గుజరాత్‌లో మధ్యవర్తిత్వ కేంద్రం ఎందుకో?

ABN , First Publish Date - 2022-02-03T07:48:44+05:30 IST

అంతర్జాతీయ న్యాయపరిధిలో ఉన్న అంశాలను సకాలంలో పరిష్కరించేందుకు గుజరాత్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ (ఐసీఏడీఆర్‌) కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు తాజా బడ్జెట్‌లో.....

గుజరాత్‌లో మధ్యవర్తిత్వ కేంద్రం ఎందుకో?

ఇప్పటికే ఢిల్లీలో ప్రధాన కేంద్రం కార్యకలాపాలు.. సొంత రాష్ట్రం కోసం ఢిల్లీ కేంద్రానికి అన్యాయం

తెలంగాణలో ఏర్పాటైన సంస్థకూ నష్టం

హైదరాబాద్‌ నుంచి వ్యాపారవర్గాల దృష్టి మళ్లింపే లక్ష్యం

గుజరాత్‌లో ఐసీఏడీఆర్‌ ప్రకటన 

వెనుక మోదీ ఉద్దేశం ఇదే అంటున్న నిపుణులు

ఆర్బిట్రేషన్‌ కేంద్రం గుజరాత్‌లో ఎందుకో?

హైదరాబాద్‌ ప్రాధాన్యం తగ్గించేందుకేనా?


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ న్యాయపరిధిలో ఉన్న అంశాలను సకాలంలో పరిష్కరించేందుకు గుజరాత్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ (ఐసీఏడీఆర్‌) కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు తాజా బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో హైదరాబాద్‌లో భారీస్థాయిలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ - ఐఏఎంసీ) ప్రాధాన్యాన్ని తగ్గించేందుకే... గుజరాత్‌లో మరో కేంద్రాన్ని నెలకొల్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని న్యాయనిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో భారత ప్రభుత్వం నెలకొల్పిన ఐసీఏడీఆర్‌ కేంద్రం ఉంది. దీని ప్రాంతీయ కేంద్రాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. 


అంతర్జాతీయ, స్వదేశీ వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు కొత్త వేదికను ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే ఐసీఏడీఆర్‌ను నెలకొల్పినట్లు ఆ సంస్థ వెబ్‌సైట్‌లో వివరించారు. దానికి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాట్రన్‌గా ఉన్నారు. వివిధ అంతర్జాతీయ సంస్థలతో ఐసీఏడీఆర్‌ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. మోదీ తలచుకుంటే ఈ సంస్థకు ప్రాచుర్యం పెంచవచ్చు... కానీ గుజరాత్‌లో మరో కేంద్రాన్ని నెలకొల్పడం ద్వారా ఢిల్లీలోని కేంద్రాన్ని బలహీనపర్చి, సొంత రాష్ట్రానికి మరింత  ప్రయోజనం చేకూర్చడమే మోదీ ఉద్దేశమని న్యాయనిపుణులు భావిస్తున్నారు. అంతేగాక హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో ఏర్పాటుచేయనున్న మధ్యవర్తిత్వ కేంద్రం ప్రయోజనాలను దెబ్బతీయడం కూడా మోదీ ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఒక ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఐఏఎంసీ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వ్యాపార వివాదాల పరిష్కారానికి హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చి, వ్యాపార సంస్థలకు అనుకూల వాతావరణం తమ రాష్ట్రంలో ఉందనే సంకేతాలు పంపించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ తీసుకున్నారనే అభిప్రాయం నిపుణుల్లో ఉంది. అయితే హైదరాబాద్‌ కేంద్రం నుంచి వ్యాపార వర్గాల దృష్టిని మళ్లించేందుకు మోదీ ఆగమేఘాలపై గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో కేంద్రం ఆధ్వర్యంలో మరో సంస్థను నెలకొల్పాలని నిర్ణయించారని న్యాయనిపుణులు భావిస్తున్నారు. 


గుజరాత్‌, మహారాష్ట్రలకు చెందిన అదానీ, అంబానీ వంటి అనేక బడా పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఒక రకంగా ఇది వ్యాపారపరంగా తెలంగాణతో గుజరాత్‌ పోటీపడడం లాంటిదేనని, నరేంద్ర మోదీ ఫక్తు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఈ విషయంలో వ్యవహరించారని ఈ వర్గాలు అంటున్నాయి. పైగా గుజరాత్‌ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని బడ్జెట్‌లో ప్రకటించడం, కేంద్ర న్యాయశాఖ పరిధిలో దీన్ని ఏర్పాటుచేయాలని తలపెట్టడం ద్వారా హైదరాబాద్‌ కేంద్రం ప్రాధాన్యతను తగ్గించేందుకే మోదీ ప్రయత్నించారని తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ప్రధాన కేంద్రం ఉండగా మరో కేంద్రం గుజరాత్‌లో ఎందుకు అవసరమో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా వివరించలేకపోయింది.




Updated Date - 2022-02-03T07:48:44+05:30 IST