర డబ్బుల్లేవ్‌.’’ అంటూ ఒకే సమాధానం వినిపిస్తోంది. దీంతో  బహిరంగ మార్కెట్లో రూ.20 పెట్టి లీటరు బాటిల్‌ కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి ఎక్కువగా నిరుపేదలు వస్తుంటారు. ఇలా వచ్చిన వారికి కనీసం రోజుకు నాలుగు బాటిళ్ల నీరు అవసరం. అయితే, జీజీహెచ అధికారులు ముందస్తు జాగ్రత్తలు లేకపోవడంతో తాగునీటికి అవస్థలు తప్పటం లేదు. పైగా ఇది వేసవి కాలం కావడంతో ఆసుపత్రిలో ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. నెల్లూరులో ఎందరో ప్రజాప్రతినిధులు ఉన్నా జీజీహెచలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం శోచనీయం.


పేరుకు 5 ఆర్‌వో ప్లాంట్లు


ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు శుద్ధజలం అందించేందుకు రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేసి 5 ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు.   ప్రసూతి ఆసుపత్రిలో మూడు, ప్రధాన జనరల్‌ ఆసుపత్రిలో మరో రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఆయా  ప్లాంట్ల ద్వారా గంటకు 4వేల లీటర్ల నీరు వచ్చే సామర్థ్యం ఉంది. ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ల నిర్వహణ మొదట్లో బాగానే ఉండేది. అయితే, రెండేళ్లుగా వీటి నిర్వహణను అంతంత మాత్రంగా మారింది. ఈ ఐదు ఆర్వో ప్లాంట్లు పూర్తిగా మరమ్మతుకు గురయ్యే దాకా అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం వాటికి మరమ్మతు చేయాలంటే రూ.2లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆర్‌వో ప్లాంట్‌లో శాండ్‌, కార్బన, ఫిల్టర్లు మార్చాల్సి ఉంది. అంత వెచ్చించి మరమ్మతు చేయలేమని, జీజీహెచలో నిధులు లేవని అధికారులు చేతులెత్తేశారు. ప్రసూతి ఆసుపత్రిలో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. 


దాత ముందుకు వచ్చినా...


ఇదిలా ఉంటే ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో తాగునీటికి రోగులు పడుతున్న అవస్థలు గమనించి మురళీకృష్ణ అనే లయన్సక్లబ్‌ సభ్యుడు తాను ఓ ఆర్‌వో ప్లాంట్‌ ఏర్పాటు చేయిస్తానని ముందుకు వచ్చారు. ప్రసూతి ఆసుపత్రి వద్ద ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అక్కడ ఓ రేకుల షేడ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. అధికారులు ఏపీ ఎంఎ్‌సఐడీసీ అధికారులతో ప్రతిపాదనలు వేయించగా, రూ.1.80 లక్షలు అవసరం అవుతుందని  తేల్చారు. అయితే, అంత డబ్బు లేదని రూ.50వేలలోపు  నిర్మించాలని ఓ అధికారి సూచించారు. దీంతో ఆ రేకుల షేడ్‌ ఏర్పాటు కూడా ఆలస్యం అవుతోంది. దాతల ద్వారా  ఆర్‌వో ప్లాంట్లను మరమ్మతు చేయించేందుకు అధికారులు కృషి చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఉన్నా ఇలాంటి సమస్యలు పరిష్కారంలో చొరవ చూపడం లేదన్న విమర్శలూ లేకపోలేదు.


శుద్దమైన త్రాగునీరు లేవు 


కాలు బాగాలేక ఆసుపత్రిలో ఉన్నాను. ఇక్కడ తాగేందుకు మంచినీరు కూడా లేదు. చేసేది లేక స్నానాలు చేస్తున్న నీటిని పట్టుకుని తాగుతున్నా. బయట డబ్బులు పెట్టి కొనే పరిస్ధితి లేదు. ఆసుపత్రిలో తాగునీరు అందుబాటులో ఉంచాలని చాలా మంది రోగులు, సహాయకులు కోరుతున్నా ఆర్‌వో ప్లాంట్‌లు మరమ్మతుకు గురయ్యాయని చెబుతున్నారు. వాటిని బాగుచేసి వినియోగంలోకి తీసుకు రావాలి. 

- రమణయ్య


నీరు కొనాలంటే సాధ్యమా!?

పేరుకు పెద్దాసుపత్రి అయినా ఇక్కడ రోగులకు కనీసం తాగునీరు కూడా అందించలేని దుస్థితి నెలకొంది. ఇలాంటి  పరిస్థితి బహుశా ఎక్కడా ఉండకపోవచ్చు. బయట  రూ.20 పెట్టి నీళ్లు కొనాలంటే పేదలకు సాధ్యమా అన్న ఆలోచన అధికారులకు లేకపోవడం దురదృష్టకరం. 

- కిన్నెరకుమార్‌

Updated Date - 2022-05-31T04:53:58+05:30 IST